నేడు, రేపు ఏపీలో బంద్.. మన్యంలో అన్ని మూత..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి అన్నారు అయ్యన్న. అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్‌కు అఖిలపక్ష ప్రజా సంఘాలు పిలుపును ఇచ్చాయి.. ఈ బంద్‌కు ఏజెన్సీ అంతటా విశేష స్పందన లభిస్తోందని ఆదివాసీ, గిరిజన సంఘాలు చెబుతున్నాయి.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047లో భాగంగా టూరిజం పాలసీని ముందుకుతెచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకృతి సిద్ధమైన ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ప్రయివేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుందని మండిపడుతున్నారు.. పాలకుల విధానాల ఫలితంగా గిరిజన సలహా మండలి (టిఎసి), పీసా చట్టం వంటి గిరిజన రక్షణ కవచాలు ఒక్కొక్కటీ నిర్వీర్య దిశగా వెళ్తున్నాయని ఫైర్ అవుతున్నారు.. ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ రిజర్వేషన్‌ను కల్పించే జీవో 3 రద్దుతో అనేక మంది గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీకి రావడంతో ఇక్కడి గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండాపోయాయి. ఈ విషయమై ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు కొన్నాళ్లుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.. అయితే, బంద్ ప్రభావంతో అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి.. ఇక, నేడు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేశారు అధికారులు.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటడంతో ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు పోలీసులు.. అయితే, వాహనాల రాకపోకలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు..
అన్ని శాఖలతో నేడు సీఎం చంద్రబాబు భేటీ..
ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు.. ఫైళ్ల క్లియరెన్సు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇతర పాలనాపరమైన అంశాలపై సమీక్షించనున్నారు.. పాలనలో వేగం పెంచే అంశంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.. ఇదే క్రమంలో సంక్షేమ పథకాల అమలు తీరు, సూపర్ సిక్స్ లోని ఇతర హామీలపైనా మంత్రులు, కార్యదర్శులతో చర్చించనున్నారు.. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు హాజరుకానున్నారు.. వీరితో పాటు అన్ని శాఖల కార్యదర్శుల కూడా హాజరుకానుండటంతో సచివాయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. ఈ సమావేశానికి వచ్చే వారికి ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మీనా సూచించారు.. ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు, వారి కార్యదర్శులు అందుబాటులో ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో వివరించనున్నారు.. దీనికి అనుగుణంగా టీవీలు, మైకులు ఏర్పాటు చేశారు. సమావేశం జరిగినంత సేపు విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. సమావేశానికి హజరయ్యే వారికి స్వాగతం పలికేలా ఫ్లెక్సీలతో పాటు సమావేశం వివరాలను తెలిపే బ్యాక్ డ్రాప్ట్ బోర్డులను కూడా సిద్ధం చేశారు. సమావేశం జరిగే మందిరాన్ని తీర్చిదిద్దండంతో పాటు భోజనాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను సాదారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ అధికారులతో పాటు ఐ అండ్ పీఆర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇవాళ్టి సమావేశం రెండు సెషన్‌లుగా జరగనుంది.. మొదటి సెషన్‌లో ఫైళ్ల క్లియరెన్స్.. జీఎస్‌డీపీ సెకండ్ సెషన్‌లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీంతో పాటు ఏపీ బడ్జెట్‌పై అధికారులతో చర్చించనున్నారు.
తెలంగాణలో బీర్ల ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి!
తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై 15 శాతం మేర ధర పెంపునకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీపై 15 శాతం మేర పెంచి బీర్లను విక్రయిస్తారు. దీని ప్రకారం.. కింగ్‌ఫిషర్ లైట్ బీర్ ధర ప్రస్తుతం ఉన్న రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ప్రస్తుతం ఉన్న రూ.160 నుంచి రూ.190కి పెరగనుంది. కింగ్‌ఫిషర్ అల్ట్రా, బడ్‌వైజర్, టుబోర్గ్, కార్ల్స్‌బర్గ్, హీనెకెన్, మిల్లర్, హేవార్డ్స్ 5000, రాయల్ ఛాలెంజ్ లాంటి బీర్ల ధరలు పెరగనున్నాయి. బీర్ల ధర సరిగ్గా ఎంత పెరుగుతుంది అన్నది నేడు స్పష్టత రానుంది.
ఢిల్లీలో ఆప్ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ పోస్టుమార్టం.. ఏం చెప్పారంటే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కేజ్రీవాల్, ఆప్ ఓటమిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోస్టుమార్టం నిర్వహించారు. ఓటమికి గల కారణాలను వెల్లడించారు. లిక్కర్ స్కామ్‌లో బెయిల్ పొందిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం వ్యూహాత్మక పెద్ద తప్పు అని తేల్చారు. అరెస్టైనప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే బాగుండేదన్నారు. ఇక పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత.. అనంతరం ఇండియా కూటమిలో చేరడం.. మళ్లీ అందులోంచి బయటకు రావడం హెచ్చుతగ్గుల వైఖరి కనిపించింది అని చెప్పారు. దీంతో కేజ్రీవాల్ విశ్వసనీయత దెబ్బతీసిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇక ఎన్నికల ముందు వేరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం ఘోర తప్పిందం అన్నారు. దీంతో బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోవల్సి వచ్చిందని విశ్లేషించారు. వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ మేథోమథనం చేసి చెప్పారు.
