1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని భుజానకెత్తుకుని ప్రచారం చేసినా, రావాల్సినంత గుర్తింపు అయితే వచ్చింది కానీ కలెక్షన్ల వసూళ్ళలో మాత్రం ’83’ వెనకబడిపోయింది. దానికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రధానంగా అనేక రాష్ట్రాలలో యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండటం, నైట్ కర్ఫ్యూ కారణంగా సెకండ్ షోస్ ప్రదర్శన లేకపోవడం… ఇవన్నీ కూడా ’83’ విజయానికి అడ్డుకట్ట వేశాయి. అయితే… ఈ హర్డిల్స్ ను అధిగమించి 2021లో విడుదలైన సినిమాలలో ఓవర్సీస్ మార్కెట్ లో ప్రథమస్థానంలో ’83’ మూవీ నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే నెలరోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని, ఇంకా కొన్ని రాష్ట్రాలలో, మరి కొన్ని దేశాలలో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా 62.54 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని, 2021లో ఈ మాత్రం వసూళ్ళు రాబట్టిన భారతీయ చిత్రం మరేదీ లేదని అంటున్నారు. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు చక్కని ఆదరణ కనబరిచారని, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో సైతం ఈ వసూళ్ళు రావడం విశేషమే అని, పరిస్థితలు అనుకూలించి ఉంటే సినిమా మరింత ఆదరణ పొందేదని దర్శకుడు కబీర్ ఖాన్ తెలిపారు. అన్నట్టు ’83’ సినిమా ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అండ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.