ల్యాండ్ పూలింగ్‌పై భయాందోళనలు వద్దు..!
రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై వ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అమరావతి రాజధాని రీ లాంచ్ కార్యక్రమనికి వచ్చే నెల 2న ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు.. వేదిక ఏర్పాట్లు ఇవాళ పరిశీలించాం.. రోడ్ల పనులు.. పార్కింగ్ పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయన్నారు.. అవసరం అయితే పార్కింగ్ స్థలాలను పెంచాలని సీఎం సూచించారు. కేవలం 58 రోజులల్లో.. లిటిగేషన్ లేకుండా రైతులు భూములు ఇచ్చారు.. సభ జరిగే ప్రాంగణంలో మూడు వేదికలు ఉంటాయి.. ఒక వేదిక పై రైతులు కూర్చుంటారు.. సీఎం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. అయితే, రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం.. కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు.. మరోవైపు.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 2014లోనే అనుకున్నాం.. గుజరాత్ లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించామని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డిజైన్ ఎలా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నారాయణ..
కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్.. స్థలాన్ని పరిశీలించిన మంత్రి
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొప్పర్తి పారిశ్రామిక వాడను పరిశీలించారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎం.ఎస్.ఎం పార్క్‌పై అపోహలు వద్దు.. జిల్లాలోని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాలు ఐటీ పార్క్ కోసం స్థల పరిశీలన చేస్తున్నాం అన్నారు.. పార్క్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఎటువంటి పరిశ్రమలకు కేటాయించాలో పరిశీలిస్తున్నాం. ప్రైవేటు భాగస్వామ్యంతో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాం.. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాల చర్చించడానికి ఇక్కడికి వచ్చా.. అన్ని శాఖల అధికారులతో కలిసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నాం అన్నారు.. ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మంచి మంచి కంపెనీలు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు..
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ..! కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు.. కానీ, ఎటువంటి మార్పు లేదు అని దుయ్యబట్టారు.. అప్పు అంత ఉంది ఇంత ఉందని ఎవరు నోటికి ఏదోస్తే అది చెప్తున్నారు.. మట్కా లెక్కల మాదిరి అప్పు లెక్కలు మాట్లాడుతున్నారు అని ప్రజలు అంటున్నారన్నారు.. సంపద సృష్టి అంటున్నారు.. అనుభవం కదా అని ప్రజలు నమ్మారన్నారని పేర్కొన్నారు.. ఇక, వైసీపీ దిగిపోయే నాటికి 81400 కోట్ల పన్ను ఆదాయం ఉంటే.. మా కంటే తక్కువగా మీ ఆదాయం ఉంది అన్నారు బుగ్గన.. మా కంటే 7.5 శాతం తక్కువగా కూటమి ప్రభుత్వం సంపద సృష్టి ఉంది.. సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ చేసింది కూటమి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.. సామాన్య మానవుడి కోసం మేం పరిపాలన చేశాం.. వైసీపీ అప్పు చేసింది అంటారు.. మా కంటే అప్పు ఎక్కువగా చేసి ఎవరికి పెడుతున్నారు..? అని నిలదీశారు.. జగనన్న ఉన్నపుడు ఉన్న పథకాలు రావడం లేదు.. మీరు ఇస్తామన్న పథకాలు రాలే..? కానీ, సంపద అంతా ఎక్కడికి పోతుంది అంటూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి…
రేపు ఏపీ సీఎం హస్తిన బాట.. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతోఉన్నారు.. హస్తిన వెళ్లనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానితో భేటీకాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న విషయం విదితే.. ఈ పర్యటనలో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ.. ఇక, ప్రధానిని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. కాగా, ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది.. అమరావతిలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం..
పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలి..
పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవానికి హాజరయ్యారు పవన్.. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.. పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం ప్రకటించి సభను ప్రారంభించిన పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలు.. గ్రామాలే స్వయంప్రతిపత్తి కల వ్యవస్ధలుగా ఏర్పడాలి.. పల్లెల అభివృద్ధి చాలా కీలకం.. కక్ష సాధించం ఎవరిమీదా.. పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు.. సీఎం చంద్రబాబు నాయకత్వ మీద నమ్మకంతో డబ్బులు ఇవ్వకపోయినా పనులు చేసిన కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కొంత కొరత ఉంది.. అందువల్లే నిధుల విడుదల ఆలస్యం అయింది అన్నారు.
అలర్ట్.. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్
కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటకులకు తగిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యటక శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల జమ్ము, కశ్మీర్ లోప్రయాణించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాలని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర పర్యటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సంబరాలు.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి (వీడియో)
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌లోకి కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీలోని హైకమిషన్ లోనికి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తిని చూసిన మీడియా సిబ్బంది.. “కేక్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు. కేసు తీసుకెళ్లడానికి కారణం ఏంటి?” అని ప్రశ్నించారు. కానీ, ఆ వ్యక్తి ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేరుగా లోపలికి వెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కేక్‌ను ఎవరు ఆర్డర్ చేసారు? ఈ సమయంలో ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు? అసలు కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రూపం, వేషదారణ చూస్తే అతడు ముస్లిం వర్గానికి చెందిన యువకుడిలా కనిపిస్తున్నాడు.
