కడప మేయర్‌పై అనర్హత వేటు.. కార్పొరేషన్‌కు చేరిన ఉత్తర్వులు..
కడప మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కడప మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడని విజిలెన్స్ విచారణలో తేలింది. వర్ధిని సంస్థలో కొత్తమద్ది అమరేష్, కొత్తమద్ది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 క్లాసెస్ 22 (1) ప్రకారం మేయర్ నేరుగా గాని, కుటుంబ సభ్యుల ద్వారా గాని కార్పొరేషన్ కాంట్రాక్టు పనులు చేయడం నిబంధనలకు విరుద్ధం. మున్సిపల్ యాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారు. ఈ అంశంపై మేయర్ సురేష్ బాబు పై అనర్హత వేటు వేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇదంతా పక్కా రాజకీయ కుట్రగా వైసీపీ ఆరోపిస్తోంది. కడప కార్పొరేషన్ అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణలో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని గుర్తించారు. మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీస్ పై మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రెండుసార్లు గడువు పెంచిన హైకోర్టు మూడోసారి విచారణ హాజరుకావాలని ఆదేశించింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం, మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు చేరింది..
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించిన పవన్ కల్యాణ్.. కీలక ఆదేశాలు జారీ
ఉప్పాడలో రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు స్థానిక మత్స్యకారులు.. అయితే, మత్స్యకారుల ఆందోళనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయన్న ఆయన.. పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేస్తాం.. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్నీ గుర్తించాం.. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు, వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను.. అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్..
సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు సీఐ శంకరయ్య.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన జె.శంకరయ్య.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది.. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా సీఎం చంద్రబాబు పలు మార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తున్న సీఐ శంకరయ్య.. న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18వ తేదీన నోటీసులు పంపారు. అయితే ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన ప్రతిష్టకి భంగం కలిగించేలా మాట్లాడిన చంద్రబాబు.. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాక, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు కోటి 45 లక్షల రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలని సీఐ శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నోటీసులపై సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.. కాగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్.. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి తనను ప్రతిపక్ష నేతగా హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. అయితే, జగన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది..
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. న్యాయస్థానం ఇచ్చేది కాదు..!
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే.. కానీ, న్యాయస్థానం ఇచ్చేది కాదు అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బయటకు వచ్చి నేటికి 12 సంవత్సరాలు అయినందుకు వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో? అని సెటైర్లు వేశారు.. జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల సౌకర్యాలు ఏర్పడేవన్నారు.. ప్రపంచంలో ఏ రైతులు చెయ్యలేని త్యాగం అమరావతి రైతులు చేశారు. 33 వేల ఎకరాలు భూములు రాజధానికి ఇచ్చారు.. రైతుల చేసిన భూ త్యాగం మరువలేం, వారికిచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని ప్రకటించారు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో సీఆర్‌డీఏ బిల్డింగ్ నిర్మాణం పనులను పరిశీలించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. దసరా సందర్భంగా భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఏర్పాట్లను పరిశీలించారు.. విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. భవనానికి విద్యుత్ పనులు రేపటిలోగా అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. పరిపాలనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.. ఈ సందర్భంగా అమరావతి రాజధానితో పాటు.. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీజేపీ విజయం సాధిస్తుంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్, కేసీఆర్ తెచ్చారని బీఆర్‌ఎస్ చెబుతున్నాయని.. కానీ, పార్లమెంట్‌లో బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. గత పదేళ్లుగా పాలకులు మాటలతో మభ్యపెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు కాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేకపోతున్నాయని అన్నారు.
Formula E-Car Race కేసులో కీలక పరిణామం.. అధికారులపై చర్యలకు సిఫారసు
ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా E కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ (IAS) అధికారులు అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్, వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందింది. మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గవర్నర్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేయడం, మాజీ మంత్రిపై గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూడటం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో బొగ్గు రంగానికి భారీ ఊరట..
