సిట్ అడిగిన ప్రశ్నలకు అన్నీ నిజాలే చెప్పా.. వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నివాసం నుండి వెనుదిరిగారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌ను సుబ్బారెడ్డికి చదివి వినిపించినట్లు సమాచారం. విచారణలో భాగంగా, సిట్ అధికారులు సుబ్బారెడ్డి నివాసంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరం అయితే తిరిగి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి సిట్ స్పష్టంగా తెలిపింది. ఇక, సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. కల్తీ నెయ్యి విషయంలో వాస్తవాలు బయటపడాలనే ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాను… 2024 జూన్‌లో నలుగు నెయ్యి ట్యాంకులు సరఫరా అయ్యాయని చెబుతున్నారు.. అందులో జంతువుల కొవ్వు ఉందా? లేక ఇతర ఆయిల్స్ కలపబడ్డాయా? అన్నది తేల్చమని కోర్టు ఆదేశించింది.. కల్తీ నెయ్యితో నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేయడం దారుణం. అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు అని స్పష్టం చేశారు..
రాజధాని రైతులకు న్యాయం చేస్తాం.. ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తాం..
రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తాం… రైతులు ఎవరు ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తామని తెలిపారు మంత్రి నారాయణ.. రాజధాని ప్రాంతంలో సిటీస్ (CITIIS) ప్రాజెక్ట్ కింద నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లను మంత్రి నారాయణ ఈ రోజు ఉదయం పరిశీలించారు. వెంకటపాలెం, ఉద్దండరాయినిపాలెం ప్రాంతాల్లో జరిగిన పర్యటన సందర్భంగా అధికారులు చేపట్టిన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 అంగన్వాడీ కేంద్రాలు పూర్తి చేశాం.. 14 హెల్త్ సెంటర్లు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్ చివరి నాటికి మిగతా నిర్మాణ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.. రాజధాని రైతులకు హామీ ఇచ్చిన మౌలిక సదుపాయాలు వేగంగా చేపడుతున్నాం.. వచ్చే మూడు ఏళ్లలో అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తవుతాయి అన్నారు మంత్రి నారాయణ.. మొత్తం ప్లాట్లు 69,421 అయితే.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల సంఖ్య 61,433గా ఉంది.. రిజిస్ట్రేషన్ చేయాల్సినవి 7,899గా ఉన్నాయన్నారు.. అయితే, గత 21 రోజులలో 240 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాం. ప్రస్తుతం రోజుకు 30–40 ప్లాట్లు రిజిస్టర్ అవుతున్నాయి అని వెల్లడించారు..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు..
గుడ్డు.. వెరీ గుడ్ ఫుడ్‌గా చెబుతారు.. ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు రోజుకోటి తింటే చాలు అని సూచిస్తున్నారు.. ఇక, డైట్లు, ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్లు ఎక్కువ మోతాదులో గుడ్లు తీసుకుంటారు.. అయితే, కోడి గుడ్డు ధరలు కాస్తా కొండెక్కి కూర్చున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు 8 రూపాయలు దాటి ధర పలుకుతోంది. నార్త్ ఇండియాకు పెరిగిన ఎగుమతులు, మోoథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టం ధరలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు, కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్ వెజ్ లవర్స్ కు ఎగ్ స్ట్రోక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్లు ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్ ఒక్కో గుడ్డు డిమాండ్ ను బట్టి 8 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వెజిటబుల్స్ ధరలతో కలవర పడుతుంటే గుడ్డు కూడా గుభేల్ మనిపించడం సామాన్యుడికి భారంగా మారింది. హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో 673కు చేరింది. దీనికి వివిధ కారణాలను మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు ఊపందుకున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే కొద్ది రోజులు గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతు బజార్లలో విక్రయాలపై దృష్టి సారించారు. విశాఖలో 6 రూపాయల 60 పైసలు దగ్గర అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎగ్, వెజిటబుల్స్ కంటే చికెన్ ధరలే బెటర్ గా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. విశాఖలో హోల్ సేల్ మార్కెట్‌లో 100 గుడ్లు 673 రూపాయలుగా పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌లో అది ఒకటి రూ.7 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారట.. ఇక, చిత్తూరు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.635గా.. హైదరాబాద్‌లోనూ 100 గుడ్ల ధర రూ.635గా ఉన్నట్టుగా చెబుతున్నారు.. అయితే, రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి ఒక్క గుడ్డుకు రూ.6.50 నుంచి రూ.7 వరకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు..
రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ అర్చకులు.. ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఇక, శ్రీవారిని దర్శించుకన్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు అర్చకులు వేదాశీర్వచనాలిచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాంభగీచ సర్కిల్ వద్ద ప్రోటోకాల్ పక్కన పెట్టేసి భక్తులను పలకరించారు రాష్ట్రపతి ముర్ము.. కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు పక్కన నిలిచిఉన్న భక్తులను ప్రేమగా పలకరించిన రాష్ట్రపతి.. భక్తులతో కరచాలనం చేసి చాక్లెట్స్ పంపిణీ చేశారు.. ఇక, ఊహించని ఘటనతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. అయితే, రాష్ట్రపతి అనూహ్యంగా కాన్వాయ్ దిగడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటన భాగంగా.. గురువారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత తిరుమల చేరుకుని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు..
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు.. ప్రతీ వాహనం తనిఖీ.. ఐడీ కార్డ్స్ ఉంటేనే ఎంట్రీ..!
రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత కచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీస్ విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు.. ముఖ్యంగా, మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని సమాచారం రావడం కారణంగా చేపట్టారు.. కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.. మరోవైపు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే, విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో.. అప్రమత్తమైన పోలీసులు సచివాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు..
స్కూల్‌లో స్లాబ్ పెచ్చు ఊడిపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి.. హోంమంత్రి దిగ్భ్రాంతి
ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది.. స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళా ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పెచ్చు ఊడిపడడంతో మహిళా టీచర్ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో మృతిచెందింది ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్ (47) గా గుర్తించారు.. స్కూల్ లో ప్రేయర్ అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం పక్కన టీచర్ నిలబడి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.. స్లాబ్ పెచ్చు ఊడిపడిన ఘటనలో టీచర్ జోష్నా భాయ్ తలకు బలమైన గాయం కాగా… రాజానగరం జెడ్పీ హైస్కూల్ నుంచి తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.. మృతురాలిది కాకినాడ జిల్లా తునిగా చెబుతున్నారు.. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. స్లాబ్ కూలి ఇంగ్లీష్ టీచర్ మృతి చెందడం బాధాకరం అన్నారు.. రాజానగరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన పట్ల అధికారులతో మాట్లాడిన హోంమంత్రి అనిత.. టీచర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..
బెంగళూరులో ఏటీఎం క్యాష్ వెహికల్ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీకి లింక్..!
బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం నుంచి పట్టపగలే రూ.7.11 కోట్లు దోపిడీ చేయడం తీవ్ర కలకలం రేపింది.. అయితే, బెంగళూరు దోపిడీ కేసుతో ఆంధ్రప్రదేశ్‌కు లింక్‌లు ఉన్నాయంటున్నారు పోలీసులు.. దొంగలు చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పారిపోయారు.. ఇన్నోవా వాహనం (నెంబర్: UP 14 BX 2500) లో నగదును తరలించిన దుండగులు, ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చివద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలేసిన తర్వాత నగదును మరో వాహనంలో మార్చుకుని పరారైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక, సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం, ఆ వాహనం గుడిపాల మండల కేంద్రం మీదుగా చిత్తపార గ్రామానికి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలు రిజర్వ్ బ్యాంకు లేదా ఆదాయ పన్ను శాఖ అధికారులమని నమ్మించి, ఏటీఎంలకు నగదు తీసుకెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ పేరుతో సిబ్బందిని కిందకు దింపి, కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న వాహనంలో నగదును మార్చి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనంలో సమీప గ్రామాల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానంతో, కర్ణాటక పోలీసులు అర్ధరాత్రి చిత్తూరు పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ భారీ నగదు మరో వాహనంలో ఎక్కడికి తరలించబడిందన్న దానిపై కర్ణాటక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ప్రకృతి ప్రేమికులకు.. పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య.. కృష్ణా నదిలో ప్రయాణించాలని ఎంత మంది కోరుకోరు. అయితే వారి కోసం.. నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించనుంది. అయితే ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి.. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రయాణికులు, భక్తులు కోసం.. ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని.. పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టూ శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం… పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా.. పిల్లలకు 2,600 రూపాయలు ధర ఫిక్స్ చేశారు. అయితే.. కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు 2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా నిర్ణయించింది టూరిజం డిపార్ట్మెంట్..
