గ్రూప్-2 పరీక్షల్లో ట్విస్ట్.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ
షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో రేపు అనగా ఈ నెల 23వ తేదీన గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీ.. ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.. అయితే, చివరి గంటల్లో గ్రూప్-2 పరీక్షల్లో పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖ రాసింది.. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్‌పై విచారణ సాగుతోంది.. వచ్చే నెల 11వ తేదీన మరో మారు విచారణ జరగనుంది.. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. ఒక వైపు గ్రూప్- 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు స్పీకర్ కీలక భేటీ
ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది.. సభ ఎన్ని రోజులు పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు.. ఇక, 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది ప్రభుత్వం… తర్వాత రెండు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి.. 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 28 ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది.. బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.. ఇక, ఆ తర్వాత అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో వివరించనుంది ఏపీ సర్కార్.. సంక్షేమం, అభివృద్ధి.. 8 నెలల పాలనపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.. 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నుంచి కూడా సభ్యుల హాజరు కూడా ఎక్కువగా ఉండాలని సీఎం చెబుతున్నారు. మరోవైపు.. రేపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు కల్పించ వలసిన భద్రతపై డీజీపీ, ఇతర పోలీస్ అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతతో పాటు అసెంబ్లీ బయట శాంతి భద్రతల పై సమీక్ష నిర్వహించనున్నారు స్పీకర్.. గవర్నర్ అసెంబ్లీ కి వచ్చిన దగ్గర్నుంచి తిరిగి రాజ్ భవన్ కు వెళ్లే వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై స్పీకర్ రేపు సమీక్ష చేయనున్నారు.. గవర్నర్ రాకకు సంబంధించి. రేపు అసెంబ్లీ ప్రాంగణం వరకు కాన్వాయ్ రిహార్సల్ జరగనుంది..
బురదలో చిక్కుకున్న ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కాగా.. ఎనిమిది ప్రాణాలపై ఆశలు సల్లగిల్లుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు మట్టి, బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అందుకోసం.. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా పిలిపిస్తున్నట్లు మంత్రులు ఉత్తమ్, జూపల్లి తెలిపారు. అంతేకాకుండా.. భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయ కూడా కోరామన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా.. మట్టి, నీరు వచ్చి చేరిందని.. అది 8 మీటర్ల మేరకు చేరిందని పేర్కొన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి..
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. దోమలపెంటలోని జె.పి గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్, ఐ.జి సత్యనారాయణ, అగ్నిమాపక డి.జి జి.వి నారాయణ రావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్ఎల్‌బిసి పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జరిగిన సంఘటన పట్ల మంత్రులు ఉత్తమ్, జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే.. క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. మరోవైపు.. సొరంగం లోపల చిక్కుకున్నారని భావిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు సంఘటనా స్థలిలో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..
తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్దం చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి.. ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేయనున్నారు.
మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..
కర్ణాటక నగరమైన బెగళావిలో మరాఠీ మాట్లాడని కారణంగా బస్సు కండక్టర్‌ని కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కండక్టర్ గాయపడ్డారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతమైన ‘‘బెళగావి’’పై ఇరు రాష్ట్రాల మధ్య గత కొన్ని ఏళ్లుగా వివాదం ఉంది. 51 ఏళ్ల కండక్టర్ మహాదేవప్ప మల్లప్ప హుక్కేరి శుక్రవారం నాటు తనపై జరిగిన దాడి గురించి చెప్పారు. సులేభావి గ్రామంలో బస్సు ఎక్కిన ఒక మహిళ మరాఠీలో మాట్లాడిందని, తనకు మరాఠీ రాదని, కన్నడలో మాట్లాడతానని చెప్పానని హుక్కేరి చెప్పారు. ‘‘నాకు మరాఠీ తెలియదని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి మరాఠీ నేర్చుకోవాలని చెప్పి నన్ను తిట్టింది. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి నా తలపై, శరీరంపై దాడి చేశారు’’ అని వెల్లడించారు.
తమిళానికి కేవలం రూ. 74 కోట్లు, సంస్కృతానికి రూ. 1488 కోట్లా.?
జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రి భాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. NEP అమలు చేస్తే తమ రాష్ట్రం 2000 ఏళ్లు తిరోగమనం చెందుతుందని అన్నారు. దీనిని పాపం అంటూ పిలిచారు. కేంద్రం రూ. 10,000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని చెప్పారు. త్రిభాషా విధానం ద్వారా హిందీని తమ రాష్ట్రంలో అమలు పరిచేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నిస్తున్నారని అంతకుముందు స్టాలిన్ విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రాన్ని లక్ష్యం చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 8 కోట్ల మంది మాట్లాడే తమిళ భాషాభివృద్ధికి కేవలం 74 కోట్లు మాత్రమే కేటాయించారని, కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే సంస్కృతానికి రూ.1,488 కోట్లు కేటాయించారని అన్నారు.
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దీంతో ప్రతి రాష్ట్రం టెస్లా తన ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీకి భారీ ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీని, తగినంత భూమిని అందిస్తామి ప్రకటించింది. దీనికోసం నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్ఓను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ మధ్య జరిగిన సమావేశం.. భారతదేశంలో కంపెనీ నియామక డ్రైవ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. రెడీ ల్యాండ్ పార్శిల్స్‌తో సహా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో కంపెనీ రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, ఆపై క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ముంబై, ఢిల్లీలో షోరూమ్‌లను ప్రారంభించి వార్తల్లో కంపెనీ నిలిచింది.
ఆవిడ కాళ్లు పట్టుకున్న హీరో ధనుష్.. ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే అలరిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చూపిస్తున్నారు. గతేడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తాజాగా తన దర్శకత్వంలో తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మేనల్లుడు పవీష్ నారాయణన్ ను హీరోగా ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా’’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జెన్ జీ బ్యాచ్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఆ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ను అలరిస్తోంది. కొంతమంది కుర్రాళ్లు, యంగ్ హీరోయిన్లతో తెరకెక్కిన ఆ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ రిహార్సల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో హీరో పవీష్ కు ధనుష్ సీన్ ఎంటో చెబుతూ కనిపించారు. అంతే కాదు.. ఆయన నటించి మరీ చూపించారు. ఆ పాత్రలో ఆయన జీవించేశారు. సీన్ లో భాగంగా నిజంగా టీ షర్ట్ తో సీనియర్ నటి కాళ్లు కూడా తుడిచారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధనుష్ చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారని చెబుతున్నారు. అదే సమయంలో ధనుష్ లా పవీష్ చేయలేదని చెబుతున్నారు. మ్యాచ్ కూడా చేయలేకపోయారంటూ కొందరు సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. అయితే కొత్త హీరో కదా.. కాస్త ఎక్స్ పీరియన్స్ కావాలి కదా అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
దిల్ రాజు చేతుల మీదుగా ‘నారి’ సినిమా ట్రైలర్ రిలీజ్..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ..మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో రాబోతుంది. సూర్య వంటి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటి పల్లి నిర్మించారు. ఇక ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మహిళల గురించి ఒక మంచి కథతో ‘నారి’ సినిమాను రూపొందించారు. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు ‘మావిచిగురు’, ‘శుభలగ్నం’ లాంటి మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కళ్యాణం మూవీస్ లో నటించారు. ‘నారి’ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్‌కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నాడు.