‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు’.. భువనేశ్వరి నోట బాలయ్య డైలాగ్..
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే.. యాక్షన్.. డైలాగ్స్.. ఏ సినిమాలోనైనా.. బాలయ్య మార్క్ డైలాడ్స్ ఉండాల్సిందే.. ఇప్పుడు బాలయ్య డైలాగ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి నోటా వచ్చింది.. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుండగా.. అందులో భాగంగా ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా అనేక విషయాలపై బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే మాటలు చెప్పారు.. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి అని తెలిపారు.. మన ధైర్యం మనకుండాలని సూచించారు నారా భువనేవ్వరి.. ఇక, ముందు నందమూరి కుమార్తెను.. చంద్రబాబు భార్య సెకండ్.. కానీ, ఒక మహిళగా నేనేమిటి అనేది నాకు తెలుసు అన్నారు భువనేశ్వరి.. మనందరిలోనూ ఆ శక్తి ఉంది. ఫోకస్ పనిలోపెడితే ముందుకు వెళ్ళచ్చు అన్నారు.. హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టాలి.. నాన్నకంటే గొప్పవాడివి కావాలి.. చేయకపోతే నీ ఫ్యూచర్ ఆగుతుంది అని నా కుమారునికి చెప్పాను అను గుర్తుచేసుకున్నారు.. మీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది.. ఎవరూ రారు.. బద్ధకం ఉంటే జీవితంలో ఎడగలేరు అని హెచ్చరించారు.. అయితే, ఈ కార్యక్రమంలో తన సోదరుడు బాలయ్య డైలాగ్‌ను అదరగొట్టారు నారా భువనేశ్వరి.. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని.. కానీ, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దవారని తెలిపారు.. తాను సినిమాలు తక్కువగా చూస్తాను.. కానీ, నరసింహనాయుడు అఖండ సినిమాలు బాగా నచ్చాయి అని పేర్కొన్నారు.. ఇక, విద్యార్థుల కోరిక మేరకు ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు..’ అంటూ బాలయ్య డైలాగ్ ను చెప్పారు నారా భువనేశ్వరి.. కాగా, బాలయ్య నటించిన సింహా సినిమాలోని ఈ డైలాగ్ ఎంతో ఆదరణ పొందిన విషయం విదితమే..
చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నావైపు చూడండి..
వరుసగా వివిధ జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు.. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు.. ఇక, ఈ రోజు అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంమీదా లేదన్న ఆయన.. చంద్రబాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను.. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. జగన్ పలావ్ పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. కానీ, ఇప్పుడు పలావ్ పోయింది.. బిర్యానీ కూడా పోయిందని వ్యాఖ్యానించారు.. ఆరునెలల్లోనే వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వేశారని విమర్శించారు జగన్.. ఇక, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయని విమర్శించారు జగన్.. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి.. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి..ఈ నెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తంచేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం.. మళ్లీ జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్, వసతి దీవెనమీద చేస్తున్నాం.. ప్రజల తరఫున మనం గొంతు విప్పాలి.. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం.. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి.. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారు.. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా.. నావైపు చూడండి.. 16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు.. నా భార్య కనీసంగా 20 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టి ఉంటుంది.. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్.. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. ఎల్లకాలం కష్టాలు ఉండవు.. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఢీకొనేలా ఉందాం.. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు వైఎస్ జగన్.
