ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని.. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆయన్ను విమర్శించే స్థాయి లేదని చెప్పారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటా ఉన్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్ విసిరారు.
ఆయన మెడికల్ కాలేజీకి నష్టం వస్తుందనే.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను రానివ్వడం లేదని షర్మిల ఆరోపించారు. మెడికల్ సీట్లను 3కోట్లకు అమ్ముకున్నారని ఆమె ఆరోపణలు చేశారు. పువ్వాడ ఒక కంత్రి మంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత సీట్లు ఇస్తామని.. ఇచ్చావా
అంటూ మంత్రిని ప్రశ్నించారు. బస్టాండ్‌ను చూస్తే మంత్రి పరిపాలన అర్థం అవుతుందన్న ఆమె.. సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అజయ్‌కుమార్‌కు దమ్ముంటే నాలుగు రోజులు తమతో కలిసి పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్ విసిరారు. వైఎస్సార్ కాలిగోటికి కూడా పువ్వాడ అజయ్ పనికిరాడని ఆమె అన్నారు. వైఎస్సార్ అభిమానులంతా ఆయన వారసులేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అడుగు ముందుకు వేశామని.. ఆ అడుగు ముందుకే వెళ్లాలన్నారు. కేసీఆర్ అనే కొండను ఢీకొడుతున్నామన్న షర్మిల.. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.