గోదావరి పుష్కరాలు–2027 తేదీలు ఖరారు
గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై దేవదాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది. మొత్తంగా 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న ప్రారంభమయ్యే పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అందించిన పండితాభిప్రాయం ఆధారంగా ఈ తేదీలను నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టీటీడీ సిద్ధాంతి సూచనలను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా, వాటిని పరిశీలించిన ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల తేదీల ఖరారుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుష్కరాలకు ఇంకా సుమారు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగా తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో పుష్కరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వసతి తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు అధికార యంత్రాంగానికి స్పష్టత లభించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఏజెన్సీలో చలి పంజా.. మంచు ఎఫెక్ట్‌తో రాకపోకలు నిలిపివేత..
అల్లూరి ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తుండడంతో ఘాట్ రోడ్డులలో భారీ వాహనాలు ట్రావెల్ వాహనాలను రాత్రిపూట రాకపోకలు నిలిపివేసిన అధికారులు.. పాడేరు వంజంగి మేఘాల కొండకు పర్యటకులు భారీగా చేరుకున్నారు.. కొండపై సూర్యోదయం తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు దృష్ట్యా మూడేళ్లలో తొలిసారిగా జి.మాడుగులలో అత్యల్ప మూడు డిగ్రీల నమోదు కాగా, పాడేరు, పెదబయలు, ముంచంగి పుట్టు ప్రాంతాలలో ఐదు డిగ్రీలు, అరకు, మినుములూరు, డుంబ్రిగూడ ప్రాంతాలలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఇక, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా కొనసాగుతోంది.. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 6.5 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో అర్లీ టి లో 7.5 గా నమోదు అయ్యింది.. నిర్మల్ జిల్లా లో పెంబి లో 7.8 గా.. మంచిర్యాల జిల్లాలో జై పూర్ లో 9 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..
విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కిట్‌లో ఉండేవి ఇవే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా పరమైన అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరంలో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లను “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పేరిట పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులకు అందించనున్న స్కూల్ కిట్లలో.. నోట్‌బుక్స్, బెల్ట్, షూలు, స్కూల్ బ్యాగ్, పిక్టోరియల్ డిక్షనరీ, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, మూడు జతల యూనిఫాం క్లాత్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కల్పిస్తూ రూ.157.20 కోట్ల నిధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ కిట్ల సరఫరా, పంపిణీ బాధ్యతలను టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్ణయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామగ్రి అందుబాటులోకి రానుండగా, విద్యాభ్యాసానికి మరింత తోడ్పాటు లభించనుందని అధికారులు భావిస్తున్నారు.
తమ్ముడు ఎన్నికల్లో ఓటమి.. గుండెపోటుతో అక్క మృతి..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులను కలచివేసింది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్‌గా పోటీ చేశాడు. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) తాపత్రయ పడింది. ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి చేరుకుంది. నిన్న కౌటింగ్ జారుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మమత.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. ఎన్నికల్లో 187 ఓట్ల తేడాతో ఓడిపోయిన శేఖర్ ఓడిపోయాడు. మమతకు గతంలో గుండెపోటు రావడంతో స్టంట్ వేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
వేములవాడలో దొంగనోట్ల కలకలం.. హాట్ టాపిక్ వ్యవహారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్ కు నగదు అప్పగించారు. సంఘం సభ్యుల నుంచి అందిన మొత్తం నగదును శుక్రవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అయితే 500 రూపాయల నకిలీ నోట్ రావడంతో ఒక్కసారిగా సభ్యురాలు ఆందోళన గురైంది. గతంలోనూ ఇప్పటికే రెండుసార్లు నకిలీ నోటు రాగా తనకు మూడోసారి కూడా అదే నకిలీ నోట్ రావడంతో సభ్యురాలు సభ్యుల నుంచి నగదు సేకరించేందుకు భయాందోళన గురవుతున్నారు. ఇకపై ప్రతినెలా చెల్లించాల్సిన నగదును నేరుగా ఒకరోజు మాత్రమే ఇవ్వాలని అది కూడా, బ్యాంకు సమయం ఉన్నప్పుడే ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్టు తెలిసింది. వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాలలో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
నేడు రేవంత్‌రెడ్డి vs మెస్సీ మ్యాచ్.. టైమ్, పూర్తి వివరాలు ఇవే..
ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా డిసెంబర్ 13 (శనివారం)న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటాడు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫొటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖీగా మాట్లాడి, ఫోటోలు దిగనున్నాడు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు సంభాషించి, కొన్ని ఫుట్‌బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రధానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమాకు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు.అయితే.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
విజయ్ ‘జన నాయగన్’కు స్పెషల్ టచ్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కథ, స్క్రీన్‌ప్లే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ‘జన నాయగన్’ను పొంగల్ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడమే కాకుండా, ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మలచాలని మేకర్స్ గట్టి ప్లానింగ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తోంది, ఐమాక్స్ రిలీజ్ నిజమైతే ఎలాంటి సంచలనం అవుతుందో చూడాలి.
రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పిన రోషన్ కనకాల..
‘బబుల్‌గమ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే ‘‘ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మోగ్లీ అనే కుర్రాడి కథ ఇది. అతడి ప్రేమకు ఎదురైన అడ్డంకి ఏంటి? క్రిస్టఫర్ నోలన్ అనే వ్యక్తి నుంచి అతడికి ఎదురైన సవాళ్లు ఏంటన్నది అసలు కథ. అటవీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో వినోదం, యాక్షన్‌తో పాటు అన్ని భావోద్వేగాలు సహజంగా పండాయి. సందీప్ ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని రోషన్ చెప్పారు. అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయడం సవాళ్లతో కూడుకున్నదే అయినా, ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు రోషన్ వెల్లడించారు.. ‘‘ఈ సినిమా తర్వాత అడవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. సిటీకి వస్తే ఇది నా ప్రపంచం కాదన్న భావన కలిగేది’’ అన్నారు. అలాగే సినిమాలపై తనకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉందని, నటన విషయంలో తండ్రితో చర్చలు జరుగుతుంటాయని చెప్పారు. ప్రస్తుతం తాను రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలిపారు. వాటిలో ఒకటి ఇంటెన్స్ లవ్ స్టోరీ కాగా, మరొకటి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని అన్నారు.