సమాన అవకాశం కల్పిస్తా.. సభకు రండి.. జగన్‌కు స్పీకర్ సూచన
అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు వస్తారా? రారా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.. అయితే, దమ్ముంటే సభకు రావాలంటూ సీఎం చంద్రబాబు సవాల్ చేయడం.. సభకు వచ్చేందుకు సిద్ధమే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మరోవైపు, వైఎస్ జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను ఎక్స్ లో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాట్లాడుతుండటాన్ని తప్పుబట్టిన ఆయన.. ప్రతిపక్ష హోదా నిబంధనలపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానంటూ పేర్కొన్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు.. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.. దీనిపై రేపు జరిగే కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు..
అమరావతి సేఫ్ సిటీ.. అనుమానమే లేదు..
అమరావతి చాలా సేఫ్ సిటీ… ఇందులో అనుమానం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి – నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది.. 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వరకు నిర్మణాలు పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు.. ఇక, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పటికే ఉంది.. వచ్చే నెల 2 గ్రూప్ డీలో ఉన్న నిర్మణాలు పూర్తి అవుతాయి అన్నారు మంత్రి నారాయణ.. అన్ని నిర్మాణాలు పూర్తి అయిన తర్వాతే అధికారులకు భవనాలు అందచేస్తామన్నారు.. మరోవైపు, రాజధానిపై పని గట్టుకుని అబద్ధాలు చెబుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.. అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు.. అమరావతి చాలా సేఫ్ సిటీ.. ఇందులో అనుమానం లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మాణలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.. సీఆర్డీఏలో నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలపడం.. వెంటనే.. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, వర్షాలు, వరదల సమయంలో.. అమరావతిలో కొన్ని నిర్మాణాలు మునిగిపోయాయంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. అయితే, నిర్మాణాల కోసం తీసిన గోతుల్లో వర్షపు నీరు చేరినా మునిగిపోయేనట్టేనా అని కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు..
తాడిపత్రిలో సేమ్ సీన్ రిపీట్..! పెద్దారెడ్డికి ఎస్పీ లేఖ..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలిటిక్స్ సాగుతూనే ఉంది.. తాడిపత్రిలో మళ్లీ అదే సీన్ రిపీట్ అవు తోంది. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. దాని కోసం పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం. అయితే, ఈ నెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి జిల్లా ఎస్పీ జగదీష్ రిప్లై ఇచ్చాడు.. అలాగే, పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలు ఇస్తాం.. డిపాజిట్ చేయాలని కూడా కేతిరెడ్డికి పోలీసులు సూచించినట్లు సమాచారం. దీనికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకరించట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలోని మార్కెట్ యార్డ్ లో షాప్ లో ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున జేసీ అనుచరులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. మరి, ఈ నెల 5వ తేదీ తర్వాత పెద్దారెడ్డి ఏ రోజున తాడిపత్రి రానున్నారు అనేది ఉత్కంఠగా మారుతోంది.. ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అరచకాలు చేశారు.. ఇప్పుడు ఆయన బాధితులే పెద్దారెడ్డి.. తాడిపత్రి రాకుండా అడ్డుకుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే..
యూరియా పేరుతో భారీ స్కామ్..! రూ.200 కోట్లు చేతులు మారాయి..?
యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు.. క్షేత్రస్థాయిలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రైతులు ఎదుర్కొటున్న సమస్యలు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి క్యాజువల్ గా అనిపిస్తుందని మండిపడ్డారు.. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడితే తప్పేంటని అవమానకరంగా అచ్చెన్నాయుడు మాట్లాడటం దారుణం అన్నారు.. రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు యూరియా ఎందుకు ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు.. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించకపోవడంలో ఆంతర్యం ఏంటి? అని నిలదీశారు.. యూరియా పేరుతో భారీ స్కాం జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు.. 270కి రావాల్సిన బస్తా యూరియా.. 400 నుంచి 600 ధర పలుకుతుంది.. రైతులకు యూరియా అందించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు.. ఈ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి…
సొంత చెల్లిపై కుట్రలు జరుగుతుంటే.. కేటీఆర్ స్పందించరా?
కొందరు బీఆర్ఎస్ నేతలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తన సొంత అన్నయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని తనపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా అని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?.. 103 రోజులైనా కేటీఆర్ అడగరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక కూడా.. గతేడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ‘నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. తీహార్ జైలు నుంచి వచ్చిన తరువాత ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా?. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నా. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా. నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. నాపై కుట్రలు జరుగుతుంటే.. చెల్లిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్!
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే (హరీష్ రావు) సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారన్నారు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్ రావు లేరని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ‘హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు మొదలయ్యాయి. రేవంత్, హరీష్ రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు. రేవంత్‌తో హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి?. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్ రావు వద్దన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా వెళ్లి నేరుగా వైఎస్ఆర్‌ను హరీష్ కలవలేదా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ సమక్షంలో ఓటర్ అధికార్ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న యాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. ఓటర్ అధికార్ యాత్ర ముగియడంతో తేజస్వి యాదవ్ ఆటవిడుపు కోసం మేనల్లుడితో కలిసి షికారుకు వెళ్లారు. దీంతో ఇటీవల పాట్నాలో కొత్తగా ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వేపైకి వెళ్లారు. అక్కడే కొందరు సోషల్ మీడియా కంటెంటర్లు, కళాకారులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. వారిని చూసిన తేజస్వి యాదవ్ వారితో కలిసి స్టెప్స్ చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషిన్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
చైనాలోని బీజింగ్‌లో భారీ ఎత్తున సైనిక కవాతు జరిగింది. బుధవారం పెద్ద అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. ఇక పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ఒక వేదికపై నిలబడి కవాతును వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ ఆరోపణలు గుప్పించారు. పుతిన్, జిన్‌పింగ్, కిమ్ కలిసి అమెరికాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికన్ సైనికులు కూడా తమ రక్తాన్ని దారపోశారని.. ఈ విషయాన్ని చైనా గుర్తించుకోవాలని హితవు పలికారు. అమెరికా సైనికుల ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గుర్తించి.. గౌరవిస్తారని ఆశిస్తున్నానన్నారు.
