అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ..! ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్‌లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. “ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు..” అని దుయ్యబట్టారు.
వారికి గుడ్‌న్యూస్.. రూ.176.35 కోట్ల విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఉపాధి హామీ పనిచేసేవారికి గుడ్‌న్యూస్ చెబుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం పనుల కోసం 176.35 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.. 2025-26 ఏడాదిలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను.. ఉపాధి హామీ పథకం పనుల కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్..
ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. ఆగస్ట్ 15న ఉచిత బస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు.ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ మనసుపెట్టి పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 175 నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం భారత్. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అలానే రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం. డీప్ టెక్‌తో టెక్నాలజీ బాగా పెరిగింది. వాట్సాప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయి. 2 నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సాప్లో ఉంటాయి. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జ్ టూల్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఆదాయం పెరగాలి.. అందరూ ఆరోగ్యం, ఆనందంగాఉండాలి. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారు అయింది. 26 జిల్లాల్లో రోడ్ మాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది’ అని చెప్పారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగ పర్చాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ‘ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదు. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యింది. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగ పర్చాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు.. నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనడు ఆయన. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని ఆయన కల్పించారు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్..
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్ లో భాగమైన రాజీవ్ ఘాయ్‌కు మరో బాధ్యత లభించింది. భారత ప్రభుత్వం ఆయనను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. దీనితో పాటు, ఆయన భారత DGMOగా కూడా పనిచేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో ధృవీకరించింది. భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పదవిని సృష్టించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భారత సైన్యంలోని ముఖ్యమైన పోస్టులలో ఒకటి. జూన్ 4న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ 2025 సందర్భంగా లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్‌కి ఉత్తమ యుద్ధ సేవా పతకం లభించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం విలేకరుల సమావేశానికి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) కాల్పుల విరమణ కోసం లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైకి ఫోన్ చేసి, ఆ తర్వాత మే 12న జరిగిన విలేకరుల సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు.
భారతీయుల వీసా నిషేధంపై సౌదీ ప్రభుత్వం క్లారిటీ
హజ్ యాత్ర సమయంలో భారతీయులకు వీసాలను నిషేధించారనే వార్తలను సౌదీ అరేబియా పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని సౌదీ ప్రభుత్వం చెబుతోంది. హజ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా భారతదేశంతో సహా 14 దేశాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సౌదీ ప్రభుత్వం ఈ నివేదికలను పుకార్లు అని పేర్కొంది. సౌదీ ప్రభుత్వం భారతీయ వీసాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని వార్తా సంస్థ ANI వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. ANI ప్రకారం.. సౌదీ అరేబియా భారతీయులకు వీసాలను రద్దు చేసిందనే వార్తలు అబద్ధం. సౌదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. హజ్ యాత్ర సమయంలో రద్దీని నివారించడానికి స్వల్పకాలిక వీసాలపై కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ, హజ్ యాత్ర ముగిసిన తర్వాత కూడా వీటిని తొలగిస్తారని తెలిపింది. హజ్ తీర్థయాత్రలో భాగంగా జూన్ 30 వరకు సౌదీ అరేబియా 14 దేశాల వర్క్ వీసాలను రద్దు చేసిందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 14 దేశాల జాబితాలో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, యెమెన్, మొరాకో, నైజీరియా, ఇథియోపియా, సూడాన్, ట్యునీషియా పేర్లు ఉన్నాయి.
హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ!
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. ఎఫ్‌ఆర్‌ఐ నమోదైన నేపథ్యంలోనే ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును కోరారు. మరోవైపు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యాయస్థానంను ఆశ్రయించింది. తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..
నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ముందు నుంచే అనౌన్స్ మెంట్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ డేట్ ను కూడా ఇలాంటి వీడియోతోనే అనౌన్స్ చేశారు. సప్తమి గౌడ, స్వాసిక మాట్లాడుతూ.. మేం అడగడం వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటారు. ఇంతలోనే లయ వచ్చి మీరెవరు.. వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అని సెటైర్లు పేలుస్తుంది. దీంతో లయ, వర్ష బొల్లమ్మ ఇద్దరూ వారి ముఖాలను చూసి నవ్వుకుంటారు. ఈ గ్యాప్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వచ్చి వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రావాల్సిందే. అది ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు వస్తుందని ప్రకటిస్తాడు. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాజమౌళి- మహేశ్ బాబు మూవీ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో రాజమౌళి- మహేశ్ ప్రాజెక్ట్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ న్ను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్ విలన్ రోల్ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని టాక్. దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ. ఇంతవరకు ఈ మూవీలోని ఒక్క పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. ఇందులో ఆర్.మాధవన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు కూడా ఇటీవల టాక్ వినిపించింది. త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం. ప్రజంట్ మాధవన్ కూడా డిఫరెంట్ కంటెంట్‌ను ఎంచుకుంటు మంచి మంచి సినిమాలు సిరీస్‌లో నటిస్తూ ఫామ్ లోనే ఉన్నారు. కానీ దీని గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.