హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్..
ఖైరతాబాద్‌లోని గణనాథుడు ట్యాంక్‌బండ్ వద్ద హుస్సార్ సాగర్‌లోని గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన క్రేన్స్ వద్ద పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వక్ఫ్ బోర్డు బిల్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
వక్ఫ్ బోర్డు బిల్ తెచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ ఆస్తులు కబ్జా కాకుండా ఉండేందుకు ఈ బిల్ తీసుకువచ్చామని అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు చేస్తున్న పనికి మూడింతలు పనిచేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తుందన్నారు. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగే విధంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట, గిట్టుబాటు ధర అన్నారు. వరల్డ్ మానుఫాక్చరింగ్ హబ్ గా భారత్ అవతరించాలనే లక్ష్యం తో స్మార్ట్ సిటీల ఏర్పాటు నిర్ణయం అన్నారు. అందులో జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్ష 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీ దే..
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీ దే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ వేడుకలకు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలన్నీ తెలంగాణ విమోచన చరిత్రను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేసిందన్నారు. గత పాలకులు చరిత్రను వక్రీకరించకపోయి ఉంటే పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం మాదిరిగానే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ పండుగ చేసుకునేటోళ్లని తెలిపారు. 1947 పంద్రాగస్టున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాట వాస్తవాల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’ అన్నారు. ఈ సినిమా తీసిన గూడూరు నారాయణరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భావితరాలకు నిజానిజాలు తెలియజేసేందుకే కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన పీఎం మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘స్వచ్ఛత సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు..
స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని కెపిహెచ్బి కాలనీ లోని పార్క్ లో చెత్తను శుభ్రపరిచారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రమగా ఉంటే మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 10 సంవత్సరాలు క్రితం మోడీ గారు ప్రాంభించారు. శ్రీకాకుళం స్వచ్ఛభారత్ లో టాప్ 10 లో ఉంచాలని లక్ష్యం పెట్టుకోవాలి., అంత పెద్ద వరద వచ్చిన తరువాత 10 రోజుల్లో నార్మల్ స్థితికి తీసుకురావడం కేవలం నారా చంద్రబాబు వలనే అవుతుంది అని నిరూపించారని ఆయన అన్నారు. విజయవాడ వరదల్లో సామాన్యుడులా భరోసా ఇస్తూ తిరిగారు. ప్రభుత్వం ఇంత కష్టపడి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రజలకు బయబ్రాంతులకు గురిచేసి రాజకీయం చేస్తున్నాయి. ఎన్ని రాజకీయాలు చేసిన వాళ్ళ పప్పులు ఎక్కడ ఉడకడం లేదు. కాబట్టి సహించుకోలేకపోతున్నారు. ఎలక్షన్ రిజల్ట్ లో బుద్ది చెప్పినా.. వాళ్ళ స్టైల్ మార్చుకోకుండా ఇలా చేస్తే.. ఉన్న 11 ఎమ్మెల్యే లు ఉంటాయో లేదో డౌటే అని వ్యాఖ్యానించారు.
అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు: విజయసాయి రెడ్డి
తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేసారు. ఇందులో భాగంగా అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు అంటూ తెలిపారు. అలాగే ” ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు..! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డు పై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది..! అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం. అని ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ..
వరద బాధితులకు 50వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 33 కార్పొరేషన్ లో ముంపుకు గురయ్యారని., బుడమేరు వరద ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని.. మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పెద్ద అవస్థలు వర్ణనాతీమని., మా పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి కోటి ప్రకటనతో పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. నిత్యవసర సరుకులు ఇవ్వాలని గతంలో నిర్ణయించామని., 50వేల కుటుంబాలకు 7సరుకులతో పంపిణీ చేస్తున్నామని., చంద్రబాబు చెప్పిందే చెపుతాడు.. అబద్దన్నీ పదే పదే చెప్పి నిజం అని నమ్మిస్తాడు.. 2009లో వరదలు వొచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం. అధికారులు, పార్టీ నాయకులకు ముందే వరద వస్తుందని తెలుసని చెప్పారు. వరదలు అర్ధరాత్రి రావు.. అప్పటికప్పుడు రావు.. వరదలపై మోనేటిరింగ్ లేదు.. ప్రతిదీ గత ప్రభుత్వం అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొంది ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి మర్లేనా
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు లేచి నిలబడి ఆమోదం తెలిపారు. కేజ్రీవాల్ జైలు శిక్ష తర్వాత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మంత్రిగా అవతరించిన అతిషి, కల్కాజీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్టు చేసిన తర్వాత అతిషి వార్తల్లో నిలిచారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేసిన తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ 9 మార్చి 2023న అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను క్యాబినెట్ మంత్రులుగా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అతిషి విద్య, నీరు, ఆర్థిక, పీడబ్ల్యూడీ, విద్యుత్, చట్టంతో సహా మొత్తం 14 మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నారు. ఇన్ని శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకైక మంత్రి అతిషి.
