ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు పయనిస్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై అధికంగా ఉండనుంది. ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండం ముప్పుకు రైతుల్లో అలజడి కనిపిస్తోంది. ప్రస్తుతం పంటలు కోత దశలో వున్నాయి. వరి ఎక్కడికక్కడ పొలాల్లో వుండిపోయింది. ఈ దశలో భారీ వర్షాలు నమోదైతే నష్టం జరుగుతుంది. బలమైన గాలులు వుంటాయి కనుక నెలకొరిగిపోయే ప్రమాదం వుంది. దీంతో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది. మరో వైపు, ఆంధ్ర ప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తేలికపాటి నుంచి మొదలయ్యే వర్షాలు క్రమేపీ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది.
అజ్ఞాతం వీడని ఆర్జీవీ.. ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసుల ఫోకస్..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలలో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలతో సెర్చ్ చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు రాంగోపాల్ వర్మ..
గజేంద్ర సింగ్ షెఖావత్‌లో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఏడు ప్రాజెక్టుపై ప్రతిపాదనలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన.. తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది.. గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చు అన్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కోరామని.. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాం.. అన్ని మతాల వారి మత పూజలు, ప్రార్ధనలు చేస్తారు.. అలాగే మన రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని స్పష్టం చేశారు.. వినూత్న భావనతో ఆలోచించడం మానేశాం.. చాలా దశాబ్దాలు మనం ఆధారపడే వారుగానే ఆలోచించాం.. రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు నుంచీ రాజ్యాంగం రచించుకున్నాం.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలు చదివారు.. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించి రచించారు. 299 మంది విశిష్ఠ వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు సీఎం చంద్రబాబు..
పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం..
విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం 26 నవంబర్ 1949న వచ్చిందన్నారు.. రాజ్యాంగ రూపకర్తలను మనం స్మరించుకోవాలి.. హోం సెక్రెటరీ తప్ప మిగతా ఐపీఎస్ లు ఎవరూ లేరు ఈ సమావేశంలో… రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలి.. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా రాజ్యాంగ ప్రతిని అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తేవాలన్నారు.. Be the people of India కాదు.. Be the children of India.. పిల్లలే భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది. రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ మోడీ ప్రజా యోగ్యమైన పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. సత్యమేవ జయతే నినాదమే ఊపిరిగా సదా రాజ్యాంగ రక్షణలో నరేంద్ర మోడీ అంటూ పేర్కొనింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమేనని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. ఇక, రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ నారీ శక్తి బిల్లు పరిష్కరణ, రాజ్యాంగ బద్ధంగానే ట్రిపుల్ తలాక్ సమస్యకు సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలంగాణ బీజేపీ తెలిపింది. అలాగే, రాజ్యాంగానికి లోబడే అయోధ్య రామ మందిర వివాదానికి చెక్ పెట్టినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలను నిలబెట్టడానికి నా జీవితంలో ప్రతి క్షణం అంకితం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలను తెలంగాణ బీజేపీ ఎక్స్‌లో ఈ రోజు (మంగళవారం) పోస్ట్ చేసింది.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ సిండే రాజీనామా..
శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు (మంగళవారం) రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు షిండే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీ సాధించింది. ఇక, తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకు కూటమి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. కాగా, మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీయే కూటమికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల కలయికతో విజయం సాధించిన మహయుతి కూటమిలో ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 132 స్థానాల్లో గెలుచింది. ఇక, మహాయుతి ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో సీఎం పదవిపై కూటమిలో వాదనలు, ప్రతివాదనలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోసం పట్టుబడుతుండగా.. ఇంకోవైపు ఏక్ నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శివసేన (షిండే) వర్గం డిమాండ్ చేస్తోంది. సీఎం పదవికి సంబంధించి ఢిల్లీలోనే నిర్ణయం తీసుకుంటారని మొదట చర్చ కొనసాగింది. ఈ పరిణామాలన్నింటిలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం హస్తినకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే వచ్చేశారనే చర్చ కొనసాగుతుంది.
ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా.. 24 క్యారెట్ల ధర రూ.77,240గా ఉంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వరుసగా రెండోరోజు వెండి ధర తగ్గింది. నిన్న కిలో వెండిపై రూ.500 తగ్గగా.. నేడు రూ.2,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.98,000 కొనసాగుతోంది.
రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా!
ప్రముఖ రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు. దీంతో ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో కూడా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపినా.. ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 25న తన ఎదుట హాజరు కావాలని విచారణాధికారి నోటీసులు పంపారు. అప్పటికే హైకోర్టులో వర్మ మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు. దాంతో నిన్న ఉదయం 11 గంటల తర్వాత పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయానికి వెళ్లారు.
చిట్టిబాబుకి మించి.. ‘మాస్ కా బాప్’ అనేలా రామ్ చరణ్!
ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో జెట్ స్పీడ్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టేశాడు చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 16’ షూటింగ్ మైసూర్‌లో మొదలు కాగా.. చరణ్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. భారీ గడ్డంతో రగ్గడ్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా చరణ్ కొత్త లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేస్తుండగా.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్ లుక్ పూర్తిగా కనిపించడం లేదు. కాబట్టి ఇది ప్రీ లుక్ అనే చెప్పాలి. కానీ ఈ ప్రీ లుక్‌లో మాత్రం మాస్ కా బాప్ అనేలా ఉన్నాడు చరణ్. ఖచ్చితంగా రంగస్థలంలో చిట్టిబాబుకి మించిన మాసివ్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
రిషబ్ శెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా?.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత.. అరరె ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా?, వస్తే రిజెక్ట్ చేస్తున్నారా?, లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారా? అనేది తెలియదు. ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ.. మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు మరికొంత మంది తమిళ్ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ‘కాంతార’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్న రిషబ్.. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ జై హనుమాన్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా స్ట్రెయిట్ మూవీ చేయడానికి రిషబ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
శ్రీలీల.. చంపేశావ్ పో: సమంత
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్‌లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వ్యూస్‌తో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా కిస్సిక్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలోని ‘విజిల్ పోడు’ టాప్-1గా కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24. 88 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ రికార్డును అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది మన కిస్సిక్. కేవలం తెలుగు లిరికల్ సాంగ్ వ్యూస్‌తో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇక ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్ మామూలుగా ఉండదని.. లిరికల్ సాంగ్‌తో తేలిపోయింది. ఏకంగా బన్నీని సైతం డామినేట్ చేసినట్టుగా చర్చించుకుంటున్నారు. సమంత కంటే శ్రీలీలనే కుమ్మేసిందనే టాక్ కూడా నడుస్తోంది. ఈ కిస్సిక్ సాంగ్ పై సమంత స్పందించింది. కస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో సెగలు పుట్టించిందని పేర్కొన్నారు. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో మూడు ఫైర్ ఎమోజీలు పెడుతూ.. శ్రీలీల చంపేశావ్ అని షేర్ చేసింది. అంతేకాదు ‘సైలెంట్‌గా ఉండండి.. పుష్ప 2 కోసం వెయిట్ చేయండి’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. మరి కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం శ్రీలీల డ్యాన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఎంతలా దుమ్ము లేపుతుందో చూడాలి మరి.