వన మహోత్సవంలో భాగస్వాములు కండి.. ఇది సామాజిక బాధ్యత.. ఈ మొక్కలే నాటండి..
దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలి.. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. ఇది సామాజిక బాధ్యత అంటూ పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పవన్ కల్యాణ్ కోరారు.. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ రోజు వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు పవన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్..
ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. మరో 15 రోజులు అవకాశం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగించింది.. వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కానీ, ఇప్పటికీ బదిలీల విధివిధానాలను మెజార్టీ శాఖలు రూపొందించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, రవాణ శాఖల బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయట.. విధి విధానాల రూపకల్పలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు ఉద్యోగులు.. వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీసర్ బేరర్స్ లెటర్స్ సంపాదించి.. బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఉద్యోగ సంఘాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.. తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్ బేరర్స్.. ఇతర పోస్టుల్లో ఉన్నట్టు లెటర్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.
గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం సీరియస్.. విచారణకు ఆదేశాలు
గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహరంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.. హిడెన్ కెమెరాల ఫిక్స్ చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.. ఇక, ఈ ఘటనపై ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు జరిపిస్తాం అన్నారు.. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలపైకి.. ప్రియురాలిని కాపాడి ప్రాణాలు విడిచిన ప్రియుడు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద యువకుడు మృతి చెంది పడి ఉన్నాడని, పక్కనే మరోయువతి రక్త మడుగులో కూర్చుని విలపిస్తూ ఉండడం గమనించిన స్థానికులు.. 108కి సమాచారం అధించారు. యువతి తీవ్రమైన గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం రైల్వే ఎస్సై టీవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరంకు చెందిన రాజేష్, ఏస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవడంతో నిన్న రాత్రి భీమవరం నుండి బండిపై పాలకొల్లు చేరుకున్నారు.. ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపైకి వెళ్లారు.. ఇంతలో ట్రైన్ దగ్గరకు రాగానే ప్రియురాలిని పక్కకి నెట్టిన రాజేష్.. తాను మాత్రం రైలు కింద పడిపోయాడు. యువతికి సృహ వచ్చి లేచి చూసేసరికి రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐకి తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో పడిపోయారు.
కవిత బెయిల్‌పై చేసిన వ్యాఖ్యల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల బెయిల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికపై వివరణ ఇచ్చారు. కొన్ని మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం, నమ్మకం ఉంది.. నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారు.. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలంగాణ సీఎం క్షమాపణలు చెప్పడానికి కారణం గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే. నోట్ల రద్దు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిందితులకు బెయిల్ ఇస్తారా అని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులను జస్టిస్ గవాయి ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవం చూపాలని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్ రావ్ ట్వీట్ వైరల్..
రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు ఇటీవల హల్‌చల్ చేస్తున్నాయి. మరికొందరు ఎలుకలు కొరికి ఆస్పత్రి పాలయ్యారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఆదిలాబాద్ జిల్లాలో 43 పాఠశాలలను మూసివేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నదన్నారు. ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ.. రాష్ట్రపతి పాలనపై ఊహాగానాలు!
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గవర్నర్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలోని తాజా సమస్య అయిన మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి సంబంధించిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆనందర్ బోస్ ఈ కేసుకి సంబంధించిన సమగ్ర వివరాలు షాకి సమర్పించనున్నారు. గత వారం కూడా గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్‌లను కలిశారు. ఆర్జీకర్ ఆస్పత్రి కేసును తెలియజేశారు. హోంమంత్రితో గవర్నర్ భేటీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించవచ్చా అనే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. వాస్తవానికి.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో అత్యాచారం-హత్య కేసు తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా గవర్నర్ అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, బెంగాల్ పోలీసులను నేరస్థులని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన బాధ్యతను ఏమాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అలాగే, పోలీసు కమిషనర్‌ను కూడా వెంటనే తొలగించాలన్నారు. తాను బెంగాల్ ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటానన్నారు.
“రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సంపూర్ణ శాంతి నెలకొంటుందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన ఆయన, తాను ఎలాంటి నేరం చేయలేదని, కుంభకోణం చేయలేదని చెప్పారు. గురువారం ఒక ఇంటర్వ్యూలో.. ఎన్ బీరెన్ సింగ్.. కుకీ-జో-మెయిటీ నాయకులతో మాట్లాడటానికి ఒక రాయబారిని నియమించినట్లు వెల్లడించారు. మణిపూర్‌లో 2023 మే నుంచి కుల హింస కొనసాగుతుండటం గమనార్హం. కుకీ-జో- మెయిటీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 226 మంది మరణించారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. చర్చల కోసం సీఎం ఎన్ బీరేన్ సింగ్ నాగా ఎమ్మెల్యే.. హిల్ ఏరియా కమిటీ చైర్మన్ డింగ్ంగ్‌లుంగ్ గాంగ్‌మీ నియమించారు.
