ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ. ఎల్. విజయ్… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. హాలోవిన్ నైట్ జరిగే కొన్ని ఊహించని పరిణామాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రసుత్తం దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, విద్యుల్లేఖ రామన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని ఎ. ఎల్. విజయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తీసున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన తెరకెక్కించిన ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది.