వైసీపీ వర్సెస్ జనసేన..! నిడదవోలులో ఉత్కంఠ పరిస్థితి..
నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైకాపా కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. పురపాలక అభివృద్ధి పనుల్లో జాప్యం, పారదర్శకత లోపం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. పురపాలక చట్టంలోని నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చించి ఓటు వేయాలని వైసీపీ కౌన్సిలర్లు అభ్యర్ధన పత్రాన్ని అధికారులకు అందజేశారు. 2021 స్థానిక సంస్థలు ఎన్నికల్లో నిడదవోలు మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డులకుగాను 27 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ సహా ఏడుగురు. కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే.. వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒకరు టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం పెడితే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది. దీనితో మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విచారణకు డుమ్మా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన కాకాణి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఈ రోజు కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు.. అయితే, పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చారట కాకాణి.. రేపు రాత్రికి నెల్లూరు చేరుకోనున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గురువారం నుంచి తాను అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం చేరవేశారట.. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని తెలిపారట.. దీంతో మరోసారి కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.. కాగా, ఆదివారం రోజు నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. సోమవారం రోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.. అయితే, అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత నోటీసులను కుటుంబ సభ్యులకు అందజేసిన విషయం విదితమే..
ఏప్రిల్ 5 నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమలలోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలో జగదభి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ప్రకటించారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాల ముందు, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ కార్యక్రమం ఉంటందన్నారు. ఈ కార్యక్రమాలను ఆద్యంతం భక్తి పరావశ్యంతో నిర్వహించబోతున్నామన్నారు. ఈ క్రతువు జరిగే సమయంలో గర్భాలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేస్తామన్నారు. ఉదయం 11.20 గంటల నుండి రామయ్య దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తామని ఆ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. భక్తులు కూడా ఒకేసారి దర్శించుకోవాలనే ఆలోచనను పెట్టుకోవద్దని.. ప్రతిరోజూ దర్శనాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి టైమ్ రూల్స్ ను తెలుసుకుని రావాలన్నారు.
హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు!
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్‌పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి షాపింగ్ కోసం బయలుదేరింది. క్యాబ్‌లో గంటన్నర పాటు తిరిగిన తర్వాత, పహాడీ షరీఫ్ ప్రాంతానికి చేరుకోగానే క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడిని, పిల్లలను కిందికి దించేశాడు. అయితే, యువతిని మాత్రం కారులో ముందుకు తీసుకెళ్లాడు. కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత, నిర్మానుష్య ప్రదేశంలో ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి ఆమెను తీసుకువచ్చి, ఆమె స్నేహితుడి వద్ద వదిలేసి పరారయ్యాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ, డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటన నగరంలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు కరాటే బ్లాక్ బెల్టు
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపించేశారు. సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి కరాటే బెల్టు వస్తే పర్లేదు గానీ.. మహేశ్ గౌడ్ కు ఈ వయసులో కూడా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన శ్రేణులు అంటున్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిరోడ్డులోని వైడబ్ల్యూసీఏలో సోమవారం కరాటే పోటీలు నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మహేశ్ గౌడ్ కూడా పోటీల్లో పాల్గొన్నారు. ఏకంగా మూడు గంటల పాటు నిర్వహించిన టెస్టుల్లో ఆయన విజయం సాధించారు. దీంతో నిర్వాహకులు ఆయనకు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే బ్లాక్‌బెల్ట్ డాన్ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో అందరూ కరాటే నేర్చుకోవాలన్నారు. మన ఆత్మ రక్షణలో కరాటే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో పిల్లలు మొబలైకు అడిక్ట్ అవుతున్నారని.. ఇలాంటి వాటిల్లో పాల్గొంటే వారి హెల్త్ డెవలప్ అవుతుందన్నారు.
నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌లో కొత్త రూల్స్.. తెలియక తెలుగు టూరిస్టులు ఇబ్బందులు
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్ టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు పరీక్షల కాలం ముగియతుండడం.. ఇంకోవైపు సమ్మర్ కావడంతో చల్లదనం కోసం ఊటీకి వెళ్తున్నారు. అయితే అక్కడ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలియక వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటక వాహనాలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ అధికారులు ఆంక్షలు విధించారు. మంగళవారం నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక సహా స్థానిక పర్యాటకుల వాహనాలు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. అయితే ఈ-పాస్ ఆంక్షలు తెలియక పోవడంతో వేలాది వాహనాలు వేచి ఉన్నాయి. రోజుకు 4000 వాహనాలకు మాత్రమే ఊటీ, కోడైకెనాల్‌లోకి అనుమతి ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే 6 వేల పర్యాటక వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. కొత్తగా పెట్టిన ఈ-పాస్ రూల్స్ తెలియక తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఊహించని స్థాయిలో పర్యాటకులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని టూరిస్టులు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో జిల్లా అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు
పంజాబ్‌కు చెందిన పాస్టర్, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్‌కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫైనల్ చేసింది. బాజిందర్ సింగ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు (ఏప్రిల్ 1న) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మొహలీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే, బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జిరాక్‌పుర్‌కు చెందిన ఓ మహిళ 2018లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. విదేశాలకు తీసుకెళ్తానని ఆశ పెట్టిన అతడు తనను ఇంటికి ఆహ్వానించాడని పేర్కొనింది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడని ఆరోపణలు చేసింది. సదరు పాస్టర్ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చింది.
ముద్దుకు రూ.50 వేలు.. లక్షలు కాజేసిన ఖిలాడీ టీచర్
ఒక్క ముద్దు పెడితే రూ.50వేలు. ఇది కర్ణాటకలోని ఓ ఖిలాడీ టీచర్ వ్యవహారం. ముద్దులు పెట్టి లక్షలు కాజేసింది. బెంగుళూరు లోని మహాలక్ష్మీ లే అవుట్ లో శ్రీదేవి అనే టీచర్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూల్ కు రాకేష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. పిల్లల కోసం తరచూ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో శ్రీదేవితో పరిచయం బాగా పెరిగింది. శ్రీదేవి కూడా అతన్ని తన బుట్టలో వేసుకుంది. తనకు రూ.4లక్షలు కావాలని రాకేష్ నుంచి తీసుకుంది. 2024 మార్చి నెలలోనే ఇచ్చేస్తానని నమ్మించింది. కానీ గడువు దాటిపోయినా ఇవ్వలేదు.దీంతో రాకేష్ కు అనుమానం వచ్చి నిలదీశాడు. ఈ క్రమంలోనే శ్రీదేవి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఇద్దరూ కలిసి బయట తిరగడాలు, ఫోన్లో మాట్లాడుకోవడాలు జరిగాయి. డోస్ మరింత పెంచేసి ముద్దులు, హగ్గుల దాకా వెళ్లిపోయారు. ఆ టైమ్ లో రాకేష్ మరోసారి తన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఇదే సరైన టైమ్ నుకుని శ్రీదేవి ప్లేటు తిప్పేసింది. తనను చాలా సార్లు ముద్దు పెట్టుకున్నావని.. ముద్దుకు రూ.50వేల చొప్పున నువ్వే రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే అందరికీ విషయం చెప్తానంటూ బెదిరించింది.
అనంత్ అంబానీ 141 కి.మీ పాదయాత్ర.. దేనికోసమంటే..!
అనంత్ అంబానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. గతేడాదే అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగింది. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులంతా ఈ మ్యారేజ్‌కు హాజరయ్యారు. అయితే తాజాగా అనంత్ అంబానీ ఆధ్యాత్మిక అవతారం ఎత్తారు. ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. తాజాగా ద్వారకాదీష్‌లో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు పాదయాత్ర చేపట్టారు. బిగ్గరగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకాకు 141 కిలోమీటర్లు. నిత్యం సెక్యూరిటీ మధ్య 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే సమీప గ్రామస్తులు కూడా ఈ పాద్రయాత్రలో పాల్గోవడం విశేషం.
నాని ‘హిట్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంత్ త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుండి, ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డెట్ ఎంతో ఆకట్టుకోగా, టీజర్ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. నాని ని చాలా వైల్డ్ గా చూపించారు. ఒక్కో సీన్ వణుకు పుట్టించాయి. సార్ మీకు ప్రాబ్లమ్ లేదంటే ఒక పేరు చెబుతా.. అర్జున్ సర్కార్.. అంటూ సాగే డైలాగ్స్‌లో షురూ అయింది టీజర్. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా టీజర్ ను బాగా కట్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పవర్ ఫుల్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.