మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా ‘స్వప్నాల నావ’ రూపొందింది. డల్లాస్ కి చెందిన గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘స్వప్నాల నావ’ని సిద్ధం చేశారు. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించారు. ఈ ‘స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే దివంగత లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మలిచారు. ‘ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. సూపర్ హిట్ సినిమా ‘మనసంతా నువ్వే’ లో కూడా సిరివెన్నెల గారితో గుర్తుండిపోయే ఓ పాత్ర చేయించారు వీఎన్ ఆదిత్య. ఇప్పుడు ‘స్వప్నాల నావ’ తో సిరివెన్నెల గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా యూట్యూబ్లో ఈ పాటకు 1 మిలియన్ వీక్షణలు నమోదయ్యాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు.