కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరని ఆమె ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివి పడేసిన అపర మేధావి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. భూమి లేని అతి పేదవాడు వ్యవసాయం చేస్తుంటే.. ప్రభుత్వం పైసా కూడా సహాయం చేయడం లేదని షర్మిల విమర్శించారు.
Read Also: తెలంగాణలో అప్పటి నుండి నైట్ కర్ఫ్యూ..?
రైతుల విషయంలో వివక్ష చూపడం కేసీఆర్‌కు తగదని లేఖలో షర్మిల పేర్కొన్నారు. యూపీలో కేసీఆర్ ప్రచారం ఓ జోక్ అని ఆమె అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రానికే కేసీఆర్ సీఎం కావడం మన కర్మ.. అలాంటిది దేశాన్ని ఆయన చేతుల్లో పెడితే ఏమైనా ఉంటుందా అని ఎద్దేవా చేశారు. ఆయన సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే రైతులు వేల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటుంటే… ఆయన చేతుల్లో దేశాన్ని పెడితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందని షర్మిల అభిప్రాయపడ్డారు. కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరి వేస్తే కుక్క తోక తగిలి అది కూలిపోయిందంట… అలా ఉంటుంది కేసీఆర్ దేశ రాజకీయాలు వెలగబెడితే అని షర్మిల కౌంటర్లు వేశారు.