14 ఏళ్ల బాలికను గన్‌తో బెదిరించి, కారులో తిప్పుతూ అత్యాచారం..
బీహార్‌లో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు 180 కి.మీ దూరంలోని సహర్సాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గన్‌తో బెదిరించి బాలికను కారులోకి ఎక్కించుకుని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బిట్టు, అంకుష్‌గా గుర్తించారు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం బాలిక మేకలను మేత కోసం తీసుకెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారులో వచ్చిన ఇద్దరు నిందితులు ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారులోకి ఎక్కించారు. ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారాని పాల్పడ్డారు. కారులో బాలిక అరుపులు బయటకు వినిపించకుండా బిగ్గరగా మ్యూజిక్ పెట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత రోడ్డు పక్కన బాలికను విడిచిపెట్టారు.
గుండ్రాళ్ల మధ్య తొమ్మిది గంట పాటు నరకం.. రెస్క్యూ టీం ఏం చేసిందంటే ?
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 11 ఏళ్ల బాలుడు తన పాఠశాల క్యాంపస్‌లోని రెండు రాళ్ల మధ్య 9 గంటల పాటు చిక్కుకున్నాడు. 9 గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని, క్షేమంగా ఉన్నాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థి రెండు పెద్ద రాళ్ల మధ్య చిక్కుకుపోయాడని పాఠశాల విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్కూల్ సిబ్బంది వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. దీని తరువాత స్థానిక అత్యవసర సేవలను పిలిచారు. హిల్స్‌బరో ఫైర్ చీఫ్ కెన్నీ స్టాఫోర్డ్ మాట్లాడుతూ.. రక్షకులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకున్న బాలుడిని కనుగొన్నారు. తెల్లవారుజామున 3:15 గంటలకు బాలుడిని బండరాళ్ల మధ్య నుండి బయటకు తీశారు. అతన్ని పరీక్ష కోసం ఆసుపత్రికి పంపారు. తరువాత అతన్ని అక్కడి నుండి డిశ్చార్జ్ చేశారు.
సల్మాన్ ఖాన్ పేరుతో సైలెంట్ గా మోసం చేసిన కేటుగాళ్లు..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో జరిగే ఈవెంట్లో సల్మాన్ పాల్గోనున్నారని.. దానికోసం టికెట్స్ కొనాలని వస్తున్న వార్తలన్నీపూర్తి అవాస్తవం అని తెలిపారు. తాను అమెరికాలో జరిగే ఏ ఈవెంట్ లోనూ పాల్గొనడం లేదని స్పష్టత ఇచ్చారు.
పుష్ప -2 తర్వాత బన్నీసినిమా ఆ దర్శకుడితోనే..
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప – 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్పకి కొనసాగింపుగా పుష్ప – 2 రానుంది. రష్మిక మందాన అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మొదటగా ఈ సినిమా ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలు వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6న గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉండగా పుష్ప తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు అనేది అందరీ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు అట్లీ, వెట్రిమారన్ పేర్లు వినిపించాయి. అట్లీతో సినిమా దాదాపు ఒకే అయిందని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో బన్నీతదుపరి చిత్రంపై బన్నీ యూనిట్ వర్గాలనుండి ఓ సమాచారం అందుతోంది. పుష్ప – 2 పూర్తి చేసిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే పని చేయనున్నట్లు తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, అత్యంత భారీ బడ్జెట్ పై ఈ చిత్రం రానుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.