టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో ఇక్కడా ఆమె మంచి పాత్రలనే పొందిందనే భావన కలుగుతుంది. గత యేడాది ఫిబ్రవరిలో ‘థప్పడ్’ మూవీతో ప్రేక్షకుల మనసుల్ని మరోసారి గెలచుకున్న తాప్సీ ఇప్పుడు మాత్రం ‘హసీన్ దిల్ రుబా’తో ఆ పని చేయలేకపోయింది.
కథ విషయానికి వస్తే… ఢిల్లీకి చెందిన మోడర్న్ గర్ల్ రాణి కశ్యప్ (తాప్సీ). ఇద్దరు యువకులతో డేటింగ్ చేసి, ఆ జీవితం పట్ల విరక్తి చెంది, చివరకు ఉత్తరాఖండ్ లోని జ్వాలాపూర్ కి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిషబ్ సక్సేనా (విక్రాంత్ మాస్సే)ను ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది. తన భర్త చక్కటి ఫిజిక్ తో, రొమాంటిక్ లుక్ తో, సరదాగా ఉండాలని రాణీ కోరుకుంటుంది. కానీ పెద్దవాళ్ళు పప్పుసుద్ద లాంటి రిషభ్ ను కట్టబెట్టారని బాధపడుతూ ఉంటుంది. అలాంటి ఆమె జీవితంలోకి రిషబ్ పిన్ని కొడుకు నీల్ త్రిపాఠి (హర్షవర్థన్ రాణే) ఊడి పడతాడు. తాను ఎలాంటి వ్యక్తిని భర్త గా కోరుకుందో ఆ లక్షణాలన్నీ నీల్ లో ఆమెకు కనిపిస్తాయి. మానసికంగానే కాకుండా శారీరకంగానూ అతనికి దగ్గర అవుతుంది. ఇక భర్తను వదిలేసి, ఢిల్లీ చెక్కేసి, నీల్ తో కొత్త జీవితాన్ని గడపడమే తరువాయి అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా నీల్ మాయమైపోతాడు. తాను మోసపోయాననే విషయం రాణికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ‘హసీన్ దిల్ రుబా’ చిత్రం.
ఈ చిత్రానికి తెలుగు సినిమా రంగానికి గట్టి అనుబంధమే ఉంది. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు అందించిన వ్యక్తి కనీకా థిల్లాన్. అంటే కె. రాఘవేంద్రరావు మాజీ కోడలు, సూర్య ప్రకాశ్ మాజీ భార్య. ఆమె హిందీ చిత్రాలే కాదు… తెలుగులోనూ ‘సైజ్ జీరో’కు స్క్రీన్ ప్లే అందించింది. ఆమె గతంలో కథను అందించిన ‘మనమర్జియా’కు ‘హసీన్ దిల్ రుబా’కు కొన్ని పోలికలైతే ఉన్నాయి. అయితే ఆ కథనే మార్చి మళ్ళీ ఇచ్చేసిందని అనలేం. దీనిలో అదనంగా ప్రేక్షకుల ఊహకందని క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. సినిమా ప్రారంభమే రిషభ్ గ్యాస్ సిలిండర్ పేలి మరణించడంతో మొదలవుతుంది. తన భర్తను రాణినే హత్యచేసిందనే అనుమానంతో పోలీసులు కేసును విచారణ చేస్తుంటారు. నీల్ తో తనకు అక్రమ సంబంధం ఉన్న మాట వాస్తవమేనని, కానీ భర్తను మాత్రం తాను చంపలేదని రాణి వాదిస్తూ ఉంటుంది. తను నిరపరాధినని రాణి ఎలా నిరూపించుకుందన్నదే ఈ సినిమా.
