Sammelanam Web Series Review : ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం.
‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ, స్నేహం, వినోదం అన్నింటిని మేళవించి సమ్మేళనంగా తీశారు ఈ వెబ్ సిరీస్ ను. ఇందులో హీరోగా గణాదిత్య నటించారు. ‘హుషారు’, ‘ముఖ చిత్రం’, ‘బ్రహ్మ ఆనందం’తో పాటు పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న ప్రియా వడ్లమాని హీరోయిన్. వీరితో పాటు విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించగా.. సునయని బి, సాకేత్ జె నిర్మించారు.
కథ : ఈ వెబ్ సిరీస్ లో హీరో రామ్ (గణాదిత్య) ఓ రైటర్. అతడు ఓ బుక్ రాస్తాడు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో అతడితో పాటు బుక్ గురించి పేపర్లలో ఫస్ట్ పేజీలో పడుతుంది. దాంతో అతడిని వెతుకుతూ శ్రీయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్), మేఘన (ప్రియా వడ్లమాని) తనను కలిసేందుకు వస్తారు. వాస్తవానికి అర్జున్, రామ్ చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. రైటర్ కావాలనేది రామ్ కల. అందుకోసం తన స్నేహితుడు అయిన అర్జున్ సపోర్ట్ చేస్తుంటాడు. ఆర్థికంగా కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటాడు. తనకు తన ఆఫీసులో పరిచయమైన మేఘనతో అర్జున్ లవ్ లో పడతాడు. అదే అమ్మాయిని రామ్ కూడా ప్రేమిస్తాడు. ఇంతకీ ఇద్దరిలో మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ లేకపోయినా ఒకరికొకరు ఎలా దూరం అయ్యారు? మళ్లీ ఎవరిని ఎవరు కలిశారు? మేఘన లైఫ్ లో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏంటి? చివరకు జంటగా అయ్యేది ఎవరు అనేది తెలియాలంటే వెబ్ సిరిస్ చూడాల్సిందే .
విశ్లేషణ : ఈ వెబ్ సిరీస్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని తెరకెక్కించిన డైరెక్టర్ తరుణ్ మహాదేవ్, ప్రొడ్యూసర్లు సునయన – సాకేత్ లకు ఉన్న అభిరుచిని మెచ్చుకోవాలి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఓటీటీలంటే బూతుబొమ్మలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా సిరీస్ ను ఆధ్యంతం క్లీన్ గా తెరకెక్కించారు. అందులో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. తన కంటే తక్కువ వాళ్లను కూడా ఎంత అప్యాయంగా చూడాలనేది ఈ సిరీస్ లో చూపించారు.
ఒక యజమాని పని మనిషిని పని మనిషిలా కాకుండా చెల్లెలి కింద చూస్తుంటారు. డైలాగుల్లో డీప్ మీనింగ్ ఉండే విధంగా దర్శక రచయిత తరుణ్ మహాదేవ్ క్లిక్ అయ్యారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఆ మాటలు చెప్పే సమయం, సందర్భం అప్పుడు కుదిరిందా లేదా అనేది చూసుకోలేదనిపిస్తుంది. కాస్త గ్యాప్ తీసుకుని మరీ మధ్య మధ్యలో కొన్ని చమక్కులు విసిరారు. వాటిని ఆడియన్స్ పట్టుకోవడం జర కష్టమే.
డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ రచనలో తెలుగు భాష గొప్పదనం చెప్పాలన్న తపన కనిపించింది. ‘వేసవి ఎండల్లో తూర్పు గాలులు గురించి విన్నావా రామ్? ఆ తూర్పు గాలులు వాటి వెంట ఒక చల్లదనాన్ని తెస్తాయంట. ఆ సమ్మర్ కూడా అంతే’ అని హీరోయిన్ ప్రియా వడ్లమాని ఓ డైలాగ్ చెబుతారు. ఆ డబ్బింగ్ ఆ విజువల్ చూస్తే గౌతమ్ మీనన్ మేకింగ్ స్టైల్ ఫాలో అయినట్లు అనిపిస్తుంది. తరుణ్ మహాదేవ్ రచన, దర్శకత్వంలో తపన ఉంది కానీ కథలో మాత్రం కొత్తదనం కనిపించలేదు. రొటీన్ సబ్జెక్టు తీసుకున్నారు.
ప్రేమ, స్నేహం, హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ అన్నింటిలో వావ్ అనిపించే మూమెంట్స్ అయితే లేవు. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం రొటీన్ పాయింట్ . ఆ అమ్మాయి చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీలో మెసేజ్ ఇవ్వడం కొందరికి నచ్చకపోవచ్చు. లవ్ స్టోరీలో మెసేజ్ అన్న కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంది. పాటలు అన్నీ చక్కగా వినసొంపుగా ఉన్నాయి. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ కూడా బావుంది. కెమెరా వర్క్ బాగా కుదిరింది. ప్లజెంట్ ఫీల్ తెచ్చేలా లైటింగ్, ఫ్రేమింగ్ ఉన్నాయి.
ఇక హీరో గణాదిత్య స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. ఎమోషనల్ సీన్స్ బాగా వండివార్చారు. ప్రియా వడ్లమాని తన పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. మేఘన తాలూకూ సంఘర్షణను బాగా ఎక్స్ పోజ్ చేశారు. బిందు, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ యాచమనేని, జీవన్ ప్రియా రెడ్డి తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
‘సమ్మేళనం’లో సాంగ్స్ బాగున్నాయి. ఓటీటీల్లో ఈ తరహా మ్యూజిక్ వినిపించడం అరుదు. స్టార్టింగ్ టు ఎండింగ్ స్క్రీన్ మీద క్యారెక్టర్లతో ట్రావెల్ చేసే కథ, కథనం, సన్నివేశాలు అద్భుతంగా అనిపించింది. ప్రేమ కథను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా తీశారు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Rating : 2.75/5