డిప్యూటీ సీఎం పొగిడితే.. ఆ మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నట్టేనా..?
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా… ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు.. దీంతో, ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, పవన్ కల్యాణ్ కాంప్లిమెంట్ ఇస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లేనా అన్న చర్చ మంత్రివర్గంలో జరుగుతోంది.. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై సీరియస్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాగా గట్టిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలాగే గతంలో మంత్రి అనితపై కొన్ని విమర్శలు చేశారు. తానే హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుంది అన్నారు పవన్. కొంతమంది పోలీసులు ఇంకా పాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వాసనలతో ఉన్నారని ఆయన డైరెక్ట్ గానే చెప్పేస్తారు. దీంతో మంత్రిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి … కొంతమంది మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు.. దీంతో పవన్ కాంప్లిమెంట్ ఇస్తే మనం కూడా సేఫ్ జోన్ లో ఉంటామా అనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే పవన్ పొగిడితే , అది తమకు ఒక రాజముద్రగా ఉంటుందన్న అభిప్రాయంతో కొంతమంది మంత్రులు ఉన్నట్టు సమాచారం.
ప్రధాని మోడీకి కృతజ్ఞతాపూర్వక స్వాగతం..
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది.. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది.. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నాను..” అంటూ తన ట్వీట్‌తో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు..
ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్‌పోర్ట్ నుంచి అమరావతి వరకు..!
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని అమరావతి రీలాంచ్‌లో పాల్గొనబోతున్నారు.. అయితే, ప్రధాని టూర్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోయింది.. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేశారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేటు వద్ద ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు.. ఇక, ఎయిర్‌పోర్ట్ పిక్ అప్ కి వచ్చే వారికి పాస్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు పోలీసులు.. మరోవైపు ప్రధాని మోడీ సభకు తరలివచ్చే మార్గాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు పోలీసులు.. 6500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారని అంచనాలు ఉండగా.. 37 మంది ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ లతో భద్రత పర్యవేక్షిస్తున్నారు.. ప్రధాన మార్గాల్లో వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పాస్‌లు ఉంటే వేదిక దగ్గరకు అనుమతి ఇస్తున్నారు.. మిగతా వాహనాలకు 256 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ ప్రాంతాలకు పంపిస్తున్నారు.. అంతేకాదు.. రూట్ మ్యాప్ కోసం క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు అధికారులు.. అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధాని మోడీ విచ్చేయనున్న నేపథ్యంలో విజయవాడలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.. విజయవాడ నగరంలో 599 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.. 175 కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు.. నగర శివారుల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు.. 10 క్రేన్‌లు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సభ ప్రాంతానికి వీవీఐపీ రూట్లపై ముందస్తుగా నిఘా పెట్టారు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఇప్పటికే వాహనాల బారులు తీరాయి.. ట్రాఫిక్ క్యూలు నివారించేందుకు అస్త్రం యాప్ ఉపయోగిస్తున్నారు.. ట్రాఫిక్ బ్రేక్‌డౌన్, ఎమర్జెన్సీ పరిస్థితులకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారు పోలీసులు..
తెలంగాణ గొర్రెల స్కాం కేసులో కీలక మలుపు.. ఏ1 నిందితుడు అరెస్ట్
తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్‌ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే ఇన్పౌండ్ చేశారు. వీరిద్దరూ ‘లోలోన ది లైవ్’ అనే సంస్థ పేరుతో దళారి వ్యవహారాన్ని నడుపుతూ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకాన్ని పెద్ద ఎత్తున అక్రమాలకు వేదిక చేసినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం రూ.1200 కోట్ల మేర అవినీతికి ఈ స్కాం దారి తీసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్, మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు సహా 17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా అరెస్ట్ చేసిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు.
116 ఏళ్ల జ్ఞాపకం.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత..
