రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం..
రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్.. అయినా వదలని సీనిమర్లు.. వెంటపడి మరీ దాడి చేసేశారని జూనియర్లు వాపోతున్నారు.. గాయపడిన సునీల్ ను కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఫస్టియర్ స్టూడెంట్ సునీల్ చికిత్స పొందుతున్నాడు..
కేంద్రం గ్రీన్ సిగ్నల్..!? మళ్లీ భయపెడుతోన్న యురేనియం తవ్వకాలు..
కర్నూలు జిల్లాను మరోసారి యురేనియం భయం పట్టుకుంది. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా.. స్థానికుల ఆందోళనతో పనులు నిలిపేశారు. తాజాగా, కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం లభిస్తే.. తవ్వకాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. యురేనియం తవ్వకాల ప్రతిపాదనలపై గతంలోనే కప్పట్రాళ్ల వాసుల వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాజాగా మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.99 లిక్కర్ కోసం ఎదురుచూపులు..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పేసి.. మళ్లీ ప్రైవేట్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు.. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వచ్చింది.. అయితే, తమ ప్రభుత్వంలో రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే కాగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం అయినా.. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు 99 రూపాయల క్వార్టర్ బాటిల్.. ఏపీ ప్రభుత్వం క్వార్టర్ రూ.99కి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో డిపోలకు చేరాయి షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ.. కానీ, డిపోల నుంచి ఇంకా అత్యధిక షాపులకు రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరలేదు.. కొన్నింటికి మాత్రమే రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరాయి.. తక్కువ ధరకే దొరికే ఈ క్వార్టర్ బాటిల్స్‌తో పాటు.. గత ప్రభుత్వంలో మాయమైన వివిధ బ్రాండ్స్ లిక్కర్ కూడా అందుబాటులోకి వచ్చింది.. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ బాటిల్ ప్రారంభ ధర 120 రూపాయలుగా ఉండా.. కూటమి ప్రభుత్వంలో రాడికో, ప్రేడ్ డిస్టలరీస్ నుంచి 99 రూపాయల మద్యం సరఫరా చేస్తున్నారు.. గురువారం 10 వేల కేసుల 99 రూపాయల క్వార్టర్ బాటిల్ స్టాక్ డిపోలకు సరఫరా చేసినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.. ఇక, సోమవారం నాటికి 25 వేల కేసుల స్టాకు పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.. అంటే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లో రూ.99 క్వార్టర్ బాటిళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్‌లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.. వారితో మాట్లాడిన సీఎం.. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.. ఈ రోజు టీడీఎల్పీ సమావేశం జరుగుతోన్న విషయం విదితమే.. కాగా, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు.. ఏపీకి వెళ్లాలన్న ఆదేశాల నేపథ్యంలో.. ఎట్టకేలకు గురువారం రోజు ఏపీలో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. నిన్న ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు. అయితే, తెలంగాణలోనే కొనసాగేందుకుగాను డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలపై వీరు క్యాట్‌ను.. తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఎక్కడా వారికి ఊరట లభించలేదు.. దీంతో.. ఐదుగురు ఐఏఎస్‌లు నిన్న ఏపీలో రిపోర్ట్ చేశారు. వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి ఉదయమే రిపోర్ట్ చేయగా.. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న మరో ఐఏఎస్ ఎం.ప్రశాంతి.. బుధవారం సాయంత్రమే రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. ఇక, త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు.. ఈ ఏడాది ఐదోసారి..
కృష్ణా నదిలో మరోసారి వరద ఉధృతి పెరిగింది.. ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది.. దీంతో.. శ్రీశైలం జలాశయం గేటును ఎత్తారు అధికారులు.. ఈ సంవత్సరంలో ఇది ఐదోవసారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తడం విశేషంగా చెప్పుకోవాలి.. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 93,270 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతుండగా.. 1 గేటు 10 అడుగుల మేర ఎత్తి 95,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. ఇక, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 212.9198 టీఎంసీలు నీరు నిల్వ ఉంచారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఇక, జూరాలకు వరద ఉదృతి కొనసాగుతోంది.. దీంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 69,000 క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,503 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044.849 ఫీట్లుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 9.562 టీఎంసీలుగా ఉంది.. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఎత్తి పోతల పథకాలకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు..
