వీఐపీలు ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనానికి రావాలి..!
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేలాది మంది తరలివస్తుంటారు.. ఒక ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉందంటే చాలు.. వీఐపీల తాకిడి ఉంటుంది.. అయితే, కొన్నిసార్లు వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అయితే, తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. టీటీడీ నిధుల వ్యయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.. టీటీడీ నిధులను శ్రీవారి భక్తుల సౌకర్యాలకే వినియోగించాలన్నారు వెంకయ్య నాయుడు. మరోవైపు ఊరుకో గుడి.. బడి ఉండాలని.. బడి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వాన్నిదైతే.. కానీ, గుడి నిర్మాణ బాధ్యతను టీటీడీ తీసుకోవాలన్నారు వెంకయ్య నాయుడు.
రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్ మంత్రితో ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు..
రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తోన్న ఆయన.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సమావేశం అయ్యారు.. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చర్చించారు.. అయితే, రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ఈ సందర్భంగా మంత్రి టాన్ సీ లాంగ్ కు స్పష్టం చేశారు చంద్రబాబు.. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించామని తెలిపిన ఆయన.. నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు.. ఇక, సింగపూర్ ను చూసే హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్న ఆయన.. నాలెడ్జి ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు.. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు.. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరం అన్నారు.. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించారు.. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్ సహకరించాలని కోరారు..
ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దసరా ఉత్సవాలు.. అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారంటే..?
దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్ 22న దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండగా.. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. సెప్టెంబర్ 22 – బాలా త్రిపురసుందరీ దేవి, సెప్టెంబర్ 23 – శ్రీ గాయత్రీ దేవి, సెప్టెంబర్ 24 – శ్రీ అన్నపూర్ణా దేవి, సెప్టెంబర్ 25 – శ్రీ కాత్యాయని దేవి, సెప్టెంబర్ 26 – శ్రీ మహాలక్ష్మీ దేవి, సెప్టెంబర్ 27 – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, సెప్టెంబర్ 28 – శ్రీ మహాచండీ దేవి, సెప్టెంబర్ 29 – శ్రీ సరస్వతీ దేవి, సెప్టెంబర్ 30 – శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 01 – శ్రీ మహిషాసురమర్దినీ దేవి, అక్టోబర్ 02 – శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ..
ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ చైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ పెట్టండి..!
సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి వివిధ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. వివిధ సంస్థల చీఫ్‌లు, ప్రతినిధులతో భేటీ అవుతున్నారు.. ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. 2029నాటికి ఆంధ్రప్రదేశ్ లో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించాం అన్నారు… రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని… ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయమని కోరారు.. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వోల్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు లోకేష్.. ఏపీలోని ఐటిఐలలో రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని కోరారు. దీనిపై ఎవర్ వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ… ఏపీ ఎంపికచేసిన ఒక ఐటిఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ.. సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్ టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజి ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 1 గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ.. 2026నాటికి 3 గిగావాట్ల చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.
కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
హైదరాబాద్ కొండాపూర్‌లోలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసుల దాడి చేశారు. 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అశోక్ కుమార్ వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను టార్గెట్ గా చేసుకుని అశోక్ కుమార్ రేవ్ పార్టీలకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రతి వీకెండ్ లో ఆంధ్ర నుంచి యువతి యువకులను తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న స్వాధీనం చేసుకున్న AP31SR001 ఫార్చునర్ కారుపై ఎంపీ స్టిక్కర్ ఫేక్ గా గుర్తించారు. టోల్ గేట్ల వద్ద ఫీజు కట్టకుండా తప్పించుకునేందుకే స్టిక్కర్ పెట్టుకున్నట్లు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అనేదానిపై విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అశోక్ కుమార్ కోడిపందాల వ్యాపారిగా గుర్తింపు ఉంది. ఎక్సైజ్ పోలీసులు అశోక్ ని రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్ లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం
హైదరాబాద్ లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. రూ.3 కోట్ల విలువైన యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పురోహిత్ లు ముగ్గురని అరెస్ట్ చేశారు. ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు.
“గబ్బిలాలతో చిల్లీ చికెన్ తయారీ”.. తమిళనాడులో కలకలం..
తమిళనాడు రాష్ట్రంలో ‘‘గబ్బిలాల’’ వేట కలకలం రేపుతోంది. గబ్బిలాలను చంపి, వాటిని సమీపంలో హోటల్స్‌లో చిల్లీ చికెన్‌లా తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. సేలం జిల్లా డేనిష్ పేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డానిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గబ్బిలాలను ఎందుకు వేటాడుతున్నారని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో, దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. గత కొన్ని నెలలుగా గబ్బిలాలను చంపి సమీపంలోని హోటల్స్‌కి చిన్న చిన్న ముక్కలుగా చేసి పంపుతున్నట్లు సెల్వం, కమల్ వెల్లడించారు. చిల్లి చికెన్‌కు అవసరయ్యే సైజులో ముక్కలుగా కోసి పంపుతున్నట్లు తేలింది. మద్యం షాపుల వద్ద చికెన్ పడోడా రూపంలో విక్రయిస్తున్నట్లు విచారణలో ఇద్దరు అంగీకరించారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. గతంలో చెన్నై సిటీలో కుక్కలను, పిల్లులను చంపి పలు హోటల్స్‌లో మటన్ బిర్యానీగా అమ్మిన సంఘటనలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు పిటిషన్‌లో గుర్తింపు దాచిన జస్టిస్ వర్మ.. “XXX”గా పేరు..
జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో ఓ అగ్నిప్రమాదంలో వందల కోట్ల నగదు పట్టుబడింది. ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే, తనను తొలగించాని సిఫార్సు చేసిన విచారణ ప్యానెల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే, ఈ కేసు విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన గుర్తింపును దాచిపెట్టారు. సోమవారం సుప్రీంకోర్టు కాజ్ లిస్టు కేసును “XXX vs ది యూనియన్ ఆఫ్ ఇండియా”గా పేర్కొంది. ఇక్కడ XXX జస్టిస్ వర్మను సూచిస్తుంది. ఆయన తన పిటిషన్‌లో తన గుర్తింపును దాచిపెట్టకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాడు. సాధారణంగా పిటిషనర్ల గుర్తింపును దాచడానికి ‘XXX’ని ఉపయోగిస్తుంటారు. లైంగిక వేధింపులు లేదా అత్యాచార బాధితులు సాధారణంగా దీనిని ఉపయోగిస్తుంటారు. మైనర్లు, మైనర్లకు సంబంధించిన కేసుల్లో వారి గుర్తింపును బహిర్గతం చేయకుండా ఉండటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
రావణుడు లక్ష్మణ రేఖ దాటితే లంక కాలిపోయింది.. పాకిస్తాన్‌కి కూడా అదే గతి..
పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్‌పై ఈ రోజు సభలో చర్చ జరగడానికి ముందు, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. రామాయణాన్ని ఉటంకిస్తూ, పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై ఈ రోజు చర్చ ప్రారంభం.. రావణుడు లక్ష్మణ రేఖను దాటినప్పుడు, లంక కాలిపోయింది. భారతదేశం గీసిన రెడ్ లైన్ పాకిస్తాన్ దాటినప్పుడు, ఉగ్రవాద శిబిరాలు అగ్నికి ఆహుతయ్యాయి’’ అని ఎక్స్‌లో ఒక పోస్టులో రాశారు.
టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా లే ఆఫ్స్.. టెక్కీలకు కష్టకాలం..
అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది. గత రెండేళ్ల కాలంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ టెక్ దిగ్గజ కంపెనీలు చాలా వరకు రిక్రూట్లను ఆపేశాయి. ఇప్పుడు, ఉన్న ఉద్యోగులను తీసేసి, వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత కంపెనీల్లో కొన్ని రోల్స్ అవసరం లేదని సంస్థలు భావిస్తున్నాయి.
బంగారం, వెండి ధరలకు కళ్లెం.. నేటి ధరలు ఇవే
శ్రావణ మాసం వేళ శుభకార్యాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరలు దడ పుట్టిస్తుండగా నేడు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,993, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,160 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,080 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. భర్త పై పరిణీతి షాకింగ్ కామెంట్ !
బాలీవుడ్‌లో అందమైన జంట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పరిణీతి చోప్రా – రాఘవ్ చద్ధా ద్వయమే. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్ధా తో పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో లీలా ప్యాలెస్ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. అప్పటి నుండి సినిమా ఈవెంట్‌లు, టీవీ షోలు, ఫంక్షన్లకు కలిసి హాజరై అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఈ జంట ‘కపిల్ శర్మ షో’లో సందడి చేశారు. హాస్యం, సరదా మిక్స్‌తో నిండిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. రాఘవ్ చెప్పులు లేకుండా రావడంతో చర్చనీయాంశంగా మారింది. ‘‘చెప్పులు ఎవరో అపహరించేశారు అందుకే ఇలా వచ్చా’’ అంటూ ముచ్చటించారు.
విశ్వంభర లేటెస్ట్ రిలీజ్ డేట్.. డిసెంబర్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు. మౌని రేయ్ చిరు సరసన స్టెప్పులేస్తోంది. దాంతో షూటింగ్ మొత్తం కంప్లిట్ అయింది. ఎప్పుడో విడుదల కావాల్సిన విశ్వంభర విఎఫెక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. విశ్వంభర రిలీజ్ కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని రీ వర్క్ చేస్తున్నారు. దాదాపు రూ. 75 కోట్లు విఎఫెక్స్ కోసం ఖర్చు పెడుతోంది. ఇదిలా ఉండగా విఎఫెక్స్ వర్క్ ఆగస్టు చివరి నాటికి ఫినిష్ అవుతుందని సెప్టెంబర్ 25 న విశ్వంభర రిలీజ్ అని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటికే అదే డేట్ కు బాలయ్య -బోయపాటిల అఖండ 2, పవర్ స్టార్ OG రెడీ గా ఉన్నాయి. దాంతో ఆ రెండు సినిమాలతో పోటీ ఎందుకు అందుకున్నారో ఏమో విశ్వంభరను మరోసారి వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అటు VFX వర్క్ కూడా సెప్టెంబర్ నాటికి ఫినిష్ అవదు అని టాక్ కూడా ఉంది. దాంతో విశ్వంభర సెప్టెంబర్ రేస్ నుండి తప్పుకుని డిసెంబరుకు వెళ్తోంది. అక్కడ ముందే కర్చీఫ్ వేసుకుని ఉన్న రాజాసాబ్ సంక్రాంతికి వెళ్లే అవకాశం ఉంది.