కాలం ఒక నది లాంటిది. ఎందరినో తనలో కలుపుకొని సాగిపోతూ ఉంటుంది. అలాంటి కాలపు ప్రవాహంలో ఒక అరుదైన జ్ఞాపకంలా నిలిచిన కనబారో లుకాస్ ఇక లేరు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఈ బ్రెజిలియన్ సన్యాసిని 116 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె 117వ పుట్టినరోజుకు కేవలం కొన్ని వారాల ముందు మరణించడం విషాదకరం. 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జన్మించిన కనబారో, తన జీవితాన్ని ఒక సన్యాసినిగా గడిపారు. 21 ఏళ్ల వయసులోనే ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కనబారో జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆమెకు ఫుట్‌బాల్ అంటే ఎంతో అభిమానం. తన ప్రతి పుట్టినరోజుకు ఫుట్‌బాల్ టీషర్ట్‌ను ధరించి సంబరాలు చేసుకునేవారు. ఈ ప్రత్యేకమైన ఆచారం ఆమెను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కనబారో లుకాస్ మరణంతో, ఇప్పుడు 115 ఏళ్ల వయసున్న ఇంగ్లాండ్‌కు చెందిన ఈథెల్ కేటర్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందారు. కనబారో లుకాస్ ఒక శకం. 116 ఏళ్ల పాటు ఆమె జీవించిన జీవితం ఒక అద్భుతం. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటాయి. కాలం గడుస్తున్నా కొన్ని జీవితాలు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
ఉగ్రవాదుల చేతిలో ‘ఎన్‌క్రిప్టెడ్’ పరికరాలు.. దీని ప్రత్యేకతలు ఇవే!
పహల్గామ్‌లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా భావిస్తోంది. స్థానికుల సహకారంతో వీరంతా భద్రంగా ఉన్నట్లుగా అంచనా వేస్తోంది. అయితే వీరి దగ్గర అత్యంత భద్రత కలిగిన ‘‘ఎన్‌క్రిప్టెడ్’’ (Encrypted) కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నట్లుగా భావిస్తోంది. ఇదొక సీక్రెట్ పరికరం. ఈ పరికరాలు సమాచారాన్ని అంత్యంత గోప్యంగా ఉంచుతాయి. సమాచారం గానీ.. డేటా గానీ రహస్య కోడ్‌గా మారిపోతుంది. ఇదొక గూఢ లిపి పరికరం. ఈ పరికరాలు ఉన్న వారికి మాత్రం కోడ్ భాష అర్థమవుతోంది. అంతేకాకుండా సమాచారం కూడా వారికి మాత్రమే అందుతుంది. ఇలాంటి అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం వల్ల ఉగ్రవాదుల జాడ తెలియడం లేదు. ఈ పరికరాలు అత్యంత భద్రతతో పాటు సమాచారం కూడా చాలా సురక్షితంగా ఉంచుతుంది.
అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో హీరోలకు నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోను ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ చిరు ఫ్యాన్స్ ని మెప్పించాలి అంటే అంత చిన్న విషయం కాదు.. అందుకే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్‌గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నారట మూవీ టీం. కాగా అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన భారీ కసరత్తులను మొదలెట్టిపన్నటికి, జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటీనటుల గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నప్పటికి, తాజాగా మరో థియేటర్ బ్లాస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఏంటీ అంటే ఈ సినిమా మీద హైప్ తీసుకురావడానికి రామ్ చరణ్‌ను ఇందులో భాగం చేస్తున్నారట. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hit 3 మొదటి రోజు కలెక్షన్స్.. నాని ఊచకోత
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు కాస్త ఎక్కువయ్యాయని కంప్లైంట్ ఉన్నకలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించిన హిట్ 3 మొదటి రోజు అంతే జోష్ చూపించింది. హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టినట్టు అధికారకంగా ప్రకటించారు. ఈవిషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా హిట్ 3 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ తో పాటు మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం ఉన్న టైర్ 2 హీరోలలో డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రేపు, ఎల్లుండి లాంగ్ వీకెండ్ ఉండడం హిట్ 3 కి కలిసొచ్చే అంశం. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా వంద కోట్ల క్లబ్ క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అటు ఓవర్సీస్ లోను హిట్ 3 భారీ వసూళ్లు దిశగా సాగుతోంది.