రేపు గన్ మెన్లు లేకుండా రా నేనే కారు నడుపుతా.. సీఎంకు హరీష్ రావు సవాల్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మూసి బాధితుల దగ్గరకు, మల్లన్న సాగర్ కు పోదామన్నారు. రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధంగా ఉంటాను.. గన్మెన్ లు లేకుండా పోదాం అని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నేను కార్ నడుపుకుంటూ వస్తాను.. నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామని హరీష్ రావు సవాల్ విసిరారు. గ్రాఫిక్ హంగులతో సీఎం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిన్న ప్రెస్ మీట్ లో చూపించారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. మూసీ సుందరీకరణను బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభం చేసిందన్నారు. దీని పేరుతో పేదల ఇండ్లు కూలగొడతాం అంటున్నారు దానికి మేము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్ టైం స్క్వేర్ ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్ ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్ లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టారని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ప్రజల్లో వివక్షతా భావం పెరుగుతుంది..
ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక.. అందరూ పర్యటించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క కోరారు. గ్రామాభివృద్ధికి సీఎస్‌ఆర్ ఫండ్స్ సేకరించాలని కోరారు. ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలని తెలిపారు. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. మీరంతా గ్రామాలకు తరలండి…అటవీ గ్రామీణ పరిస్థితులను చూడాలని కోరారు. విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్ళుగా మిమ్మల్ని ఆరాధిస్తారన్నారు. నోరులేని నిస్సహాయుకులకు వద్దకు వెళ్లండి.. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడు మీరే మార్పుకు నాంది పలికిన వారవుతారన్నారు. మనసుంటే మార్గం ఉంటుందన్నారు. చిత్తశుద్ధి, మంచి ఆలోచనలు ఉంటే కఠిన పరిస్థితులను అధిగమించగలుగుతామని అన్నారు. అటవీ శాఖ అభ్యంతరం పెడితే..కంటైనర్ ఆస్పత్రి, కంటైనర్ స్కూల్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక మంచి పని చేస్తే జీవితంలో గొప్ప ఆనందం అనుభూతి మిగులుతుందన్నారు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న సమయాన్ని సమాజ మార్పు కోసం వెచ్చించాలన్నారు. చుట్టూ ఉన్న పల్లెను అభివృద్ధి చేస్తే ఆనందమే వేరన్నారు. ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక. అందరూ పర్యటించాలన్నారు. ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలని తెలిపారు. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. మారుమల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారన్నారు.
సద్గురుకు ఉపశమనం.. అక్రమ నిర్బంధం కేసులో విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు
సద్గురు జగ్గీ వాసుదేవ్ యొక్క ఇషా ఫౌండేషన్ పై చట్టవిరుద్ధ నిర్బంధంలో సుప్రీంకోర్టు శుక్రవారం విచారణను నిలిపివేసింది. అంతకుముందు అక్టోబర్ 3న, ఫౌండేషన్‌పై పోలీసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. ఫౌండేషన్‌పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెలు లత, గీతలను ఆశ్రమంలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. దీనిపై సెప్టెంబర్ 30న ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న దాదాపు 150 మంది పోలీసులు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాన్ని సద్గురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు తక్షణ ఉపశమనం కలిగించి కేసు విచారణకు అక్టోబర్ 18 తేదీని ఇచ్చింది. ఈ కేసు విషయంలో “ఈషా ఫౌండేషన్లో తమ స్వచ్ఛంద బసను స్పష్టంగా వ్యక్తం చేసిన ఇద్దరు వ్యక్తులతో తాము మాట్లాడామని, అది నిర్ధారించబడిన తర్వాత ఈ హేబియస్ కార్పస్ కేసులో తదుపరి దిశ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు.
డేరా బాబా కేసులో ట్విస్ట్.. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు క్లియరెన్స్
2015 నాటి మూడు ఇంటర్‌లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్‌పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టు విధించిన విచారణపై స్టేను ఈరోజు సుప్రీంకోర్టు ఎత్తివేసింది. రామ్ రహీమ్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. రామ్ రహీమ్ ఇప్పటికే అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబ్ లోని ఫరీద్‌కోట్ జిల్లాలోని బార్‌గారీ ప్రాంతంలో జరిగిన ప్రశ్నార్థకమైన హత్యాకాండ సంఘటనలు, 2015లో గౌరవనీయమైన గురు గ్రంథ్ సాహిబ్ అదృశ్యం, ఇంకా అపవిత్రతకు సంబంధించినవి సిక్కు సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ – హర్యానా హైకోర్టు మూడు కేసుల్లో రామ్ రహీమ్‌పై విచారణను నిలిపివేసింది. మార్చిలో వెలువరించిన ఈ తీర్పును పంజాబ్ ప్రభుత్వం సవాలు చేసింది. దాంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందుంచింది.
