డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం.. వారే నాకు ఆదర్శమన్న లోకేష్
ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మొదట పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్‌ను సందర్శించారు. ఆ తర్వాత విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని అన్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని కోరారు. ఇక, మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే భోజనం తమకు పౌష్టిక విలువలు అందిస్తుందని, ఉన్నతమైన విద్య చదువుకోవడానికి ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు విద్యార్ధులు.. విద్యార్ధులతో కలిసి మంత్రి లోకేష్ భోజనం చేశారు… మధ్యాహ్న భోజనం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు.. మరోవైపు, ఇక్కడనున్న జూనియర్ కళాశాల బయట సీసీ కెమెరాలు పెట్టిస్తాను అన్నారు మంత్రి లోకేష్.. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల మధ్య ఉన్న తేడాలు లేకుండా చేస్తాం.. ప్రైవేటు విద్యలో వచ్చిన అభివృద్ధిని ప్రభుత్వ కాలేజీలు కూడా తీసుకొస్తాం అన్నారు.. కళాశాలలకు ప్రత్యేకంగా ఒకే విధంగా ఉండేలా రంగులు వేయాలని చూస్తున్నాం.. దేనికైనా ఫిట్నెస్ కంటే సంకల్పం కావాలి అన్నారు.. సింగపూర్ ప్రధానిగా పని చేసిన లీక్వానీ, భారత ప్రధానిగా పని చేసిన వాజ్ పేయి, మా నాన్న చంద్రబాబు.. నాకు ఆదర్శం అని ఈ సందర్భంగా వెల్లడించారు నారా లోకేష్..
తాను చనిపోయినా ముగ్గురికి ప్రాణదానం..
కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడుకి చెందిన పెద్దయ్య (59) మొదడులో నరాలు చిట్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి అచేతనావస్థలోకి వెళ్లారు. పెద్దయ్య కుటుంబ సభ్యులతో ఏపీ జీవన్ దాన్, సమన్వయకర్త, కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించడంతో అవయవదానానికి అంగీకరించారు. లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. తండ్రి చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం తమకు గర్వంగా ఉందన్నారు పెద్దయ్య కుటుంబ సభ్యులు..
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో పథకం ఆనందం..
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు.. రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలనే లక్ష్యంగా 475 కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించామన్న తెలిపారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాలలో నెలకొన్న గదుల కొరత తదితర సమస్యలను సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు.
మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలు.. కాలేజీల్లో హాజరు శాతం పెరుగుతుంది..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ రోజు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం.. విజయవాడలో ఈ పథకానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టగా.. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.. ఇక, బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నామని వెల్లడించారు.. మరోవైపు.. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు మంత్రి అనగాని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు.. విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని, ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరగటంతో పాటు, మంచి ఫలితాలు అందుతాయన్నారు.. అందుకోసమే మంత్రి నారా లోకేష్.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు… విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు అనగాని సత్యప్రసాద్..
కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి, మంత్రులకి సత్సంబంధాలు లేవని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింని తప్పుడు ప్రచారం చేశారు.. పదేండ్లలలో నాలుగు లక్షల కోట్లు తాము అప్పులు చేస్తే, ఏడాదిలో లక్ష ముప్ఫె వేల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ఏటీయం అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. పిచ్చోడి చేతిలో రాయి అయ్యింది తెలంగాణ పరిస్థితని తెలిపారు. తన మీద ఆరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కొట్లాడాలని కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేసి కమిటీలు వేసుకుందామన్నారు. ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ అమలు అయ్యిందా అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ అమలు.. వందశాతం అమలు అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పానని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పరిపాలన చాతనవడం లేదు.. సాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రెగ్యులేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.. నాలుగు లక్షల పెళ్ళిలు అయ్యాయి గానీ కళ్యాణలక్ష్మీ ఇవ్వలేదని ఆరోపించారు. 7500 రైతుబంధు కాదు.. 75 పైసలు ఇవ్వలేదని తెలిపారు.
నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమావేశం.. కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ క్రమంలో.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు.. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మహారాష్ట్రలో ఏం జరుగుతోంది.. సీఎం ఫడ్నవీస్‌పై విపక్ష నేతల ప్రశంసలు..
మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై విపక్ష నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ అంటేనే కోపంతో రగిలిపోయే శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఇటీవల ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. గడ్చిరోలి జిల్లాలో సీఎం సమక్షంలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. శివసేన పత్రిక సామ్నాలో ఫడ్నవీస్ కృషిని పొగిడారు. అయితే, బీజేపీకి మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల్ని మాత్రం ఆయన ఖండించారు. ప్రజలు తమకు ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పునిచ్చారని అన్నారు. ప్రత్యర్థులు చేసిన మంచిని కూడా తాము అభినందిస్తామని అన్నారు. గడ్చిరోలి వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాను అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఉక్కు నగరంగా తీర్చిదిద్దాలని ఫడ్నవీస్ భావిస్తే, మావోయిస్టుల నిర్మూలనకు ప్రయత్నాలు చేస్తుంటే శివసేన ఠాక్రే వర్గం దానిని స్వాగతిస్తుందని అన్నారు.
