మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ నుండి దర్శకధీరుడు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రేటజీ పూర్తిగా మారిపోయింది. నిర్మాతలతో కలిసి రాజమౌళి ఏ భాషా చిత్రం హక్కులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. అందుకే ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందు నిర్మాతలకు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి జరిగిన డిజిటల్ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని అదే ఫార్ములాను ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూ అప్లయ్ చేయబోతున్నారట నిర్మాతలు. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఇటు నెట్ ఫ్లిక్స్ కు అటు జీ 5కు నిర్మాతలు అమ్మేశారు. ‘రాధే శ్యామ్’ హిందీ వర్షన్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఇతర భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హక్కుల్ని జీ 5 పొందింది. ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ నిర్మాతలు ఇదే పని చేశారు. సో… ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడంలో ఇటు నెట్ ఫ్లిక్స్, అటు జీ 5 రెండూ కూడా ఓ అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది.
ఇంతవరకూ కాస్తంత నిదానంగా తన పావులను కదుపుతూ వచ్చిన జీ 5 సంస్థ కూడా ఇప్పుడు దక్షిణాది చిత్రాల డిజిటల్ హక్కులపై దృష్టి పెడుతోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ కు భారీ ఆఫర్స్ ఇచ్చి హక్కులను సొంతం చేసుకుంటోంది. ‘రాధేశ్యామ్’ నిర్మాతలకు ఫ్యాన్సీ అమౌంట్ ను ఆఫర్ చేసి జీ 5 ఈ నాలుగు భాషల ప్రసార హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. నిజానికి అని అనుకున్నట్టు జరిగి ఉంటే… పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ జూలై 30న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. సో…ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఎప్పుడు ప్రకటిస్తారా అని ప్రభాస్ అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.