సమస్యలైనా పరిష్కరించండి.. ప్రత్యేక రాష్ట్రం అయినా ఇవ్వండి..
సీమ సమస్యలు పరిష్కరించండి.. రాయలసీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందేనని స్పష్టం చేశారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి… రాయలసీమకు జరుగుతోన్న అన్యాయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనమే అని ఆందోళన వ్యక్తం చేశారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎందుకు అడ్డుకోరు..? అని ప్రశ్నించారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, కొప్పల జిల్లాలకూ నష్టమే అన్నారు.. ఇక, సంగమేశ్వరం వద్ద ఉయ్యాల వంతెన కాదు.. బ్రిడ్జి కం బ్యారేజి కావాలని డిమాండ్ చేశారు.. సీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందే నంటూ మరోసారి ప్రకటించారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..
గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులారా అలెర్ట్.. ఇక, ఈ సర్టిఫికెట్ ఉండాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేసింది.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు) పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక, వంద మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సాధారణ పరిపాలనా శాఖ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్ధులు కనీసంగా 30 మార్కులు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులను సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.. గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్.. అంటే, కొత్త రూల్స్ ప్రకారం.. గ్రూప్ – 2 లేదా గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) పాస్ కావాల్సిందే. సీపీటీ పరీక్షలో.. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్.. బేసిక్ కంప్యూటింగ్.. విండోస్.. ఇంటర్నెట్ తదితర అంశాల్లో అభ్యర్థులు పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిస్టర్ మాలోకం మీసం మెలేస్తున్నారు.. చంద్రబాబు తొడలు కొడుతున్నారు
మిస్టర్ మాలోకం మీసం మెలేస్తున్నారు.. చంద్రబాబు తొడలు కొడుతున్నారు అంటూ.. నారా లోకేష్, చంద్రబాబుపై పంచ్‌లు విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు.. అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది, సైకో ప్రభుత్వం నడుస్తుందని మాటాడుతున్నారు బాబు.. పట్టాభిలాంటి ఒళ్లు బలిసిన పంది నోటికొచ్చింది మాటాడితే కార్యకర్తలు తన్నటానికి ప్రయత్నించారని తెలిపారు.. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా తన్నటం జరుగుతుందని హెచ్చరించారు.. 40 ఏళ్ల రాజకీయం చెసిన మీరు, కరెంట్ చార్జీలు తగ్గించన్నందుకు కాల్చి చంపేయటం ప్రజాస్వామ్యమా? అని నిలదీశారు.. ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులు కట్టబెట్టడం ప్రజాస్వామ్యమా..? ముద్రగడ పద్మనాభం.. బాబు ఇచ్చిన హామీకోసం, రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే ఎలా హింసించారో తెలుసని మండిపడ్డారు.. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు అది ఎలాంటి ప్రజస్వామ్యం? అని మండిపడ్డారు.. ముహూర్తం పెట్టుకొని తేల్చుకుంటాను రమ్మంటున్నాడు చంద్రబాబు.. 23 సీట్లతో మూలనకూర్చో బెట్టారు చూడు అదే బట్టలూడదీయటం అంటే అని ఎద్దేవా చేశారు.. 2024 ఎన్నికల ముహూర్తంలో నువ్వో మేమో తేల్చుకుందాం ? అంటూ సవాల్ విసిరారు అప్పలరాజు.
మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది
మహారాష్ట్ర అభివృద్ధిలో తమ బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ముంబయిలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన ఆమె.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ అభివృద్ధిపై ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణతో 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తమ బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించి.. తెలంగాణలో చేస్తున్న పనుల్ని ఆ రాష్ట్రంలో చేయాల్సిందిగా అక్కడి ప్రజల నుంచి తమకు కొన్ని సంవత్సరాలుగా విజ్ఞప్తులు అందుతున్నాయన్నారు.
దొంగ బాబా లైంగిక వేధింపులు.. స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు దందా!