ఏపీలో విస్తారంగా వానలు.. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఈ సమయంలో తీరం వెంబడి 35- 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.. ఇక, కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.. మరో 48 గంటలపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వాటికి లైన్ క్లియర్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు.. జల్ జీవన్ మిషన్ పథకం అమలు జరగకపోవడం గత ప్రభుత్వం చేసిన నష్టానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. లక్ష నుంచి లక్షన్నరకి ప్రతిపాదనలు పంపించాయి కేరళ లాంటి చిన్న రాష్ట్రాలు సైతం జలజీవన్ మిషన్ కి.. కానీ, పరిశుభ్రమైన నీటికి లక్షలాది ప్రజలు దూరమయ్యారని తెలిపారు.. అయితే, 25 శాతం కంటే తక్కువ పనులు 11,400 కోట్లు.. వాటికి రీటెండరింగ్ జరుగుతుంది.. వాటికి కేబినెట్ అనుమతి మంజూరు చేసిందన్నారు.. డోన్, ఉత్థానం, పులివెందులలో పనులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది.. స్థిరమైన నీటి వనరులు వినియోగం ద్వారా త్రాగునీటి వసతి ఇవ్వాలన్నది జల్ జీవన్ మిషన్ ఉద్దేశం అన్నారు.. ఇక, ఇప్పటి వరకూ డోలాయమానంలో ఉన్న అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు ఇచ్చాయి.. 45 ఇంజనీరింగ్ పనులు 33,137 కోట్లతో పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. గ్రామకంఠ భూముల సర్వే, రికార్డింగ్ లో 48,899 సబ్ డివిజన్ చేయడానికి అర్జీలు వచ్చాయి.. వాటికి ఫీజు రాయితీ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నా యన.. వరదల్లో ముంపుకు గురైనవారి రుణాలపై యూజర్ ఛార్జీలు ఎత్తివేయడానికి, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. మార్క్ ఫెడ్ కు 1000 కోట్ల అదనపు రుణాన్ని పొందేందుకు ఆమోదం లభించింది.. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీడెండరింగ్ కు కేబినెట్ ఆమోదించింది.. హంద్రీనీవా కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ కు పాత రేట్ల ప్రకారమే చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 1.06 లక్షల ఉపాధి అవకాశాలు ఈ జాయింట్ వెంచర్ ద్వారా వస్తాయన్నారు..
ఓఆర్ఆర్ టెండర్‌పై సిట్ విచారణకు సీఎం ఆదేశం
ఓఆర్‌ఆర్ టెండర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించారు. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా టెండర్‌కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్ అన్నారు. క్రిడెట్ అంతా కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చాలని కృష్ణ, గోదావరి నీళ్లు తేవడానికి పీజేఆర్ ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్ కారణమని వివరించారు. వేల కోట్ల ఓఆర్ఆర్ ఆస్తిని అప్పన్నంగా అమ్ముకున్నారని బీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓడించబోతున్నారని తెలిసి.. అమ్మేసుకున్నారని ఆరోపించారు. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్ఆర్ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావు విచారణ కోరారు.. ఆయన కోరిక మేరకు సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విధివిధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేయిస్తామన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.. RBI గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఎఫ్‌ఈవో కంపెనీకి రూ.45 కోట్లు HMDA చెల్లించిందని కేసులు పెట్టారు.. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలు మోపడ్డాయి.. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది.. ఐఏఎస్ అరవింద్‌కుమార్.. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి రూ.8కోట్ల ఫైన్ వేసింది ఆర్బీఐ.. అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అయితే, కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. అయితే, కేటీఆర్ ఆదేశాలతో నిధులు IAS అరవింద్‌కుమార్ చెల్లించారని పేర్కొంది.. HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసింది.. ఈ మొత్తంగా కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ2గా అరవింద్‌కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ..
మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ గుర్తింపు..
కోవిడ్-19 తర్వాత మరోసారి మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది బర్డ్ ఫ్లూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ మహమ్మారిగా మారేందుకు అనువుగా మార్పులు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, అమెరికా లూసియానాలో ఒక రోగికి ఎవియన్ ఇన్‌ఫ్లుఎంజా(బర్డ్ ఫ్లూ) యొక్క తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది అమెరికాలో గుర్తించబడిని తొలి తీవ్రమైన కేసు అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) బుధవారం ప్రకటించింది. ఈ కేసుతో 2024 నుంచి అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 61కి చేరింది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగి, చనిపోయిన పక్షులతో దగ్గరగా ఉన్నాడని తేలింది. ఈ కేసు గత శుక్రవారం నిర్ధారించబడింది. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వైరస్ D1.1 జన్యురూపానికి చెందినదని తేలింది.
రాహుల్ గాంధీ గాయపరిచిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఎవరు..?
అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరనసలు ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంట్ ఆవరణ ముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని నెట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతాప్ సారంగి మెట్లపై పడటంతో ఆయన తనకు గాయాలయ్యాయి. ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశాకు చెందిన ప్రముఖ బీజేపీ నేత. బాలాసోర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బాలాసోర్‌లోని గోపీనాథ్‌పూర్ గ్రామంలో జనవరి 4, 1955లో జన్మించారు. 1975లో ఉత్కల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫకీర్ మోహన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. సారంగి రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌గా మొదలైంది. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌లో పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు ఒడిశాలోని నీలగిరి అసెంబ్లీ నుంచి రాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2019లో ఎంపీగా పోటీచేసి బీజేడీ ఎంపీ రవీంద్రకుమార్ జెనాపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో సారంగి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు తిరస్కరణ..! కారణమిదే!
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించినట్లుగా సమాచారం. జగ్‌దీప్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ శీతాకాల సమావేశాల ముగింపునకు కేవలం 10 రోజుల సమమయే ఉంది. దీంతో ప్రతిపక్ష కూటమి ఇచ్చిన నోటీసును డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్ష నేతలకు మాత్రం పాఠాలు చెబుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఇండియా కూటమి నేతలు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సంతకాలు చేశాయి. దాదాపు 50 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. అయితే శీతాకాల సమావేశాల్లో మరో 10 రోజుల్లో ముగుస్తున్నాయి. అంటే నోటీసుకు ముందు కనీసం 14 రోజుల సమయం ఉండాలి. కేవలం 10 రోజుల సమయమే ఉండడంతో నోటీసును డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించారు.
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు.. ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదం.. కారణమేంటంటే..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అతనిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక మైదానంలో ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు అతన్ని కవ్వించారంటే.. వారికి మూడినట్లే. తనదైన స్టైల్‌లో వారికి ఇచ్చిపడేస్తాడు. ఇక.. బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా తన కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. దీంతో.. మహిళా జర్నలిస్టుకు గట్టిగా క్లాస్ పీకాడు. అసలు విషయానికొస్తే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మూడు టెస్టులు జరగగా.. ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఈ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా గురువారం గబ్బా నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో పాటు కూతురు వామికా, కొడుకు అకాయ్ కోహ్లీలతో కలిసి మెల్‌బోర్న్ విమానాశ్రయంలో కనిపించగానే ఆస్ట్రేలియా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది.
శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్
పుష్ప సినిమా ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో సందర్శించలేకపోయిన నేపద్యంలో నిన్న అల్లు అరవింద్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి, తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఇక ఈరోజు డైరెక్టర్ సుకుమార్ కూడా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీతేజ్ కి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను కలిసి ఆయన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సుకుమార్ భార్య గతంలోనే రేవతి భర్తను కలిసి 5 లక్షల రూపాయలు చెక్ అందించినట్లుగా తాజాగా వెల్లడైంది. ఇక లీగల్ వ్యవహారాల పూర్తయితే అల్లు అర్జున్ కూడా బాలుడిని పరామర్శించే అవకాశం కనిస్తోంది. ఇక బాలుడు అల్లు అర్జున్ వీరాభిమాని కావడంతో తండ్రి సినిమా టికెట్లు సంపాదించి సినిమాకి తీసుకెళ్లారు. కానీ అనూహ్యంగా తొక్కిసలాట ఏర్పడి రేవతి చనిపోగా ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆ రివ్యూలు బాధించాయంటున్న శంకర్
భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్ గా భారీగా ఉండటమే కాక.. సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే సినిమా భారతీయుడు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో వచ్చిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రమే కాక సినీ ప్రియులంతా ఇండియన్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. శంకర్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ 2 రివ్యూలు, ఇండియన్ 3పై దర్శకుడు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద ఈ స్థాయిలో నెగిటివ్ రివ్యూలను నేను ఊహించలేదు. కాకపోతే త్వరగానే మూవ్ ఆన్ అయ్యాను. ఇక త్వరలో రిలీజ్ కాబోయే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఫలితాలే మాట్లాడతాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచవు. థియేటర్స్ లో ఈ సినిమాలు చూసి గొప్ప అనుభూతి పొందుతారు అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల అవుతుందని తెలిపి.. కమల్ అభిమానులకు శుభవార్త చెప్పుకొచ్చారు. తన కామెంట్స్ తో మరోసారి ఇండియన్ సినిమాపై భారీ అంచనాలు పెంచారు శంకర్.