భగ్గుమంటున్న బంగారం.. లక్షా పది వేల దిశగా పరుగులు!
ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్.. ఎప్పుడూ లేని విధంగా కొత్త గరిష్ఠాన్ని తాకాయి. బుధవారం (సెప్టెంబర్ 3) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,06,970గా.. 22 క్యారెట్ల ధర రూ.98,050గా ట్రేడ్ అవుతోంది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.880.. 22 క్యారెట్ బంగారం రూ.800 పెరిగింది. ఈ 10 రోజుల్లోనే ఏకంగా 5 వేలకు పైగా పెరగడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం లక్షా పది వేల రూపాయల చేరువకు వచ్చేసింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,970గా.. 22 క్యారెట్ల ధర రూ.98,050గా కొనసాగుతోంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,07,120గా.. 22 క్యారెట్ ధర రూ.98,200గా ట్రేడ్ అవుతోంది. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు కంగారుపడి పోతున్నారు. ఇక దీపావళి నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత ఐదు రోజులుగా వెండి పెడుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఈరోజు రూ.900 పెరిగి.. రూ.1,27,000గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి లక్షా 37 వేలుగా ఉంది. బుధవారం ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
వరల్డ్ నెం.1 బౌలర్ దెబ్బకి కుప్పకూలిన ఇంగ్లాండ్.. 49 పరుగులకే 8 వికెట్స్!
ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 131 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆతిథ్య జట్టును, దక్షిణాఫ్రికా 7 వికెట్లు, 175 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (54) తప్ప మిగతావారంతా తేలిపోయారు. ప్రస్తుత వన్డే వరల్డ్ నెం.1 బౌలర్ కేశవ్ మహరాజ్ తన స్పిన్ మ్యాజిక్‌తో కేవలం 5.3 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను తెలుకోలేకుండా చేశాడు. అతనికి తోడుగా వుయాన్ ముల్డర్ కూడా 3 తీసి టీంకు మద్దతు ఇచ్చాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్‌రమ్ తనదయిన దూకుడు ఆటతో కేవలం 55 బంతుల్లోనే 86 పరుగులు హేరోదు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ అక్కడికక్కడే సౌతాఫ్రికా వైపు మళ్లింది. అతనితోపాటు రికెల్టన్ (31*) కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో బ్రెవిస్ సిక్సర్‌తో విజయం అందించాడు. దీనితో దక్షిణాఫ్రికా కేవలం 20.5 ఓవర్లు లో విజయాన్ని అందుకుంది. ఇక అద్భుత బౌయింగ్ ప్రదర్శనకు గాను కేశవ్ మహరాజ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ సొంతం చేసుకున్నాడు. దీనితో దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ 4న లార్డ్స్ వేదికగా జరగనుంది.
ఆయనకు 42, ఆమెకు 22!
ఆయనకు 42, ఆమెకు 22. ఏదో సినిమా టైటిల్ లాగా ఉందని అనుకోరు కాదండోయ్. నిజానికి సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని సినీ పరిశ్రమ వరకే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే, ఆయన ఓ సినిమా రైటర్, వయసు 42. ఆమె ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ యంగ్ అమ్మాయి, వయసు 22. వారిద్దరూ ఒకే డైరెక్టర్ కోసం పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. ఒకరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరొకరు జన్మించారు. దాదాపు రెండు దశాబ్దాల ఏజ్ గ్యాప్‌తో ఉన్న వీరి ప్రేమ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, ఈ రోజుల్లో ఏజ్ గ్యాప్ అనేది పెద్ద విషయమేమీ కాదు. రెండు మనసులు కలవాలి, కానీ దశాబ్దాల ఏజ్ గ్యాప్ కూడా పెద్ద విషయమేమీ కాదు. అయితే, సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమ కథలు మొదలవుతాయి అవి ప్రేమ కథలుగానే మిగిలిపోతాయి. కొన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళితే, కొన్ని పెళ్లికి ముందే ముగిసిపోతాయి. అయితే, మరి ఈ జంట పెళ్లి వరకు వెళ్తుందా, లేక ప్రేమ కథగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.
ప్రగ్యా జైస్వాల్‌కి చేదు అనుభవం
ముంబైలోని లాల్ బాగ్ రాజా వినాయక మండపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ ఎంత ఫేమస్ అయితే, ముంబైలో ఇది కూడా అంతే ఫేమస్. అయితే, అక్కడి నుంచి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు నటీమణులు ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ప్రియాంక చౌదరి వెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. సామాన్య భక్తులతో పాటు వారు వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టేసిన పరిస్థితి కనిపించింది. ఒక రకంగా వారిపై దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి సెలబ్రిటీలనే కాదు, వెళ్లిన సామాన్య భక్తులకు కూడా ఈ మండపంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒకరైతే తన సోదరి తలకు గాయమైందని చెప్పితే, మరొకరు తన తల్లి డ్రెస్ చినిగిపోయిందని పేర్కొన్నారు. మరొకరు తన తండ్రి ఊపిరాడక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వీరిలో కొంతమంది, సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం వారికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, ప్రియాంక చౌదరి, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు వచ్చినప్పుడు వారిని సైతం ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా జాక్‌లిన్ ఫెర్నాండిస్, అవినీత్ కౌర్ ఇలా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, విమర్శలు ఎదుర్కోక తప్పదు.