చైనాలో కరోనా లాంటి పరిస్థితులు.. సాధారణ ఇన్ఫెక్షన్స్ అంటున్న డ్రాగన్..
‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది. అంతర్జాతీయ నివేదికలు ప్రస్తుతానికి చైనాకు ట్రావెల్ ప్లాన్స్‌ని పున:పరిశీలించాలని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆందోళనలు పరిష్కరించడానికి చూనా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ శుక్రవారం మాట్లాడుతూ.. శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్టస్థాయికి చేరుకున్నాయని చెప్పారు. చైనా పౌరులు, చైనాకు వచ్చే విదేశీయుల ఆరోగ్యం గురించి చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. చైనాకు రావడం సురక్షితమని చెప్పుకొచ్చారు.
దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్.. రూ.5.32 లక్షలే!
మారుతీ తన డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 2,52,693 యూనిట్లను విక్రయించింది. ఈ రికార్డు విక్రయంలో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్ సెగ్మెంట్ అయిన ఈకో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. వాస్తవానికి.. గత నెలలో ఈకో 11,676 యూనిట్లు విక్రయం జరిగింది. గతేడాది డిసెంబర్‌లో 10,034 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశేషమేమిటంటే.. ఈ కారు సైలెంట్‌గా అమ్ముడైంది. దీని గురించి ఎవ్వరూ పెద్దగా ప్రస్తావించలేదు. కానీ అమ్మకాల పరంగా ఇది చాలా కార్ల కంటే మెరుగ్గా ఉంది. ఈకో ఓ యుటిలిటీ కారు.. ఇది 5, 7 సీట్ల ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది. ఈకో బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.32 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 6.58 లక్షల ఎక్స్-షోరూమ్‌కు వరకు ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 81 పీఎస్ పవర్, 104.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ మోడల్‌లో కూడా దొరుకుతుంది. సీఎన్‌జీలో నడుస్తున్నప్పుడు దాని పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్‌జీ వేరియంట్ 72 పీఎస్ పవర్, 95ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజీ గురించి చూస్తే.. పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ ఇంజన్ కిలోగ్రాముకు 27 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇందులో మాన్యువల్ ఏసీ, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, డిజిటల్ స్పీడోమీటర్, ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, ఈబీడీ, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో కూడిన ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్టార్ స్పిన్నర్ చాహల్, నటి ధనశ్రీ విడాకులపై క్లారిటీ వచ్చేసింది..
యుజ్వేంద్ర చాహల్, భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్. ఐపీఎల్‌లో తన మాయాజాలంతో ఆకట్టుకుంటారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆగస్టు 2023లో ఆడాడు. తాజా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడంతో చాహల్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తించాడు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారని గతంలో పుకార్లు వ్యాపించాయి. తాజాగా వాళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ‘అన్‌ఫాలో’ చేసుకున్నారు. ఇద్దరూ విడిపోయేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది! ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను కూడా చాహల్ తొలగించాడు. కానీ.. ధనశ్రీ మాత్రం చాహల్‌తో ఉన్న ఏ చిత్రాన్ని డిలీట్ చేయలేదని తెలుస్తోంది.
ఆరేళ్ళ తరువాత లుక్ మార్చిన అల్లు అర్జున్?
అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయన జులపాలతో పాటు గడ్డం కూడా పెంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు అదే గడ్డం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది కూడా. ఇక దీంతో ఆయన తన జుట్టు కత్తిరించుకోవడంతో పాటు గడ్డం కూడా ట్రిమ్మింగ్ చేయించారు. ఈరోజు అల్లు అర్జున్ బయటకు రాగా ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లి సిటీ సెషన్స్ కోర్టుకు వెళ్లారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అది పూచీకత్తు మీద ఇచ్చిన బెయిల్ కావడంతో ఈరోజు ఆ రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి పర్సనల్ బాండ్స్, రెండు ష్యూరిటీలు సమర్పించారు అల్లు అర్జున్.. ఇక అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్ కూడా మరో షూరిటీ కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
హరిహర వీరమల్లు నుంచి లేటెస్ట్ పోస్టర్ వచ్చింది చూశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా వారికి మొన్ననే గుడ్ న్యూస్ తెలిపారు మేకర్స్. నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ప్రకటించారు. హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ న మేకర్స్ ఫైనల్ గా వెల్లడించారు. జవన్ 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు పవన్ పోస్టర్ ఒకదాన్ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. సంధ్య థియోటర్ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు అందజేశారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు. అల్లు అర్జున్ వ్యక్తి గతంగా బాండ్ సమర్పించడంతో పాటు.. మరో షూరిటీ కింద తన పర్సనల్ మేనేజర్‌ను చేర్చారు. ఇదిలా ఉండగా.. సంధ్య థియోటర్ ఘటనపై నాంపల్లి కోర్టు నిన్న ( శుక్రవారం) అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంటల వరకు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు సూచించింది. ప్రతి వ్యక్తికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటు, తనను విచారిస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించవద్దని కోర్టు అల్లు అర్జున్ కు సూచించింది. ఈ కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించవద్దని కోర్టు హెచ్చరించింది.