జీఎస్టీ 2.O అమలుతో వివిధ రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తోంది. పైగా జీఎస్టీ 2.O పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నూతన జీఎస్టీ నిర్ణయాలు దేశంలోని బొగ్గు రంగంపై సానుకూలంగా కనిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ లాభం చేకూరేలా తాజా జీఎస్టీ నిర్ణయాలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల్లో కోల్ రంగంపై నిర్ణయాలు చూస్తే.. బొగ్గుపై జీఎస్టీ పరిహార సెస్ రద్దు, అలాగే ప్రతి టన్ను కోల్ పై రూ.400 ల పరిహార సెస్ ను తొలిగించింది జీఎస్టీ కౌన్సిల్. ఇంకా బొగ్గుపై గతంలో జీఎస్టీ 5% నుంచి 18%కి పెంపు ఉండగా.. జీఎస్టీ నిర్ణయాలతో వినియోగదారులకు లాభం కానుంది. కొత్త విధానంతో బొగ్గు ధరల్లో గణనీయమైన తగ్గింపు వచ్చింది. G6 నుంచి G17 గ్రేడ్‌ల వరకు టన్నుకి రూపాయలు 13.40 నుంచి 329.61 వరకు ధరలు తగ్గాయి. విద్యుత్ రంగానికి టన్నుకి సగటు రూ.260 తగ్గిపోగా, దీని వలన ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు 17–18 పైసలు తగ్గనుంది.
యూఎన్‌లో ట్రంప్‌తో పాక్ ప్రధాని సంభాషణ.. రేపు వైట్‌హౌస్‌లో ప్రత్యేక భేటీ
న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు. గాజా సంక్షోభంపై టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, ఈజిప్ట్, యూఏఈ, జోర్డాన్‌లతో సహా ముస్లిం దేశాలు ఎంపిక చేసిన నాయకుల బృందంతో ట్రంప్ బహుపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇది అతి ముఖ్యమైన సమావేశం అని.. గాజాలో యుద్ధాన్ని త్వరలో ముగించడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ ముగింపులో ట్రంప్‌ను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కలిశారు. అనధికారిక భేటీలో కొద్ది సేపు సంభాషించుకున్నారు. ఇరువురు షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకుని మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 25(గురువారం) వైట్‌హౌస్‌కు రావాలని పాక్ ప్రధాని షరీఫ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ట్రంప్ ఆహ్వానం మేరకు షరీఫ్ గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్
రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద స్థాయిలో తుఫాన్ సంభవించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తైవాన్‌లోని హువాలియన్‌లో బారియర్ సరస్సు ఉప్పొంగడంతో 14 మంది చనిపోగా.. 124 మంది గల్లంతయ్యారు. ఇక నీళ్లు కార్యాలయాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం తుఫాను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్ వైపు దూసుకుపోతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్రమైన గాలులు కారణంగా తైవాన్, హాంకాంగ్ ప్రజలు బుధవారం ఉదయం హడలెత్తిపోయారు. భీకరమైన ఈదురుగాలుల కారణంగా ప్రాణభయంతో బిల్డింగ్‌ల పైకి పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2009లో దక్షిణ తైవాన్‌లో వచ్చిన తుఫాన్ కారణంగా 700 మంది చనిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో తుఫాన్ వచ్చింది.
గోల్డ్ లవర్స్‌కు ఊరట.. నేటి పసిడి ధరలు ఇలా..!
పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. ధరలకు బుధవారం కళ్లెం పడింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు నేడు మాత్రం బ్రేక్‌లు పడ్డాయి. తులం గోల్డ్ ధరపై రూ.320 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.320 తగ్గి రూ.1, 15, 370 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 తగ్గి రూ.1, 05, 750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.240 తగ్గి రూ.86,530 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం రూ. 1,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,50,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?
