జనాన్ని ఎంటర్ టైన్ చేయడంలో మాస్ మహరాజా రవితేజ తీరే వేరు. తన బాడీ లాంగ్వేజ్ తో మురిపిస్తుంటారు. వెకిలిగా నవ్వుతూనే వినోదాన్ని అందిస్తుంటారు. వెటకారంగా మాట్లాడీ సందడి చేస్తుంటారు. అదే రవితేజ ప్రత్యేకత అని చెప్పవచ్చు. గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో నవతరం నాయకులకు పోటీగానూ రంగంలోకి దూకి సందడి చేశారు. నిరుడు పొంగల్ బరిలో రవితేజ ‘క్రాక్’ సినిమా చేసిన హంగామా ఇప్పటికీ జనానికి గుర్తుంది. ఈ సారి ఏకంగా ఐదు చిత్రాలతో జనాన్ని మురిపించే ప్రయత్నంలో ఉన్నారు రవితేజ.
నేడు మాస్ మహరాజాగా జేజేలు అందుకుంటున్న రవితేజ 1967 జనవరి 26న జన్మించారు. ఆయన తండ్రి ఫార్మాసిస్ట్ కావడంతో ఉత్తరాదిన రవితేజ బాల్యం గడిచింది. షోలే
సినిమా చూసి, చిత్రసీమపై ఆసక్తి పెంచుకున్నారు రవితేజ. చదువు మధ్యలోనే ఆపేసి సినిమా రంగంవైపు పరుగులు తీశారు. చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి పడరాని పాట్లుపడ్డారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో నటించారు, కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. ఏ పాత్ర దొరికినా అందులో పరకాయ ప్రవేశం చేయడానికి సై అనేవారు. ఇక ఔట్ పుట్ కూడా అదే రేంజ్ లో అందించేవారు. అందుకే రవితేజలోని నటుణ్ణి మెచ్చి కొందరు అదే పనిగా పాత్రలు ఇవ్వసాగారు. రవితేజ సైతం తన శక్తివంచన లేకుండా అవకాశం ఇచ్చిన వారు నిరుత్సాహపడకుండా నటించి మెప్పించేవారు. అలా సాగుతున్న సమయంలో శ్రీను వైట్ల దర్శకునిగా తానేమిటో నిరూపించుకొనే ప్రయత్నంలో ‘నీ కోసం’ తెరకెక్కించారు. అందులో రవితేజనే హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమా పలు బాలారిష్టాలు దాటి మొత్తానికి జనం ముందు నిలచింది. చిత్రంగా ప్రేక్షకుల మదిని గెలిచింది. ఆ సినిమాతో రవితేజకు హీరోగా మంచి గుర్తింపు లభించింది.
రవితేజకు స్టార్ గా బ్రేక్ నిచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. రవితేజతో పూరి తెరకెక్కించిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. రవితేజను టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా నిలిపాయి. ఇక రవితేజను ఉత్తమనటునిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘నేనింతే’ చిత్రమే కావడం విశేషం! శ్రీను వైట్ల కూడా రవితేజతో వినోదాల విందు చేశారు. సురేందర్ రెడ్డి సక్సెస్ కోసం సతమతమవుతున్న సమయంలో ‘కిక్’తో కిక్కునిచ్చిందీ రవితేజనే. మాస్ మసాలా డైరెక్టర్ గా నేడు పేరొందిన బోయపాటి శ్రీను తొలి సినిమా ‘భద్ర’లోనూ రవితేజనే కథానాయకుడు. ఆ సినిమా సైతం జనాన్ని విశేషంగా మురిపించింది. ఇలా పలువురితో కలసి విజయాన్ని పంచుకున్నారు రవితేజ. రాజమౌళి రెండు సినిమాల్లో రవితేజలోని టాలెంట్ ను అద్భుతంగా వినియోగించుకున్నారు. ‘విక్రమార్కుడు’లో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజలో అంతకు ముందు జనం చూడని కొత్తకోణాన్ని ఆవిష్కరించారు. అందులోనే అత్తిలి సత్తిబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ. సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘మర్యాద రామన్న’లో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం.
రవితేజలోని వాయిస్ ను రాజమౌళి పసికట్టినట్టే, ఆయనలో ఓ గాయకుడూ దాగున్నాడని సంగీత దర్శకుడు థమన్ పట్టేశారు. ‘బలుపు’ చిత్రంలో తొలిసారి రవితేజ నోట “కాజల్ చెల్లివా…కరీనాకు కజినివా…” పాటను పలికించారు. ఆ తరువాత థమన్ స్వరకల్పనలోనే తెరకెక్కిన ‘పవర్’లో “నోటంకి నోటంకి…” పాట పాడి పరవశింప చేశారు రవితేజ. ఆపై “రమ్ పమ్ బమ్…” అంటూ ‘డిస్కో రాజా’లో అదే థమన్ బాణీల్లోనే గానం చేసి మురిపించారు. చాలా రోజుల తరువాత రవితేజకు హిట్ గా నిలిచన ‘రాజా ది గ్రేట్’లోనూ చిత్ర దర్శకుడు పట్టు పట్టి రవితేజతో పాట పాడించారు. సాయికార్తీక్ సంగీతంలో రూపొందిన “రాజా ది గ్రేట్…” టైటిల్ సాంగ్ కూడా జనాన్ని కట్టిపడేసింది. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న రవితేజ ప్రస్తుతం ఖిలాడి
గా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యేడాది మరో నాలుగు సినిమాల్లోనూ నటించి, అలరించేందుకు రడీ అవుతున్నారాయన.
రవితేజతో సినిమాలు తెరకెక్కిస్తే తమ కెరీర్ బాగుంటుందని ఎందరికో సెంటిమెంట్ ఇప్పటి దాకా రవితేజ చిత్రాల ద్వారా పది మంది దర్శకులు పరిచయం అయ్యారు. వారిలో శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, మలినేని గోపీచంద్ వంటి టాప్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఏది ఏమైనా వినోదమే ప్రధానంగా సాగుతున్న రవితేజ ఈ సారి భలేగా సందడి చేస్తారనే అనిపిస్తోంది.