నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను..
నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమె.. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అని వ్యాఖ్యానించారు.. ఇక, కొమరవోలు రావడం సంతోషంగా ఉందన్న ఆమె.. ఈ గ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోను.. ప్రజలు చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తెచ్చారు.. ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటిని.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలి… వర్గాలను పక్కన పెట్టండి. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండండి అని సూచించారు.
పోసానికి బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట దక్కింది.. పోసానికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, గత సోమవారం పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. పోసాని న్యాయవాదులు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లపై గత వారం రోజులలో రెండుసార్లు కడప మొబైల్ కోర్టు లో విచారణ జరిగింది.. సుదీర్ఘ విచారణ అనంతరం పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ పోసాని బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసింది.. ఇప్పుడు కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసినా.. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా.. పోసాని మళ్లీ పై కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది..
వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఇక, అదే రోజు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి సూచించారు.. ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం.. లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై వారి పక్షాన శాంతియుతంగా వైసీపీ ఈ కార్యక్రమం చేపడుతోంది.. పార్టీ క్యాడర్ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలకు కీలక సూచనలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..
ప్రజా భవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీల సమావేశం..
రేపు (శనివారం) ప్రజా భవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం అధ్యక్షతన భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు రాష్ట్రం పక్షాన పార్లమెంట్‌లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.
తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ..
తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన చలనం కల్పించింది ప్రభుత్వం. మిగిలిన 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు స్టాలిన్ ఆహ్వానం.. “డీలిమిటేషన్”పై మీటింగ్..
హిందీ వివాదం, డీలిమిటేషన్‌పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. సీఎం స్టాలిన్‌తో పాటు అధికార డీఎంకే పార్టీ నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. డీలిమిటేషన్ తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ చెబుతున్నారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగుగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని స్టాలిన్ వాదిస్తున్నారు. అయితే, ఒక్క సీటు కూడా తగ్గదని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇదిలా ఉంటే, డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా ‘‘జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)’’ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సమావేశం మార్చి 22న చెన్నైలో జరగనుంది. ఈ సమావేశానికి ఏడుగురు రాష్ట్ర నాయకులను స్టాలిన్ చెన్నైకి ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి ఉన్నారు. ఈ మేరకు ఆయన ఏడుగురు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వీరంతా జేఏసీలో చేరాలని కోరారు.
నన్ను ట్రాప్ చేశారు, విచారణలో విలపించిన రన్యా రావు..
గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక డీజీపీ రామచంద్రారావు సవతి కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్‌ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. అయితే, విచారణ సంమయంలో రన్యా రావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల ముందు తాను నిర్దోషి అని చెప్పడం కొనసాగించింది. విచారణ సమయంలో విలపించినట్లు తెలిసింది. నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా మరో కొత్త కోణాన్ని వెల్లడించింది. తన వద్ద నుంచి 17 బంగారు కబడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించింది. ఆమె దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా ప్రయాణించినట్లు చెప్పింది. పరస్పర విరుద్ధ వాదనలను విచారణలో వెల్లడించింది.
‘‘డ్రాగన్-ఏనుగు డ్యాన్స్’’.. మారిన చైనా స్వరం, భారత్‌కి స్నేహహస్తం..
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్‌తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్‌కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్‌ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం తర్వాత శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయడం మాత్రమే సరైన ఛాయిస్’’ అని అన్నారు. ఒకరినొకరు అణచివేయడానికి బదులుగా, మద్దతు, సహకారాన్ని బలోపేతం చేయడం, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నిలిచే బదులుగా, మా ప్రాథమిక ఆసక్తులు ఉన్నాయి అని అన్నారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిస్తే, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామ్యీరణ, గ్లోబల్ సౌత్ అభివృద్ధి, రెండు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. 2025 నాటికి చైనా-భారత్ దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవం అవుతాయని వాంగ్ అన్నారు.
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్.. ఇకపై ఆఫీసుకు రావాల్సిందే..