రష్యా తరఫున యుద్ధంలో 10 వేల మంది నార్త్ కొరియన్ సైనికులు
సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు నాటో ప్రధాన కార్యాలయంలో విలేకరులతో జెలెన్‌స్కీ చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉత్తర కొరియాకు చెందిన వ్యూహాత్మక సైనిక సిబ్బంది, అధికారులను రష్యాకు పంపినట్లు మా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. నార్త్ కొరియాకు చెందిన 10 వేల మంది సైన్యం వారి స్వదేశంలో శిక్షణ తీసుకుంటున్నారు. మా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మూడో దేశం పాల్గొనడం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక, రష్యాతో యుద్ధం ముగించేందుకు తన విజయ ప్రణాళికను చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ నాయకులు, నాటో రక్షణ మంత్రులతో ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రస్సెల్స్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన విజయ ప్రణాళికను అమలు చేస్తే వచ్చే ఏడాదిలోగా ఈ యుద్ధం ముగిసిపోతుందన్నారు. అలాగే, నాటో సభ్య దేశాల్లో సభ్యత్వానికి ఉక్రెయిన్‌కు పూర్తి అర్హత ఉందన్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ తొలుత బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో కివీస్ పేసర్లు రెచ్చిపోయారు. దాంతో భారత్ స్టార్ బ్యాటర్లు అందరూ వరుసగా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 81 ఓవర్లలో 7 వికెట్లకు 345 స్కోర్ చేసింది. ప్రస్తుతం 299 ఆధిక్యం సాధించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేస్తేనే.. ఓటమి నుంచి బయటపడొచ్చు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 450కి పైగా పరుగులు చేస్తుందని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. న్యూజిలాండ్ బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450కి పైగా పరుగులు చేస్తేనే.. ఆశలు ఉంటాయి. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను భారత్ చక్కగా ఎదుర్కొంది. 2001లో ఆస్ట్రేలియాపైనే విజయం సాధించింది. ఫాలోఆన్‌లో ద్రవిడ్, లక్ష్మణ్ పోరాటం అనంతరం బౌలర్లు చెలరేగిపోయి జట్టును గెలిపించారు. తాజాగా బంగ్లాపై టెస్టులోనూ అద్భుత విజయం సాధించింది’ అని ఆకాశ్ గుర్తుచేశాడు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. “లవ్ రెడ్డి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను” అని మాట ఇచ్చాడు. నేడు ఆ మాటను నిజం చేస్తూ నైజాం లో GPR ముల్టీప్లెక్స్ లో నేడు సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుక్కున్నా యంగ్ హీరోను నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.
జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. తాజాగా ఈ కేసు వ్యవహారంపై జానీ మాస్టర్ కి మద్దతుగా ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించారు. ఆనీ మాస్టర్ మాట్లాడుతూ ” జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను, వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నాను. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చా.జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరం.నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.కనీసం హోల్డ్ లో పెట్టాల్సింది జానీ మాస్టర్ దగ్గర నేను రెండేళ్లు వర్క్ చేశాను. ఇతర దేశాలు కూడా వెళ్ళాము.ఎప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి. అప్పట్లో జానీ మాస్టర్ మంచివాడు.. గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన ఆ అమ్మాయి ఇప్పడు అదే జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరికైనా సమస్య అని తెలియగానే సహాయం చేసే వ్యక్తుల్లో జానీ ముందుంటారు. ఈరోజు అమ్మాయి విషయం అనే ఒక్క కారణం తో.. ఎవరూ స్పందించడం లేదు. నేను ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు..అసలు వేధింపులు అనేవి ఉండవు. కొరియోగ్రఫీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వేధింపుల విషయాన్ని ఉపేక్షించదు” అని అన్నారు.