ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు..
ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి వద్దకెళ్లి పిల్లాపాపలతో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది…పైగా గ్రామానికి రోడ్డు లేదు. మౌలిక వసతులు లేకపోవడంతో గూడెం నుంచి 68 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముందుకొచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
తాగునీరు సరిగ్గా లేదు..పశువులకు సైతం నీరు అందుబాటులో లేదు.వారి గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేదు.కొండగుట్టలు, చెట్లు పుట్టల మధ్య నుంచి నడిచివెళ్లాలంటూ ఆవేదన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం పాదయాత్రగా పిల్లాపాపలతో మూట ముల్లెలతో కలెక్టరేట్ ముందుకొచ్చారు. అధికారులు ఎవ్వరు స్పందించలేదు..అందుకే అక్కడే టెంట్ వేసుకోని నిరవధిక రిలే నిరాహార దీక్షలకు దిగారు..దీక్షలు ప్రారంభమైన రోజు ఐటిడీఏ అధికారులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా దీక్ష విరమించలేదు.
తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని పట్టు బడుతున్నారు. ఎమ్మెల్యే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తే, వీళ్ల గ్రామం మాత్రం ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తోంది..ఆసిఫాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు,ఆఖరికి ఐటిడీఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతోనే ఇలా పాదయాత్ర, దీక్షలు చేస్తున్నామంటున్నారు..మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ బిడ్డలు.