నేడు టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎంపీలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైసీపీకి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. పార్టీకి రాజీనామా చేసి.. కొందరు టీడీపీ.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ ఇలా వరుసగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. ఈ రోజు మధ్యాహ్నం కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. కాసేపటి క్రితమే దుర్గమ్మను దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మూలానక్షత్రంలో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తోన్న కనకదుర్గమ్మను తన కూతురు ఆధ్యతో వెళ్లి దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆలయ మర్యాదలతో పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు.. వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. దుర్గమ్మను దర్శించుకున్నవారిలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు..
బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ముగ్గురు యువకుల అరెస్ట్..
డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. ఇదే సమయంలో.. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మైకంలో ఉన్న యువకులను రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రగ్స్ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. వీరే డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారా? ఇంకా ఎవరికైనా సఫ్లై చేస్తున్నారా? అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలకు దిగిన విషయం విదితమే.. డ్రగ్స్ వాడకం, సరఫరాను సీరియస్‌గా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం..
పర్యావరణ పరిరక్షణపై వర్క్ షాప్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించి వర్క్ షాప్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది.. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. పర్యావరణ పరిరక్షణ కు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నారు.. ఈ వర్క్‌షాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు.. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం.. పీసీబీ ఛైర్మన్ కు నా ఆలోచన చెప్పిన వెంటనే.. ఈ వర్కుషాపును ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక, అన్ని రంగాల నిపుణులు, ఎన్జీవోలను ఆహ్వానించడం అభినందనీయం అన్నారు పవన్‌కల్యాణ్.. నేను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని.. ప్రకృతి ప్రేమికులు ఎంత తపన పడతారో నాకు తెలుసు.. భూమి మీద కనీస బాధ్యత లేకుండా మనం జీవనం సాగిస్తున్నాం.. భూమిని మనం సొంతం చేసుకోవడం కాదు.. భూమే ఏదొకనాటికి మనలను సొంతంచేసుకుంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది.. దానిని అభివృద్ది చేయాలి.. పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలి.. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పుటి నుంచే ఆలోచన చేయాలి అన్నారు.. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. ఈ వర్కుషాపుకు వచ్చిన నిపుణులు సలహాలతో సమాజానికి మరింత మేలు జరగాలనేది నా ఆకాంక్షగా పేర్కొన్నారు..
రోడ్లపై చెత్త వేస్తే కేసులు.. పరిశ్రమలకు కరెంట్ కట్.. జేసీ వార్నింగ్
తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో పాలిష్ వృథా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు. ఇక, తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే పరిశ్రమల వల్లే సాధ్యమైందన్నారు జేసీ… పరిశ్రమలు స్థాపించిన యజమానులు అందరూ బాగా చదువుకున్న వారేనని.. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని స్పష్టం చేశారు.. తాడిపత్రి అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పారిశ్రామిక వాడల చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రానైట్ నల్లబండల వృథా రాళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసేవాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ లోపు తాడిపత్రి పట్టణమంతా శుభ్రంగా ఉంచాలన్నారు.. ఆయా ప్లాట్ల మధ్యలో రోడ్లు వేస్తానని.. నష్టపోకుండా ఫ్లాట్ల యజమానులు చూసుకోవాలన్నారు. మరోవైపు.. ట్రాక్టర్లు విడిపించుకోవడానికి తన బంధువులు.. స్నేహితులు.. పార్టీ నాయకుడు ఎవరు తన వద్దకు రావద్దని చేతులు జోడించి విన్నవించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కేటీఆర్‌కు పదవి పోయిందనే అసహనం ఎక్కువ ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో విదేశీ విద్య చదివే విద్యార్థులకు ఏటా 150 మంది కే ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు 500 మంది విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం అని గుర్తించినందుకు కేటీఆర్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. అశోక్‌నగర్‌లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ.5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. మీ హామీ నెరవేరినందున యువతను కలవడానికి హైదరాబాద్‌కు స్వాగతం అంటూ విమర్శనాత్మకగా కేటీఆర్ పోస్ట్ పెట్టారు. గతంలో హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా?.. అంటూ మరో పోస్టు వేశారు. “నాడు కేసీఆర్‌తో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం.. జ్యోతిబా పులే విదేశి విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది.ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు-సాగదీస్తున్న అధికారులు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్..తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన హర్యానా సీఎం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిగ్ ఫిగర్ ను దాటడంతో.. తనను మరోసారి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించాలని సీఎం సైనీ కోరే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఖరారు చేయడంపై పార్టీ హైకమాండ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అలాగే, హర్యానాలో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేసిన ఓటర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించినందుకు ఆయనను ప్రశంసించారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ సుపరిపాలన వల్లే అన్ని వర్గాలకు చెందిన ప్రజల ఓట్లు పార్టీకి వేశారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