క్షిపణి పరీక్షకు పాక్ ఆదేశాలు.. భారత్ అప్రమత్తం.. ఏం జరుగుతోంది!
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా క్షిపణి పరీక్షకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 24-25 తేదీల్లో అనగా గురు, శుక్రవారాల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అప్రమత్తం అయింది. పాక్ చర్యలను భారత్ రక్షణ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దౌత్యవేత్తలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అలాగే పాకిస్థాన్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. ఇక కేబినెట్ భేటీలో సింధు జలాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో పాక్ భయపడింది. భయంతో గురు-శుక్రవారాల్లో క్షిపణి పరీక్ష చేయాలని పాక్ ఆదేశించింది. అరేబియా సముద్ర తీరంలో క్షిపణులను పరీక్షించాలని సంకేతాలు ఇచ్చింది. దీంతో భారత్ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ పరిణామాలపై నిఘా పెట్టాయి. ఇక కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తం అయింది. ఉన్నతాధికారులతో హోంశాఖ చర్చలు జరుపుతోంది.
పసిడి ప్రియులకు శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.3,000 తగ్గగా.. ఈరోజు స్వల్పంగా రూ.110 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.2,750, రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఏప్రిల్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,050గా.. 24 క్యారెట్ల ధర రూ.98,240గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి రేటు.. ఈరోజు రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి నేడు రూ.1,00,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,10,900గా నమోదయింది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభినవ్ మనోహర్ భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని బుమ్రా ఫుల్‌టాస్‌గా సంధించాడు. బంతి కాస్త నేరుగా అభినవ్ పొట్ట వద్ద తాకింది. దాంతో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. వెంటనే తేరుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే బుమ్రా మాత్రం కనీసం అభినవ్‌కు ఏమైందా అని కూడా చూడలేదు. బౌలింగ్ వేసేందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!
తాను ముంబై ఇండియన్స్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్‌లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు మద్దతుగా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ 8 మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘నేను 2022లో ముంబై ఇండియన్స్‌లో చేరా. అప్పటి నుంచి మా టీమ్ టైటిల్ గెలవలేదు. అందుకే నేను ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు. ఈ విషయాన్ని రోహిత్, సూర్యా భాయ్‌లకు ఎప్పుడూ చెబుతుంటా. వ్యక్తిగతంగా నాకు గత మూడు సీజన్‌లు బాగానే సాగాయి కానీ.. జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు రాలేదు. ఈ సంవత్సరం అందరం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తాం. హార్దిక్ భాయ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. టీ20 అరంగేట్రంలో హార్దిక్ చేతుల మీదుగానే ఇండియా క్యాప్ అందుకున్నా. చాలా ప్రత్యేకమైన అనుభవం అది. గతేడాది నుంచి హార్దిక్ కెప్టెన్సీలో ఆడుతున్నా. ప్లేయర్లకు ఎప్పుడే మద్దతుగా ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడు’ అని తెలిపాడు.
స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘ఎల్2 ఎంపురాన్’
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. కాగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన, ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక థియేటర్ లో మిస్ అయిన వారు OTT లో చూసి ఎంజాయ్ చేయండి.
‘ది రాజా సాబ్’ పై దర్శకుడు మారుతి సాలిడ్ అప్డేట్..
‘బాహుబలి’ మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రెంజ్.. క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ‘సలార్’ హిట్ తో ఖుషీలో ఉన్నా ఆయన ఫ్యాన్స్.. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా భారీ విజయం సాధించడంతో పండగ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘రాజాసాబ్’, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’, ‘కల్కీ 2898 ఏడీ పార్ట్ – 2’ ఇలా వరుస పెట్టి చూసుకుంటే అరడజను పైనే సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్. అయితే ఇందులో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీ అంటే ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని పూర్తి హార్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు మేకర్స్. దీంతో ఇప్పటికే ప్రేక్షకులో ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ సరసన మాలవిక మోహన, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. గతంలో ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కానీ, ఈ సినిమా పనుల్లో ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై దర్శకుడు మారుతి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్రవాద దాడి ఎఫెక్ట్.. పాక్ యాక్టర్స్ మీద బ్యాన్
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ చిత్రాల్లో పాకిస్తానీ నటీనటులు నటించకుండా పూర్తి నిషేధం విధించింది.. ఈ నేపద్యలో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఒకటైతే, మరొకటి వాణీ కపూర్ నటిస్తున్న హిందీ చిత్రం ‘అబిర్ గులాల్’. ఫౌజీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ, ‘అబిర్ గులాల్’లో హీరోగా నటిస్తున్న ఫవాద్ ఖాన్… ఇద్దరూ పాకిస్థాన్ వారు కావడమే ఈ చర్చకు కారణం. దీంతో వీరిద్దరినీ సినిమాల నుంచి తొలగించాలని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఒక్క పాకిస్థానీ నటుడికి కానీ నటికి కానీ అవకాశం ఇవ్వకూడదని వాదిస్తున్నారు. ఇందులో ఇమాన్వీ కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్ ఒకప్పుడు పాకిస్థాన్ మిలటరీలో ఉన్నత అధికారిగా పని చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇమాన్వీని ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.