శాంసంగ్ తాజాగా గెలాక్సీ A సిరీస్ టాబ్లెట్ Samsung Galaxy Tab A11 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో 8.7 అంగుళాల డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఆక్స్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతున్న ఈ డివైస్ 5,100mAh బ్యాటరీతో వస్తోంది. ఫోటోగ్రఫీ కోసం 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇది 2023లో వచ్చిన Galaxy Tab A9 కు అప్డేటెడ్ గా మార్కెట్లోకి వచ్చింది. Samsung Galaxy Tab A11 భారత్‌లో 4GB RAM + 64GB స్టోరేజ్ Wi-Fi వెర్షన్ రూ.12,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.17,999గా ఉంది. ఇక సెల్యులర్ వెర్షన్లలో 4GB + 64GB మోడల్ రూ.15,999, 8GB + 128GB మోడల్ రూ.20,999 గా నిర్ణయించబడింది. ఇది గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Galaxy Tab A11లో 8.7 అంగుళాల HD+ (800×1340 పిక్సెల్స్) TFT డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇందులో 2.2GHz CPU స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ చిప్‌సెట్ ను అందించారు. ర్యామ్ ఆప్షన్లు 4GB నుండి 8GB వరకు, అలాగే స్టోరేజ్ 64GB నుండి 128GB వరకు లభిస్తుంది. అంతేకాకుండా, మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
హస్కీ వాయిస్‌తో విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్ ఎంట్రీ
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఖైదీ’ చిత్రంతో ఫేమస్ అవ్వగా.. అతడి హస్కీ వాయిస్ కు సెపరెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ వాయిస్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడిగా కొనసాగుతూ, వాయిస్ ఓవర్ ద్వారా మరింత గుర్తింపు పొందుతున్న అర్జున్, టాలీవుడ్ టూ.. కోలివుడ్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ లో కీలక పాత్ర పోషిస్తుండగా, తాజాగా బాలీవుడ్‌లో ‘డాన్ 3’ మూవీలో అర్జున్ దాస్ ఎంట్రీ ఇస్తున్నాడట. రణవీర్ సింగ్ కథానాయకుడిగా, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో, డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అర్జున్ డాన్ 3లో విలన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. ఖైదీ, విక్రమ్, మాస్టర్ లోని పాత్రలు చూస్తే, దర్శకుడు పర్హాన్ తన రాసిన విలన్ పాత్రకు అర్జున్‌ను పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాడట. ఇప్పటికే ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి గ్లోబల్ బ్యూటీ లు కూడా ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 1978లో డాన్ మొదటి చిత్రం, 2011లో డాన్ 2 రిలీజ్ అయింది, ఇక ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ‘డాన్ 3’ పట్టాలెక్కుతోంది.
పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది OG. కాగా ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా వస్తోంది. ఇక కథ విషయానికి వస్తే ఒకప్పుడు ముంబై మాఫియాను ఏలిన గ్యాంగ్ స్టర్ OG. ముంబై మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తాడు. కానీ ఒక బలమైన కారణంగా ఉన్నట్టుండి మాఫీయాను వదిలేసి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంతాడట. OG వెళ్ళిపోవండం OMI (ఇమ్రాన్ హష్మీ) మాఫియను తన గుప్పిట్లో పెట్టుకోవాలని, ఆధిపత్యం చెలాయించాలని చూస్తడట. ఈ క్రమంలో OG ఫ్యామిలీ జోలికి వేల్తాడట OMI. దాంతో అజ్ఞాతం వీడి ఈ సారి తన కొడుకుని, ఫామిలీని రక్షించుకోవడం కోసం ముంబై తిరిగివచ్చిన వచ్చిన ఓజి చేసే విధ్వంసం మాములుగా ఉండదట. ముంబై తిరిగి వచ్చిన ఓజీకి అలాగే ఓమికిమధ్య జరిగే సంఘర్షణ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతుందట. కాస్త అటు ఇటుగా ఈ సినిమా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ని పోలిఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాత్రం ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా OG ఫ్యాన్స్ కు ఓ పండగ లాంటి సినిమా సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరోతో దిల్ రాజు సినిమా?
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో విజయ్ దేవరకొండతో ఓ సినిమా తప్ప స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు. ఈ నేపథ్యంలోమరోసారి తమిళ ఇండస్ట్రీవైపు చూస్తున్నాడు దిల్ రాజు. తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు’ సినిమాతో కోలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు కోలీవుడ్ మరొక స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట దిల్ రాజు.