రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తల చేతుల్లో దాడులకు గురైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న తనను అక్రమంగా పోలీసులు నిర్బంధించడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. పోలీస్ స్టేషన్లో తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడితే పట్టించుకోలేదన్నారు. వారిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపడం అప్రజాస్వామికమని రాజాసింగ్ అన్నారు.
మాజీమంత్రి చంద్రశేఖర్, సంగప్పతో కలిసి ఎల్లారెడ్డిపేటకు వెళ్తున్న రాజాసింగ్‌ను అల్వాల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గొడవల కారణంగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అల్లర్లను అదుపుచేసే క్రమంలో సీఐ, ఎస్సైలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకూ గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు రేపాక రామచంద్రరెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రెండుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతూనే వుంది. పదిరకు చెందిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోనాల సాయి ఇంటికి శుక్రవారం అధికార పార్టీ నేతలు వెళ్ళారు. సాయి లేడని చెప్పింది అతని తల్లి. అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో స్టేషన్ ఆవరణలో రెండు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు జరిగాయి. రేపాక రామచంద్రారెడ్డి, బీజేవైఎం మండల కార్యదర్శి ఎలేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ ఆవరణ నుంచి బయటకు పంపించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బీజేపీ నేతలపై దాడుల విషయం తెలియడంతో పాత బస్టాండ్ దగ్గర రెండుపార్టీల నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మొగిలి తెలిపారు.
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఏమన్నారంటే..
నిన్న ఎల్లారెడ్డి పేట లో జరిగిన బీజేపీ టిఆర్ఎస్ ఘర్షణ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇప్పటి వరకూ 12 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఠాణాలో జరిగిన సంఘటనలో గొడవకు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎస్సైకి గాయం అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఘర్షణ ఎలా జరిగింది ఎవరెవరు ఉన్నారు అన్నది దర్యాప్తు చేసి వారిపై కేసులు పెడతాం. ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్ట్ చేసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు తగు చర్యలు చేపడుతున్నారన్నారు.