ఓవైపు ప్రపంచ దేశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే.. మరోవైపు మన భారతదేశంలో మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. ఫలానా పూజలు చేస్తే తమ బతుకులు బాగుపడతాయని, బలిదానాలు ఇస్తే కనకవర్షం కురుస్తుందని.. చాలామంది ప్రజలు ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని.. కొందరు దొంగ బాబాలు దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి, దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా.. స్త్రీలనే టార్గెట్ చేసుకొని, వారికి మాయమాటలు చెప్పి, అశ్లీల దందాలకు దిగుతున్నారు. జడ్చర్లలోనూ ఓ దొంగ బాబా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. చివరికి అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ దొంగ బాబా పేరు జైనుల్లబుద్దీన్. ఇతను జడ్చర్లలో ఉంటాడు. నగ్నంగా పూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మబలికేవాడు. హైదరాబాద్‌లోని తమ గురువు వద్ద ఒకరోజంతా గడిపితే.. కాసుల వర్షానికి హద్దే ఉండదని నమ్మించాడు. అయితే.. ఇక్కడ ఒక షరతు కూడా పెట్టేవాడు. గురువుతో గడిపే సమయంలో వేరే భావన మదిలో మెదలకూడదని, పరాయి మగాడితో గడుపుతున్నామనే భావన ఒక సెకండ్ కూడా ఆలోచించకూడదని చెప్పేవాడు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే.. ధారగా కురిసే కనకవర్షం మధ్యలోనే ఆగిపోతుందని హెచ్చరించాడు. అదృష్టం మరుగున పడి, దురదృష్టం ఆవహిస్తుందని చెప్పాడు. నగ్న పూజలు చేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే మాత్రం.. రావాల్సిన అదృష్టం మాయమైపోతుందని అనేవాడు. పూజలో పూర్తిగా లీనమైపోవాలని కండీషన్ పెడతాడు.
ఈటల రాజేందర్ సవాల్.. అది నిరూపిస్తే, ముక్కు నేలకు రాకుతా
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందని నిరూపిస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని ఛాలెంజ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారి, భూములు అమ్ముకుంటోందని ఆరోపణలు చేశారు. ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్స్ కట్టిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంతవరకు పేదలకు గానీ, రైతులకు గానీ ఇళ్ల జాగాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌తో ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. దేశంలోనే ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పింఛన్లు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఎక్కడా పోవని, ఇంకా పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే మన పిల్లల బతుకులు బాగు పడతాయని అన్నారు.
ప్రధాని పదవి కోసమే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో పొత్తు కాదనుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో చేరారని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రి చేయడానికి జేడీయూ అధిష్టానం అంగీకరించిందని ఆరోపించారు అమిత్ షా. బాల్మీకి లోక్ సభ నియోజకవర్గంలో మాట్లాడిన షా, బీహార్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’లోకి నెట్టారని నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. ఆయనకు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేయబడ్డాయని అన్నారు. జయ్ ప్రకాశ్ నారాయణ్ తన జీవితాంతం కాంగ్రెస్, జింగిల్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడారని.. కానీ నితీష్ తన అవసరాల కోసం సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ లతో పొత్తు పెట్టుకున్నారని, ఆయన వికాసవాది కాదని, అవకాశవాది అని అన్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా ‘ఇన్ కార్’!
జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ‘గురు’ ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చి 3న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో రితిక సింగ్ మాట్లాడుతూ, “ఇది చాలా సీరియస్ అండ్ కంప్లీట్ రా ఫిల్మ్. ఈ సినిమా షూటింగ్ నాకో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్షకు కృతజ్ఞతలు. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్ర ఇది. చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర చేశాను. కొన్ని సీన్లు చేస్తున్నపుడు టీం అంతా ఏడ్చేసేవారు. రోజూ మనం అత్యాచారంకు సంబంధించిన వార్తలు హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. ఇలాంటి దారుణమైన సంఘటనలకు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయనేది ఇందులో చూపించాం. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఈ కథ విన్నప్పుడే నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని అర్ధమైయింది. దాదాపు షూటింగ్ అంతా కార్ లోనే చేశాం. ఈ కథకు కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ నేను తల స్నానం చేయలేదు. ఈ మూవీ చివర్లో ఒక గొప్ప హోప్ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్ కార్’ ని తప్పకుండా చూడాలి’’ అని అన్నారు.
దాస్ కా ధమ్కీ షూటింగ్ కి ఎండ్ కార్డ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో పాటు ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, మావా బ్రో సాంగ్స్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ డిలే కారణంగా, అనౌన్స్ చేసిన డేట్ కి బయటకి రాలేదు. కొత్త రిలీజ్ డేట్ కోసం విశ్వక్ సేన్ అభిమానులు వెయిట్ చేస్తున్న సమయంలో ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశాము అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడే కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చెయ్యడానికి సమయం పట్టొచ్చే. దాదాపు ‘దాస్ కా ధమ్కీ’ సినిమా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీతో నిఖిల్, అడివి శేష్ లాగా విశ్వక్ సేన్ పాన్ ఇండియా హిట్ కొడతాడో లేక విజయ్ దేవరకొండ లా చేతులు కాల్చుకుంటాడో చూడాలి.