వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. ఇదేం ట్విస్ట్..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ కేసులో విచారణ అధికారి.. తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.. ఈ నెల 26వ తేదీన ఈ కేసులో విచారణ అధికారి.. కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. మరోవైపు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు వల్లభనేని వంశీ మోహన్.. ఈ కేసులో కీలక పరిణామలు చోటు చేసుకోవడంతో.. ఈ నెల 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం..
వైజాగ్ మాస్టర్ ప్లాన్.. మంత్రి నారాయణ కీలక సమీక్ష..
విశాఖపట్నం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయం తర్వాత మాత్రమే వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం స్వార్ధ పూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని విమర్శించారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి, భూ సమస్యలుపై విశాఖ ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. విశాఖకు ఉన్న ప్రాధాన్యత భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.. ఇందులో భాగంగా వైజాగ్ మాస్టర్ ప్లాన్. .ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైల్.. ఇలా అన్ని విషయాలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.. జీవీఎంసీ పరిధిలో ప్రజాప్రతినిధులు ఈ సమీక్షకు హాజరయ్యారు.. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు తప్పని సరిగా చేయాలని.. ప్రజాప్రతినిధులు నారాయణకు తెలిపారు.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి అవుతుంది అన్నారు మంత్రి నారాయణ.. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు.. వైజాగ్ లో 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తామన్నారు.. ఆన్ లైన్ లో మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఇక, టీడీఆర్ బాండ్ల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు మంత్రి నారాయణ.. అదే విధంగా వైజాగ్ ట్రాఫిక్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ లో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష
ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం.. ఉగాది మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.. ఉగాది మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల కంటే కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. అది కూడా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు.. అయితే, ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.. కైలాసద్వారం-భీముని కొలను మార్గంలో 6 చోట్ల తాత్కాలికంగా 1000 లీటర్ల సింటెక్స్ ఏర్పాటు చేసింది శ్రీశైల దేవస్థానం.. కైలాసద్వారం వద్ద 5 వేల లీటర్ల 8 సింటెక్స్ ట్యాంకులు అదనంగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈవో శ్రీనివాసరావు.. పరిశీలనలో భాగంగా పాదయాత్ర భక్తులను దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఆడిగి తెలుసుకున్నారు ఈవో.. కాగా, శివరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక భక్తులు శ్రీశైలానికి తరలివస్తుంటారు.. అయితే, ఉగాది మహోత్సవాలకు మాత్రం కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. దీంతో, శ్రీశైలం భక్తజన సంద్రంగా మారిపోతోంది..
హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట.. కానీ..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది.. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైన విషయం విదితమే కాగా.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు శ్యామల.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత.. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది.. దీంతో, ఆమెకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది.. ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను ఆదేశించింది హైకోర్టు.. సోమవారం నుండి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.. ఇక, నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చు అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది..
కేసీఆర్ను నిందించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్తున్నారు..
శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ ని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు.. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం.. 420 హామీలు ఇచ్చి, గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టిచ్చి.. గ్యారంటీలు ఇప్పిచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారు.. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసింది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదన్నారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి చుట్టపు లాగా వచ్చిపోతున్నారు.. ప్రజావాణీ వింటానని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కార్యక్రమానికి వచ్చారు.. ప్రజల్ని రోజూ కలుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి అసలు ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అని ఎమ్మెల్సీ కవిత మండిపడింది.
కర్ణాటక అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్‌తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘క్రమశిక్షణారాహిత్యం’’ కారణంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 18 మంది బిజెపి ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు. అంతకుముందు రోజు కూడా, ఈ ముస్లిం కోటా వివాదం సభను కుదిపేసింది. ఈరోజు సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలు చింపి విసిరేశారు. దీనికి ముందు తనపై హనీట్రాప్ జరిగిందని మంత్రి కేఎన్ రాజన్న ఆరోపించడం సంచలనంగా మారింది.
షేక్ హసీనా పార్టీ బ్యాన్‌పై యూనస్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న పదవీచ్యుతురాలైంది. హింసాత్మక ఘటనలతో ఆమె భారత్ పారిపోయి వచ్చింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగాయి. అయితే, అవామీ లీగ్ పార్టీని రద్దు చేస్తారని, పార్టీని నిషేధించాలని యూనస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అవామీ లీగ్‌ని నిషేధించే ప్రణాళికలు లేవని, కానీ హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినవారు దేశ కోర్టుల్లో విచారణ ఎదుర్కుంటారని యూనస్ ప్రెస్ వింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కంఫర్ట్ ఎరో నేతృత్వంలోని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ ప్రతినిధి బృందంతో, యూనస్ భేటీ అయ్యారు. దేశంలో ఎన్నికల కోసం సాధ్యమైన రెండు సమయాలను నిర్ణయించినట్లు ధ్రువీకరించారు.
ఈ సీజన్ ఐపీఎల్ అంపైర్లు వీరే.. ఏడుగురు కొత్తవారికి ఛాన్స్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు. అనిల్ చౌదరి అంపైరింగ్‌కు వీడ్కోలు పలికి వ్యాఖ్యాతగా మారనున్నారు. అయితే.. ధర్మసేన ఈసారి ఎందుకు లేరు అనే విషయం పై స్పష్టమైన సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు మైఖేల్ గోఫ్, క్రిస్ గాఫ్నీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వంటి అంతర్జాతీయ అంపైర్లు బాధ్యతలు తీసుకోనున్నారు. బీసీసీఐ ఈసారి కొత్తగా ఏడుగురు భారతీయ అంపైర్లను ఎంపిక చేసింది. వీరిలో… స్వరూప్‌నంద్ కన్నూర్, అభిజిత్ భట్టాచార్య, పరాశర్ జోషి, అనిష్ సహస్రబుద్ధే, కేయూర్ కేల్కర్, కౌశిక్ గాంధీ, అభిజీత్ బెంగర్
ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన టీమిండియా హెడ్ కోచ్..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఫ్రాన్స్‌కు బయలుదేరాడు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అయితే.. గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఐపీఎల్‌లో అభిమానులు తమ అభిమాన మాజీ క్రికెటర్‌ను చూడలేరు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గంభీర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా అతను కీలక పాత్ర పోషించాడు. అతని మార్గదర్శకత్వంలో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2022, 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా సేవలు అందించారు. అయితే.. ఇప్పుడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో 2025 ఐపీఎల్ సీజన్‌లో అతని భాగస్వామ్యం ఉండదు.
మమతా బెనర్జీ ‘‘ఛావా’’ సినిమా చూడాలి.. యూపీ డిప్యూటీ సీఎం..
ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, తన సహచరులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ చూశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఔరంగజేబు, మరాఠాల మధ్య ఘర్షణలను సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఛావా సినిమాను చూడాలని మౌర్య కోరారు. దీని ద్వారా ఔరంగజేబు క్రూరత్వం ఆమెకు తెలుస్తుందని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ ఛావా గురించి చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించాలని అన్నారు. మతాన్ని మార్చడానికి బలప్రయోగం చేసిన వ్యక్తి గురించి మాట్లాడే వారి గురించి ఆయన మౌనం వీడాలని చెప్పారు.
#Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్‌లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం, రాబిన్‌హుడ్ ట్రైలర్ ఇప్పుడు మార్చి 23, 2025న జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో విడుదల కానుంది.
అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. ఆ వార్తల్లో నిజం లేదా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన ఈ పుకార్లను ఖండిస్తూ, ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి. అదేమంటే ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ దుబాయ్‌లో ఉన్నారని, అక్కడ సినిమా కథా చర్చల్లో మునిగి ఉన్నారని సమాచారం.