చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్‌లోకి ప్రవేశం
చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణం అవుతోంది. ఈ బీఎఫ్.7 వేరియంట్ అత్యధిక వేగంతో ఇన్ఫెక్షన్ కు కారణం అవుతోంది. ఒమిక్రాన్ బీఏ.5 సబ్ వేరియంటే ఈ బీఎఫ్.7. తక్కువ ఇక్యుబేషన్ పిరియడ్ ఉండటంతో పాటు టీకాలు వేసుకున్నవారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగించడం ఈ బీఎఫ్.7 ప్రత్యేక లక్షణం. ఇప్పటికే యూకే, యూఎస్ఏ, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి యూరోపియన్ దేశాలతో సహా పలు ఇతర దేశాల్లో కూడా ఈ బీఎఫ్ 7 వేరియంట్ ను కనుక్కున్నారు. తాజాగా బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. రద్దీ ప్రాంతాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రజలకు సూచించింది. దీంతో పాటు ఎయిర్ పోర్టుల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేయనుంది.
కేంద్రం కీలక ప్రకటన.. రూ.106 కోట్లతో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు
శాఖ రైల్వేజోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. కాజీపేటను కొత్త డివిజన్ చేసే ప్రతిపాదన ఏమీ లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఏసుక్రీస్తు వల్లే కరోనా తగ్గింది
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని అన్నారు. భారత దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని పేర్కొన్నారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందని చెప్పారు. అలాగే.. మంచిని ప్రేమించాలని, మంచిని ప్రేమించాలని చెప్తున్న అన్ని జాతులు, మతాలను మనం గౌరవిస్తూ ముందుకు తీసుకుపోతుండటం వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రపంచంలో భారతదేశం మనుగడ సాగించలేకపోయేదని, ఇంత అభివృద్ధి కూడా చెందలేదని అన్నారు. కానీ.. ఆరోజుల్లో మానవ రూపంలో వచ్చిన ఏసుక్రీస్తు మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యను, ఆధునిక సంస్కృతిని తీసుకురావడం వల్ల మన దేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు స్థానంలో ఉందని తెలిపారు.
ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం వివరించింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినది అని.. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమైనదే అని తెలిపింది.
అక్రమ నిర్మాణల కేసులో నాగార్జునకు నోటీసులు
అక్కినేని నాగార్జున మరో వివాదంలో చిక్కుకున్నాడు. గోవాలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నది గోవాలోని ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ నాగ్ కు నోటీసులు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. అక్కినేని నాగార్జున గోవాలోని మాండ్రేమ్ అనే గ్రామంలో ఒక అందమైన ఇంటిని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే అది అక్రమ నిర్మాణం అని, ముందస్తు అనుమతులు లేకుండా నాగ్ ఈ నిర్మాణాలు చేపట్టడంతో మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు నోటీసులు పంపారు. “ముందస్తు అనుమతి లేకుండా సర్వే నం. 211/2బి ప్రాంతంలో మీ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపకపోతే పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసులపై నాగ్ ఇప్పటివరకు స్పందించలేదని తెలుస్తోంది. మరి నాగ్ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఏపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు.. పార్టీ మారబోతున్నారా?
కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు. అయితే తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని, కానీ వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.