రూ.76,200 కోట్ల విలువైన ప్రాజెక్టు.. 12 లక్షల మందికి ఉపాధి!
ప్రధాని నరేంద్ర మోడీ నేడు మహారాష్ట్రలోని ముంబై, పాల్ఘర్‌లలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024లో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు, పాల్ఘర్‌లోని సిడ్కో గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. పాల్ఘర్‌లో వాధావన్ పోర్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.76,200 కోట్లు. పెద్ద కంటైనర్ షిప్‌లను అందించగల ప్రపంచ స్థాయి సముద్ర ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా దేశం యొక్క వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా సముద్రం తీరప్రాంతాన్ని మరింత లోతుగా చేసి భారీ కార్గో షిప్‌లకు వసతి కల్పిస్తారు. పాల్ఘర్ జిల్లాలోని దహను నగరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రత్యేకమైనది. ఇది అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. ఇది రవాణా సమయాలు, ఖర్చులను తగ్గిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (MMB) చేత ఏర్పడిన ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) వాధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (VPPL) ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుంది. ఇందులో వారి వాటా వరుసగా 74% నుంచి 26% గా ఉంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాధావన్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌గా వాధావన్ పోర్ట్ అభివృద్ధి చేయబడుతుంది. ఇది అన్ని సీజన్లలో పనిచేస్తుంది.
విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కోసం భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది. విస్తారా – ఎయిర్ ఇండియాలో ఎఫ్‌డిఐకి భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ఆమోదం, ఎఫ్‌డిఐ క్లియరెన్స్, యాంటీ ట్రస్ట్, విలీన నియంత్రణ అనుమతులతో పాటు, ప్రతిపాదిత విలీనాన్ని పూర్తి చేయడం ఒక ముఖ్యమైన పరిణామం. విలీనాన్ని పూర్తి చేయడం అనేది వర్తించే భారతీయ చట్టాలకు పార్టీల సమ్మతిపై ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది రాబోయే కొద్ది నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
వెల్‌కమ్ టు ‘హీ’ టీమ్.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్!
రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ తెరకెక్కుతోంది. శ్రీసింహా, సత్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ‘ఫస్ట్ పార్ట్‌కు నో ఎక్స్పెక్టేషన్స్.. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హై’ అంటూ మత్తు వదలరా 2 టీజర్ మొదలైంది. ‘హీ హీ హీ హీటీమా.. అన్నీ హీలు లేవు.. ఒకటే హీ’ అంటూ శ్రీసింహా, సత్యలు కామెడీ చేశారు. ‘ఇది దొంగతనం కాదు.. తస్కరించుట’ అని సత్య చెప్పే డైలాగ్ బాగా నవ్విస్తుంది. ఫరియా అబ్దుల్లా ఫైట్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ ట్రాక్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేయబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. వెల్‌కమ్ టు ‘హీ’ టీమ్ అంటూ సాగే ఈ టీజర్‌ను మీరూ చూసేయండి. సెప్టెంబర్ 13న మత్తు వదలరా 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తూ క్యూరియాసిటీ పెంచగా.. టీజర్ మరింతగా ఆకట్టుకుంది. ఇందులో సునీల్, అజయ్, రోహిణి కీలక పాత్రలు చేస్తున్నారు.
నాని-ప్రియదర్శి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. పోస్టర్ రిలీజ్!
‘నేచురల్ స్టార్’ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా.. నేడు మరో సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘డార్లింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా తీస్తున్నా అని ప్రకటించిన నాని.. నేడు ఆ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ కూడా రివీల్ చేశారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా చేస్తున్న సినిమాకు ‘కోర్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘State vs A Nobody’ అనేది ట్యాగ్‌లైన్. ఇందుకు సంబంధించిన పోస్టర్, మోషన్ పోస్టర్‌ని నేడు రిలీజ్ చేశారు. కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో పోస్టర్‌ని వదిలారు. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నాని సమర్పకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఈరోజు కోర్ట్ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. నాని క్లాప్ కొట్టగా.. నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి తదితరులు నటిసున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రియదర్శి ప్రేక్షకుల ముందుకు రాగా.. నాని ‘సరిపోదా శనివారం’తో వచ్చారు.