ఒక్క రోజు ఖాళీగా కూర్చోకుండా, క్షణం తీరిక లేకుండా గడిపేవారు కూడా గత రెండు సంవత్సరాల్లో నెలల తరబడి ఇళ్లకు పరిమితం అయ్యారు. సినిమాల సంగతి సరేసరి! రిలీజ్ లు లేక, షూటింగ్ లు లేక బిజీ ఆర్టిస్ట్స్ అంతా బోర్ గా ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా షూటింగ్ ల జోరు పెరుగుతోంది. దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మరి టైటిల్ వినగానే తెలిసిపోతోంది కదా… ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఆడాళ్ల కథే! అందుకే సీనియర్ లేడీ స్టార్స్ చాలా మందే ఉన్నారు సినిమాలో!
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. రశ్మిక మందణ్ణ కథానాయిక. అయితే, రాధిక శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశీ వంటి వారు చిత్రంలో ఉన్నారు. రైట్ నౌ… ఆడవాళ్లంతా షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. సందడిగా షూట్ చేస్తున్నారు. అయితే, అసలు అట్రాక్షన్ శర్వానంద్ ఇంటి నుంచీ వచ్చే భోజనమే అంటోంది రాధిక! తన సొషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసిన ఆమె “శర్వానంద్ వడ్డించే ఆహారం కోసం మేం మా కారవాన్స్ లోకి వెళ్లటం కూడా మానేశాం. సరదాగా కబుర్లు చెబుతూ భోంచేస్తున్నాం!” అని చెబుతోంది!
శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దీనితో బాటు శర్వానంద్ ‘మహాసముద్రం’ సినిమాలో కూడా కనిపించబోతున్నాడు…