బెంగాల్‌లో తక్షణమే ‘సర్’ నిలిపేయండి.. ఈసీకి మమత లేఖ
కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టింది. మొట్టమొదటిగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రత్యేక సర్వేను ఈసీ చేపట్టింది. మొదటి నుంచి విపక్షాలకు చెందిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే సర్వే కారణంగా ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్న దుర్ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో తక్షణమే ‘SIR’ నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఒక ప్రణాళిక లేకుండా ఈ సర్వే చేపడుతున్నారని ఆరోపించారు. అధిక పని భారంతో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా, బలవంతంగా, ప్రమాదకరంగా జరుగుతున్న ఈ సర్వే వెంటనే నిలిపివేసేలా తక్షణ చర్య తీసుకోవాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను మమతా కోరారు. మూడు పేజీల లేఖలో అనేక విషయాలను మమత ప్రస్తావించారు.
నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య
తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్‌ది చివరి పని దినం. దీంతో ఒకరోజు ముందుగానే గురువారం సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ (SCAORA) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవాయ్ ప్రసంగించారు. తాను బౌద్ధమతాన్ని తన విశ్వాసంగా ఆచరిస్తున్నట్లు తెలిపారు. కానీ హిందూ మతం, సిక్కు, ఇస్లాం సహా ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పారు. నిజమైన లౌకిక వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఇదంతా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. నిజమైన లైకికుడు డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తిగా ఉన్నానంటే.. దీనికంతటికి కారణం అంబేద్కర్ చలువే అన్నారు.
జొమాటో సంచలన నిర్ణయం.. ఫోన్ నంబర్లతో సహా కస్టమర్ల డేటా షేరింగ్‌కి గ్రీన్ సిగ్నల్..
ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద మార్పులు మొదలయ్యాయి. ఆన్లైన్ ఆర్డర్లు చేసే కస్టమర్లు, ఆ ఆర్డర్‌లు తయారు చేసే రెస్టారెంట్లు, వాటిని డెలివర్ చేసే యాప్‌లు ఇప్పటి వరకు ఒక్కోటి ఒక్కో విధంగా పనిచేస్తూ వచ్చాయి. కానీ ఇటీవలి నిర్ణయాలతో ఈ వ్యవస్థ మొత్తం కొత్త దిశలోకి వెళ్తోంది. ముఖ్యంగా జొమాటో కస్టమర్ల ఫోన్ నంబర్లు రెస్టారెంట్లతో పంచుకోవాలని ఒప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. రెస్టారెంట్లు చాలా ఏళ్లుగా తమకు కస్టమర్ల సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఎవరు తరచూ తమ దగ్గర ఆర్డర్ చేస్తున్నారో, వారి అభిరుచులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ డేటా అవసరమని రెస్టారెంట్ల యజమానులు అంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కస్టమర్‌తో నేరుగా మాట్లాడటం సులువు అవుతుందని, మార్కెటింగ్ కూడా లక్ష్యంగా చేసుకుని చేయగలమని వాదిస్తున్నారు. NRAI కూడా పదేళ్లుగా ఇదే కోరుతూ ఫుడ్ డెలివరీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది.
కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. మొదటి టెస్టులో కుప్పకూలిన ఇంగ్లాండ్..!
పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ విలవిలలాడింది. ఈ దెబ్బకు కేవలం 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ చేత్తులేత్తిసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే వికెట్ తీయడం నుండి ఇన్నింగ్స్ చివరివరకు తన పదుననిన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే స్టార్క్ తన వికెట్ల హంటింగ్ ప్రారంభించాడు. జాక్ క్రాలీని పరుగుల ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపి మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత బెన్ డకెట్ (21) వేగంగా రన్స్ చేసినప్పటికీ.. అతను కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆపై వరుసగా జో రూట్ (0), ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (6), గస్ అట్కిన్సన్ (1), మార్క్ వుడ్ (0) వికెట్లను పడగొట్టి స్టార్క్ ఇంగ్లాండ్‌కి ఊపిరి కూడా పీల్చనీయకుండా చేశాడు. మొత్తం మీద ఆయన 12.5 ఓవర్లలలో 4 మెయిడెన్స్, 58 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.
రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. ‘రెబల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్‌గా ఉండగా.. వింటేజ్ లుక్‌లో డార్లింగ్ కేక పెట్టించేలా, అదిరిపోయే స్టెప్ వేస్తు కనిపిస్తున్నాడు. దీంతో.. రెబల్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు. ఇటీవల తమన్ వరుస హిట్స్ కొడుతుండడంతో రాజాసాబ్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇక్కడి నుంచి రాజాసాబ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పది రోజులకొక సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెండో పాట రిలీజ్ కానుండగా.. థర్డ్, ఫోర్త్ సింగిల్ కూడా అదే నెలలో రిలీజ్ చేయనున్నారు. అలాగే.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఇప్పటి నుంచి రాజాసాబ్ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి.
చైతన్య, అఖిల్ మధ్య తేడా అదే అంటున్న అక్కినేని అమల..
అక్కినేని కుటుంబం గురించి మాట్లాడితే, చైతన్య–అఖిల్ ఇద్దరి స్వభావం, ఆలోచనల్లో ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. కానీ ఈ తేడాను మొదటిసారి ఓపెన్‌గా వివరిస్తూ అమల ఆక్కినేని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్ టీవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల చై.. అఖిల్ గురించి చాలా విషయాలు పంచుకుంది. అమల మాట్లాడుతూ.. చైతన్య చిన్నప్పటి నుంచే చాలా కామ్, డిసిప్లిన్‌డ్ వ్యక్తి. చిన్ననాటి చెన్నైలో గడిపి, కాలేజ్ టైంలో హైదరాబాద్‌కి రావడంతో జీవితం మీద క్లారిటీ చాలా చిన్న వయస్సులోనే వచ్చింది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ తనకు బాగా తెలుసు. ఎవరితోనైనా అమర్యాదగా మాట్లాడడు, కోపం తెచ్చుకునే స్వభావం అస్సలు లేదు. ఒక మాట మాట్లాడితే మర్యాదపూర్వకంగానే ఉంటుంది. ముఖ్యంగా తండ్రి నాగార్జున మాటకు చాలా విలువ ఇస్తాడు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటాడు. తనకు సంబంధించిన విషయంలో స్పష్టమైన స్టాండ్ ఉంటుంది. అఖిల్ విషయానికి వస్తే అఖిల్ అలా కాదు. నేను చెప్పిన ప్రతిదానికి వాదిస్తాడు. యంగ్ ఏజ్ కాబటి తర్జనభర్జన పడతాడు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటాడు.. తర్వాత గోడ మీద పిల్లిలా ఇంకో గోడకు దూకినట్లు మళ్లీ మార్చేస్తాడు. ఏ నిర్ణయం అయినా స్ట్రాంగ్‌గా నిలబెట్టుకోవడం ఇంకా నేర్చుకుంటున్న దశలోనే ఉన్నాడు” అని అమల చెప్పారు. జీవితంలో మంచి, చెడు రెండూ వస్తుంటాయి కానీ వాటిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటే చాలు అని ఆమె చెప్పిన విధానం చాలా రియల్‌గా అనిపించింది.