హర్యానాలో కాంగ్రెస్ ఓటమి.. స్పందించిన రాహుల్ గాంధీ
హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్యానాలో పరాజయంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక, జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఆత్మ గౌరవానికి దక్కిన విజయం అని తెలిపారు. ఇక, హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేస్తున్నాం.. చాలా అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి.. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పని చేసిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటామని రాహుల్ వెల్లడించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అరబ్ దేశాలు
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ బ్యాక్‌డోర్ సంభాషణలో ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రమేయం లేదని, అయితే దాని గురించి వారికి సమాచారం అందించామని చెబుతున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు గాజా స్ట్రిప్‌పై ఎంత ప్రభావం చూపుతాయనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నివేదిక ప్రకారం, ఈ బ్యాక్‌డోర్ సంభాషణకు సంబంధించి ఇజ్రాయెల్ తన వైఖరిని అమెరికాకు ఇంకా తెలియజేయలేదు. ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నామని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలలో హిజ్బుల్లా అన్ని సైనిక స్థావరాలను నాశనం చేస్తోంది. లెబనాన్‌లో హిజ్బుల్లా కాల్పుల విరమణ కోరుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్, పాలస్తీనాతో తమ సంస్థ గట్టిగా నిలబడుతుందని హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ నయీమ్ ఖాసిం ఇటీవల చెప్పారు. నస్రల్లా తరువాత, ఖాసిం ప్రస్తుతం హిజ్బుల్లా ఉన్నత అధికారులలో చేర్చబడ్డారని తెలిసిందే. ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణ కోసం వాదించిన లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ ప్రయత్నాలకు ఆయన మద్దతు ఇచ్చారు. కాల్పుల విరమణ కోసం బెర్రీ నాయకత్వానికి మద్దతిస్తున్నామని ఖాసీం తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తే, అది యుద్ధరంగంలోనే నిర్ణయించబడుతుంది.
యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచిన ఆర్బీఐ..
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్ పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే, యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొనింది. ప్రతి లావాదేవీకి యూపీఐ 123పే లిమిట్‌ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచేసింది.
పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి
పండగ సీజన్ వేళ మహిళలకు శుభవార్త. ఇటీవల పెరుగుతూ పోయిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.760 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.76,690గా నమోదైంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడోరోజు తగ్గింది. కిలో వెండిపై నిన్న రూ.900 తగ్గగా.. నేడు రూ.2000 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.94,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 88 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్షగా కొనసాగుతోంది.
దేశముదురు సినిమాను వదిలేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
ఒక్కోసారి సూపర్ హిట్ సినెమాలను కొందరు హీరోలు అనుకోని కారణాల వలన వదులుకుంటారు. ఆ తర్వాత అదే కథలు ఇతర హీరోయిలతో అవి సూపర్ హిట్లుగా నిలవడం ఎన్నో సందర్భాలలో చూసాం, రవితేజ చేసిన ఇడియట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసాడు పూరి జగన్నాధ్. రవితేజ భద్ర సినిమాను వదులుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,అలాగే సింహాద్రి సినిమా బాలయ్యకు అనుకుని ఎన్టీఆర్ తో చేసాడు రాజమౌళి. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. అదే విధంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ‘దేశముదురు’. హన్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ హిట్. చక్రి సాంగ్స్ ఓ రేంజ్ హిట్. టాలీవుడ్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ పరిచయం అయింది కూడా ఈ సినిమాకే. కానీ ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో బన్నీ కాదట. ఈ సినిమా కథను అక్కినేని సుమంత్ కోసం రెడీ చేశారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు కలిసి వెళ్లి సుమంత్ కు కథ కూడా వినిపించారట. కానీ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర ఒక సన్యాసి. సన్యాసిని లవ్ చేయడం అదంత కరెక్ట్ కాదని అనిపించి సుమంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట. ఈ విషయం స్వయంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూ ల్పో తెలియజేసాడు. అప్పట్లో ఆలా అయిపోయిందని సుమంత్ అన్నాడు. ఆలా తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నాడు అక్కినేని సుమంత్.
రజినీకాంత్ సినిమా రిలిజ్.. ఆఫీసులకు సెలవు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో విడుదల కానున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిచింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్,లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అంటే తమిళనాడులో ఓ పండగ వాతావరణం ఉంటుంది. రిలీజ్ కు ముందు రోజు నుండే కటౌట్లు, పాలాభిషేకాలు, ఫ్యాన్స్ సందడితో చేసే రచ్చ అంత ఇంతా కాదు. అదేవిధంగా రజినీ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది, గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించాయి. అలా ఉండేది తమిళనాడులో రజనీ మ్యానియా. ఇక తలైవా నటించిన లేటేస్ట్ సినిమా ‘వేట్టయాన్’ మద్రాసు లో 656 షోస్ ( All Time Record) రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ రిలీజ్ చేసాయి. రజనీ స్టామినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తగ్గదని అది మా హీరో స్టామినా అని తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.