అందాల భామ అదాశర్మకు కోపమొచ్చింది. రెండు రోజుల క్రితం బ్రిటీష్ గార్డ్ పక్కన ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఆ వీడియో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. బ్రిటీష్ గార్డ్ పక్కన తన బాలీవుడ్ సాంగ్ ‘షేక్ ఇట్ లైక్ షమ్మీ’ పాటను అదాశర్మ పాడి, నర్తించింది. అయితే… ఆమె విదేశీ పర్యాటక ప్రవర్తన చాలా దారుణంగా ఉందంటూ నెటిజన్లు అదాశర్మపై విరుచుకుపడ్డారు.
దాంతో అమ్మడిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇది కరోనాకు ముందే తీసిన వీడియో అని, అక్కడ పర్యాటక శాఖ వారు ఏదైనా పాటకు డాన్స్ చేయమంటే తాను హిందీ పాటకు చేస్తానని ముందే చెప్పి, డాన్స్ చేశానని వివరణ ఇచ్చింది. అంతేకాదు… దాదాపు రెండువందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన బ్రిటిషర్స్ కు చాలా విశాల హృదయం ఉందని, అందుకే తనను హిందీలో పాట పాడేందుకు అనుమతించారని, కానీ వసుధైక కుటుంబకం అని చెప్పుకునే మన వాళ్ళు మాత్రం తనను తప్పు పడుతున్నారని అదాశర్మ వాపోయింది. పనీ పాటలేకుండా తనను కామెంట్ చేసి కేలరీస్ ను ఖర్చు చేస్తున్న వారికి ఫ్రీ జిమ్ ప్యాకేజ్ ఉందంటూ అమ్మడు ఎగతాళి కూడా చేసింది. అయితే… అదాశర్మను విమర్శించే విషయంలో నెటిజన్లు ఎంతమాత్రం తగ్గేదే లే అంటున్నారు. ‘నీకు చేతనైతే… అక్కడున్న మన కోహినూర్ డైమండ్ తీసుకురా!’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CZJpKZ5jB8x/