కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు.
రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన బ్రహ్మయ్య చారి గత 20 సంవత్సరాల క్రితం కామారెడ్డి కి బతుకుదెరువు కోసం వచ్చాడు. కామారెడ్డి మండలం బీడీ కాలనీలో నివాసముండే నందినిని వివాహం చేసుకున్నాడు.
గత కొన్ని రోజులుగా బ్రహ్మచారి మద్యానికి కు బానిసై తరచూ భార్య నందినితో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన నందిని ఆమె తల్లిదండ్రులు దత్తాత్రేయ,గంగామణి లు సోమవారం మధ్యాహ్నం సమయంలో బీడీ కాలనీ కి వచ్చి బ్రహ్మయ్య చారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. హత్య చేసిన తరువాత అక్కడి నుంచి నందిని, దత్తాత్రేయ, గంగామణిలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్తమామలు, భార్య చేతిలో బ్రహ్మయ్య చారి హతం కావడం ఆ ప్రాంతంలో అలజడి రేపింది.