మొరాకో మూలాలున్న మోహనాంగి… నోరా ఫతేహి! ‘మనోహరి’ పాటలో ‘బాహుబలి’ చిత్రానికి అందాలు జోడించిన ఈ వయ్యారి క్రమంగా నటనకు అవకాశాలున్న పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ‘భుజ్’ సినిమాలో నోరా అలరించనుంది. సహజంగానే ఈ బెల్లి డ్యాన్స్ సెన్సేషన్ మూవీలో డ్యాన్సర్ గా మెస్మరైజ్ చేస్తుంది. అయితే, విశేషం అంతే కాదట!
‘భుజ్’ సినిమాలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్ గా నోరా ఫతేహి పని చేయనుంది. పాకిస్తాన్ లో ఆమె ఓ డ్యాన్సర్ గా కొనసాగుతూ ఇండియన్ ఆర్మీ కోసం కీలక సమాచారం సేకరిస్తుందట. అయితే, ఇదంతా విన్న వారికి ‘రాజీ’ సినిమాలో ఆలియా పాత్ర గుర్తుకు రావటం సహజమే! ఆ కోణంలో తప్పుడు ప్రచారం జరుగుతుందనే ఇంత కాలం ‘భుజ్’ దర్శకనిర్మాతలు నోరా క్యారెక్టర్ సీక్రెట్ గా ఉంచారు. వచ్చే నెల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిస్నీ హాట్ స్టార్ లో సినిమా విడుదల కాబోతంది. స్క్రీన్ పై నోరాను రా ఏజెంట్ గా చూశాక జనం తప్పక మెచ్చుకుంటారని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు…
నోరా ఫతేహి చేసిన రా ఏజెంట్ రోల్ నిజానికి పరిణీతి చోప్రా చేయాలి. కానీ, సినిమాలో సోనాక్షి మెయిన్ ఫీమేల్ లీడ్ గా ఉండటంతో ఆమె కంటే తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలో పరిణీతి చేసేందుకు ఇష్టపడలేదు. తరువాత కృతీ సనన్, జాక్విలిన్ వంటి వారు కూడా రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా ‘దిల్ బర్’ బ్యూటీ నోరా బరిలోకి దిగింది. చూడాలి మరి, ఈ స్పైసీ స్పై… మూవీకి ఎంతగా స్పైస్ యాడ్ చేస్తుందో!