ఫ్రాన్స్‌లో మోడీ పర్యటన.. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లారు. పారిస్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోడీకి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘనంగా స్వాగతం పలికారు. మోడీని మాక్రాన్ కౌగిలించుకుని స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘నా స్నేహితుడు, అధ్యక్షుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలవడం ఆనందంగా ఉంది.’’ అని ప్రధాని మోడీ తెలిపారు. ఇక ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పారిస్‌లో విందు ఇచ్చారు. ఈ విందుకు మోడీ హాజరయ్యారు. ఈ విందులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా మోడీ కలిశారు. అంతకముందు విమానాశ్రయంలో మోడీకి భారతీయ ప్రవాసులందరూ స్వాగతం పలికారు. ‘‘మోడీ… మోడీ’’.. ‘భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలతో స్వాగతించారు. ఈ స్వాగతానికి మోడీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చిరస్మరణీయ స్వాగతం అంటూ అభివర్ణించారు. అలాగే ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకార్న్ కూడా మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.
హమాస్‌కు హెచ్చరిక జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గాజాలో ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. “అక్కడ మిగిలి ఉన్న బందీలను విడుదల చేయాలి. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపాలి” అని ట్రంప్ స్పష్టం చేశారు. బందీలను విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గాజాలో యుద్ధ విరమణ ఒప్పందం కింద గత మూడువారాలుగా ప్రతి శనివారం బందీలను విడిచిపెడుతున్నారు. ఈ శనివారానికి కూడా అందరూ అదే ఆశించారు. బందీల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, ఈ సారి పరిస్థితులు అనుకున్నట్లుగా జరిగలేదు. దీనిపై కుటుంబసభ్యులు నిరసన చేపట్టి తెల్ అవీవ్‌ను ముట్టడించారు.
జస్ప్రీత్ బుమ్రాపై నిర్ణయం నేడు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియా పర్యటన చివరలో జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగే మూడో వన్డేలో బుమ్రా ఆడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని వార్తలు వచ్చినా . అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బుమ్రా ఉన్నాడు. దీంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. బుమ్రాను ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేందుకు ఎన్‌సీఏ గట్టి ప్రయత్నమే చేస్తోంది. టీమిండియా యాజమాన్యం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని తెలుసుకుంటోంది. మంగళవారం చివరగా బుమ్రాను వైద్య బృందం పరీక్షించి.. ఫిట్‌నెస్ నివేదికను బీసీసీఐకి అందజేయనుంది.
గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!
మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెర పైన సందడి చేసిన ఆమె మెల్లగా బాలీవుడ్ పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో మొదటి చిత్రం ‘సితారామం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది మృణాల్. సీత పాత్రలో చెరగని ముద్ర వేసుకుంది. తన నటనతో అందంతో అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్ వచ్చినప్పటికి అచితూచి సినిమాలు చేసింది. దీంతో స్టార్ హీరోయిన్‌లకు ఈ అమ్మడు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు కానీ గ్యాప్ ఇచ్చింది. ఎవరికైనా స్టార్ డమ్ ఉన్నప్పుడే అవకాశాలు ఎక్కువగా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మృణాల్ ఠాకూర్ పరిస్థితి మరొక లాగా ఉన్నదట. రీసెంట్‌గా హీరో శివ కార్తికేయన్‌కి జంటగా ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది. కారణమేంటో తెలియదు కానీ ఆ మూవీని తాను వదులుకున్నదట. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న మృణాల్‌ని ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు అనే ప్రశ్న తలెత్తడంతో.. మృణాల్ మాట్లాడుతూ ‘నేను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారు. అందుకే వచ్చిన ప్రతి సినిమా ఓకే చేయకుండా, నా పాత్రల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మరి అడుగులు వేస్తున్నా. అందుకే సినిమా సినిమాకు అంత మేరకు గ్యాప్ వస్తుంది’ అని తెలిపింది. కానీ ప్రజంట్ తన చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి? అనే దాని మాత్రం చెప్పలేదు. తెలిసినంత వరకు టాలీవుడ్ లో మాత్రం మృణాల్‌కి ఎలాంటి అఫర్ లు లేవని టాక్.
మున్నా భాయ్ 3లో నాగార్జున..?
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ చేయాలని హిరాని ఎప్పుడో అనుకున్నారు. పలు కారణాల చేత అది డిలే అవుతూ వస్తుంది. కానీ ఇన్నేళ్లు అది పట్టాలెక్కుతోంది. మూడోసారి మున్నాభాయ్‌గా సంజయ్ దత్ అలరించడానికి రెడీ అయ్యారు. ఇక వైరల్ న్యూస్ ఏంటి అంటే ఈ చిత్రంలో కీలక పాత్రకు నాగార్జునను అడిగారని, ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం.ఇక నాగార్జున ‘నా సామిరంగా’ మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీయలేదు. కానీ ఈ మధ్య పలు చిత్రల్లో వరుసగా ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ప్రజంట్ ‘కుబేర’లో ధనుష్‌తో, ‘కూలీ’లో రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘మున్నాభాయ్-3’లో సంజయ్‌తో జట్టు కట్టబోతున్నారట. ఇక పాత్ర ఎలాంటిదైనా హిరాని లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నాగ్ నటిస్తున్నారంటే కచ్చితంగా మంచి హిట్ అవుతుందుంది. ఈ వార్త నిజమైతే కనుక అక్కినేని ఫ్యాన్స్‌కి అది హ్యాపీ న్యూసే.