తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్ పెరుగుతుంది అంటున్నారు. కాషాయం పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి.. ఆ తర్వాత భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, బీజేపీ నేతల కన్ను ఇప్పుడు సినీ పరిశ్రమపై పడింది.. వరుసగా సినీ నటులతో పార్టీ అగ్రనేతలు సమావేశం అవుతుండడంతో.. అసలు బీజేపీ ప్లాన్ ఏంటి? అనే చర్చ సాగుతోంది.
Read Also: Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు..
మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగసభ కోసం తెలంగాణ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశమై పొలిటికల్ హీట్ పెంచేశారు.. సినిమా విషయాలు, సీనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ సాగినట్లు బయటకు చెబుతున్నా.. ఈ డిన్నర్ మీటింగ్‌లో ఏం జరిగింది..? అనేది మాత్రం ఊహలకు అందడంలేదు.. ఇక, బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ ఇవాళ వరంగల్ వేదికగా జరగనుంది.. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు వస్తున్నారు.. పనిలో పనిగా అన్నట్టు ఇవాళ ఆయన టాలీవుడ్ హీరో నితిన్‌తో సమావేశం కాబోతున్నారు.. అంతే కాదు.. స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, మరికొందరు ప్రముఖులతో సమావేశం కానున్నారు.. అయితే, అమిత్‌షా-ఎన్టీఆర్ డిన్నర్ మీట్ జరిగిన నోవాటెల్ హోటల్‌లోనే మధ్యాహ్నం మిథాలీరాజ్.. రాత్రికి నితిన్.. జేపీ నడ్డాను కలవబోతున్నారు.
అయితే, టాలీవువడ్ ప్రముఖులతో వరుసగా బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చగా మారుతోంది.. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీం పాత్ర పోషించి మెప్పించారు.. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్‌షా.. ఎన్టీఆర్‌ను ప్రశంసించేందుకే సమావేశం అయ్యారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ భేటీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చర్చ జరిగిందట.. ఎంతైనా ఎన్టీఆర్ విషయం వేరు అనుకోవచ్చు.. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాబట్టి.. రాజకీయాలు కూడా చర్చించి ఉంటారు? పాలిటిక్స్‌లో ఏమైనా జరగొచ్చు? అనే చర్చ ఆసక్తిగా సాగుతుంది.. ఇక, ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. తెలంగాణ నుంచి టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న హీరో నితిన్‌తో భేటీకి రెడీ అయ్యారు కమలం పార్టీ చీఫ్.. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటులు ఉన్నా.. హీరోగా నిలదొక్కుకున్నారు నితిన్.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ఆ పార్టీ.. అందుకే నితిన్‌ని ఎంచుకున్నట్టు చర్చ సాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసి ఎన్టీఆర్ నటకు ఫిదా అయిన షా.. అభినందించడానికే జూనియర్‌తో భేటీ అయ్యారు.. సరే.. మరి.. వరుసగా అంతరేజ్ హిట్లు లేని నితిన్‌ని ఎందుకు కలుస్తున్నారు..? నితిన్‌ను నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం ప్లాప్ టాక్ తెచ్చుకుంది.. అయినా జేపీ నడ్డా ఎందుకు కలుస్తున్నారు? అనే ప్రశ్నించేవారు లేకపోలేదు.
అంతేకాదు,, టాలీవుడ్‌లోని మరికొందరు నటీనటులను కూడా బీజేపీ నేతలు కలిసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే కొంత మంది బీజేపీలో చేరారు. విజయశాంతి అలియాస్ రాములమ్మ.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. జీవిత రాజశేఖర్ లాంటివాళ్లు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు మరికొందరుటాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. సినిమా తారలంటే ప్రజల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. అది క్యాష్ చేసుకోవాలన్న ప్లాన్‌లోనే భాగంగానే.. సినీ పరిశ్రమ వారికి పార్టీ కండువాలు కప్పడం, వారితో సమావేశమై.. వారు కూడా మాతోనే ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం భారతీయ జనతా పార్టీ నేతల ప్లాన్‌గా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అంతే కాదు.. ఈ మధ్యే ప్రముఖ రచయిత, ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభలో కూర్చోబెట్టి గౌరవించింది బీజేపీ.. ఇప్పుడు.. టాలీవుడ్ ప్రముఖులతో బీజేపీ అగ్ర నేతలు భేటీ అయ్యేలా.. ఆయనే ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.