కోవిడ్ మహమ్మారి కాలంలో, టెక్ కంపెనీలతో పాటు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానం ద్వారా పనిచేయించుకున్నాయి. అయితే, మహమ్మారి తగ్గి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నెలలో 10 రోజలు ఆఫీస్ నుంచి పని చేయాలనే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని బుధవారం చెప్పింది. కొత్త హాజరు వ్యవస్థని అమలు చేయనుంది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతీ నెల నిర్దేశించిన రోజుల పాటు కార్యాలయం నుంచి పనిచేయాలి. కంపెనీలోని ఫంక్షనల్ హెడ్స్, వారి అసోసియేట్స్ ఇంటి నుంచి పని చేసే రోజులను పరిమితం చేయాలని ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ‘‘సిస్టమ్ ఇంటర్వెన్షన్’’ ప్రక్రియ డిపార్ట్మెంటల్ రిక్వెస్ట్ కన్నా, ప్రాజెక్ట్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దీని అర్థం.. వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌లు ఇకపై ఆటోమెటిక్‌గా ఆమోదించబడవు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఉద్యోగులు పంచ్ అటెండెన్స్ కోసం మొబైల్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా వర్క్ ఫ్రమ్ హోం రిక్వెస్ట్‌ని అంగీకరిస్తుంది. ఇప్పుడు దీనికి బదులుగా, ఉద్యోగులు ఆఫీసుల్లో 10 రోజులు ఫిజికల్‌గా కనిపించాలి.
90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్
మొబైల్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో తన పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బెనిఫిట్స్ ఎక్కువగా అందిస్తోంది. జియో మూడు నెలల వ్యాలిడిటీతో చాలా ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్లతో ఎక్కవ డేటా, ఉచిత ఓటీటీ యాప్ లను అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి జియోలో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందుకోవచ్చు. ఓటీటీ యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది. రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 90 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన అపరిమిత కాలింగ్ రూ. 899 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ. 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు . ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లకు రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే కంపెనీ 90 రోజుల పాటు 180GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది కాకుండా 20GB డేటాను ఉచితంగా వస్తుంది. దీంతో మొత్తం డేటా 200GB పొందొచ్చ. ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొ్చ్చు.
‘ఎన్టీఆర్’ భయంకరమైన లుక్.. ఏందన్న ఈ దారుణం?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఏది వంక పెట్టలేం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నటన పరంగా ఎన్టీఆర్‌ను కొట్టేవాడే లేడు. కానీ ఒక్కోసారి ఎన్టీఆర్ చేసే యాడ్స్ మాత్రం.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా చేస్తుంటాయి. కమర్షియల్‌గా చూస్తే ఎన్టీఆర్ ఎన్నో యాడ్స్ చేశాడు. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ఒక యాడ్ మాత్రం ట్రోలింగ్‌కు దారి తీసినట్టైంది. తాజాగా ఓ క్విక్ కామర్స్ కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్. అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి. యాడ్ కంటెంట్ ఎలా ఉన్నా.. టైగర్ లుక్ సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ స్టైల్ దారుణంగా ఉందని అంటున్నారు. అసలు.. టైగర్‌ను ఈ లుక్‌లో ఊహించుకుంటేనే దారుణంగా ఉందని ట్వీట్లు పడుతున్నాయి. ఆ యాడ్ ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏంటో? అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పటి వరకు తారక్ చేసిన యాడ్స్‌లలో ఇదే వరస్ట్ లుక్ అని అంటున్నారు. అన్నట్టు.. ఈ యాడ్‌లో నటి విద్యుల్లేఖ రామన్ కూడా మెరిసింది. ఇకపోతే.. యంగ్ టైగర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై అదిరిపోయే సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటను 500 మంది డ్యాన్సర్లతో భారీ ఎత్తున షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్‌కు థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ అంటున్నారు. ఈ వారంలోనే షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రజెంట్ టైగర్ లేని సీన్స్ షూట్ చేస్తున్నాడు నీల్. మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్‌లో ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. ఈ సినిమాల పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
వెకేషన్లో కొత్త జంట!
నాగచైతన్య, శోభిత వివాహం చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరినీ ఆశీర్వదించగా, మరి కొంత మంది విమర్శించారు కూడా. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తూ కపుల్ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు తన “తండేల్” సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇటీవలే సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు చైతూ తన భార్య, నటి శోభిత ధూళిపాళతో కలిసి ఒక ట్రిప్ కి వెళ్ళాడు. హనీమూన్ కాకుండా వివాహం తర్వాత వారి మొదటి వెకేషన్ ఇదే. వారు డిసెంబర్ 2024 లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వెకేషన్ కి వెళ్లడం ఇదే మొదటి సారి. ఇక శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “వైబ్స్” పేరుతో ఈరోజు తన వెకేషన్ ట్రిప్ నుండి ఫోటోలను షేర్ చేసింది. ఆమ్స్టర్డామ్, మెక్సికోలోని అనేక రెస్టారెంట్లలో వారు డిన్నర్ మరియు డెజర్ట్ తింటున్నట్లు ఫొటోలలో కనిపిస్తోంది. ఇక ఈ ఫోటో డంప్ లో స్మూతీలను ఆస్వాదించడం నుండి చిట్టి సమోసాల వరకు వారు ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ జంట హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. నాగ చైతన్య తన తదుపరి సినిమా గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.