సో… ఇది కేవలం రొమాంటిక్ మూవీ మాత్రమే థ్రిల్లర్ కూడా. సినిమా ప్రారంభం నుండి హత్య ఎవరు చేశారనే ఇన్వెస్టిగేషన్ తో సాగుతూ ఉంటుంది. అయితే… ఈ రెండు అంశాలను కిచిడీ చేసే క్రమంలో చాలా లాజిక్స్ ను దర్శకుడు వినిల్ మాధ్యూ మిస్ చేసేశాడు. ఇక తెలుగువారితో ఈ సినిమాకు ఉన్న సంబంధం ఏమంటే… కథానాయిక తాప్సీ తెలుగు సినిమాతోనే నటిగా అరంగేట్రమ్ చేసింది. అలానే ఇందులో నీల్ పాత్ర పోషించిన హర్షవర్థన్ రాణే సైతం తెలుగువారికి చిరపరిచితుడే. పలు చిత్రాలలో నటించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించిన గుమ్మడి జయకృష్ణ తెలుగువాడే. వీరందరి కంట్రిబ్యూషన్ ఈ సినిమాకు ఎంతో ఉంది. కానీ వీరందరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.
నిజానికి తాప్సీ పాత్ర తీరే చిత్రంగా ఉంటుంది. ఢిల్లీలో ఉండే ఆమెకు ఓ మధ్యతరగతి, మామూలు ఇంజనీర్ ను పెళ్ళి చేసుకోవడానికి మనసు అంగీకరించదు. కానీ రాజీ పడిపోతుంది. అందుకే ‘ఏవరేజ్ మనిషికి లాటరీ తగిలింది’ అని భర్త తో అంటుంది. అలానే ‘లక్కీగా ‘తనువు, మనసు, ధనము’ నీకు భలే దొరికాయి’ అని అంటుంది. నిజానికి ఆమె మనసు ఏనాడు భర్త మీద ఉండదు. ఇక అత్తగారితో తాప్సీ ప్రవర్తించే తీరు, ఆమె తాప్సీని ఆడుకునే తీరు సగటు అత్త కోడళ్ళ వ్యవహారాన్ని గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో ఏదైనా కాస్తంత వినోదం వీక్షకులకు లభించిందటే… అత్త పాత్ర వేసిన యామినీ దాస్ కారణంగానే. అలానే తాప్సీ మామగా నటించిన దయాశంకర్ పాండే కూడా కొద్దిలో కొద్ది వినోదాన్ని అందించాడు. తాప్సీ నటనకు వంక పెట్టడానికి లేదు. పైగా ఆమె ఈ పాత్ర చేయడం వల్ల ఈ ‘బి గ్రేడ్’ మూవీకి కాస్తంత గౌరవం దక్కిందని అనుకోవాలి. రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే కూడా చక్కగానే నటించాడు. కానీ అతనిలోని మరో కోణాన్ని తెర మీద కన్వెన్సింగ్ గా దర్శకుడు చూపించలేకపోయాడు. హర్షవర్థన్ రాణే తన ఫిజిక్ కు తగ్గ పాత్ర పోషించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో ఆదిత్య శ్రీవాత్సవ్ సహజంగా ఉన్నాడు. మొత్తంగా నటీనటుల నుండి వంక లేకపోయినా… పాత్రల తీరుతెన్నుల్లో లోపం వల్ల… సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఎక్కడా ఆసక్తి అనేది కలగదు.
పైగా క్లయిమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అందదని దర్శక నిర్మాతలు భ్రమ పడ్డారు కానీ ద్వితీయార్థం ప్రారంభంలోనే ఏం జరిగిందనే ఊహ వాళ్ళకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే… కనికా థిల్లాన్ కు ‘ఎల్’ సెంటిమెంట్ ఎక్కువ అనుకుంటా! ఆమె గత చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’లోనూ ఓ ఎల్ ను అదనంగా చేర్చింది. ఇప్పుడీ ‘హసీన్ దిల్ రుబా’లోనూ ఓ ఎల్ అక్షరాన్ని అదనంగా పెట్టింది. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఈ ఎల్ ఆమెలోని లెర్నర్ ను మాత్రమే సూచించింది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న’హసీన్ దిల్ రుబా’ను తెలుగులోనూ చూడొచ్చు. తాప్సీ అభిమానులు, థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
గుమ్మడి జయకృష్ణ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్
కొత్తదనం లేని కథ
ఆసక్తి కలిగించని కథనం
ఊహకందే క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: మనసు మెప్పించలేదు!