సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడి ఓటమిని తట్టుకోలేక ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొక్కుల మమత (38) అనే మహిళ తమ్ముడి ఎన్నికల ప్రచారం కోసం వచ్చింది. కొద్ది పాటి తేడాలో తమ్ముడు ఓడిపోవడంతో మనోవేదనకు గురైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కొక్కుల మమత (38) ప్రస్తుతం కోరుట్లలో నివాసం ఉంటుంది. అయితే తన తమ్ముడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తుండగా.. ప్రచారం కోసం ఆమె గంభీర్పూర్ గ్రామానికి వెళ్లింది. మమత తమ్ముడు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ అయిన పోతు రాజశేఖర్, మరోసారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో మమత తమ్ముడు ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో ఓడిపోయాడు. దీంతో మమత మనో వేధనకు గురైంది. చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటన కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దారిలో ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. మమత భర్త ఉపాధి కోసం సౌది అరేబియా వెళ్లాడు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో మమత కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.