ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్ కు దక్కుతోంది.
‘మిమి’ చిత్రంలో నాయికగా నటించిన కృతీసనన్ పై ఓ సూపర్ డూపర్ డాన్స్ నెంబర్ ను నైట్ ఎఫెక్ట్స్ లో వందలాది మంది డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరించారు. ‘పరమ్ సుందరి’ అంటూ సాగే ఈ పాటను అమితాబ్ భటాచార్య రాయగా, ఎ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచారు. దీన్ని శ్రేయా ఘోషల్ గానం చేసింది. ఈ పాటను ఇప్పటి వరకూ 3.7 కోట్లమంది వీక్షించడం విశేషం. ఈ పాటలోని బాణీలకు తగ్గట్టుగా కృతీసనన్ వేసిన స్టెప్పులు కుర్రకారుని కిర్రెక్కిస్తున్నాయి. దాంతో ఓవర్ నైట్ ఇది కోట్లాది మందికి ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. కామెంట్స్ లోనూ రెహ్మాన్, శ్రేయా ఘోషల్ కాంబోను విపరీతంగా అభిమానులు కీర్తిస్తున్నారు. కృతీసనన్ సరోగసీ మదర్ గా నటిస్తున్న ‘మిమి’ సినిమా జియో సినిమాస్, నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 30 స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రంలో మనోజ్ పహ్వా, సుప్రియా పాఠక్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.