హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ఎటు నిలబడతారో తేల్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హుజురాబాద్ లో ప్రధాన పోటీ అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ బీజేపీనే అని.. కాంగ్రెస్ నిన్నటి పార్టీ, దానికి రేపు లేదు అని ఎద్దేవా చేశారు. బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి, అందుకు ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేయాలి, భవిష్యత్ మనదే అంటూ కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.
కరోనాతో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది, అభివృద్ధి ఇతర కార్యక్రమంలో ఇబ్బందులొచ్చాయి. కరోనా మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణకు ఏమి ఇవ్వడం లేదని కేసీఆర్ చెప్తున్నారు, మీ చేతికిస్తేనే ఇచ్చినట్లా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని, తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు. ఉచిత వాక్సిన్ ఇస్తున్నాం, కరోనా వైద్య పరికరాలు ఇచ్చాము. మరి కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు. కేసీఆర్ ఉత్తరం రాయకముందే మార్చిలోనే తెలంగాణలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కు ఆమోదం తెలిపాము, వచ్చేనెల వస్తుందన్నారు.
ఇప్పటివరకు కోటి నాలుగు లక్షల డోసులు ఇచ్చాము, ఇంకా 25 లక్షల డోస్ లు తెలంగాణలో ఉన్నాయి. వాక్సిన్ విషయంలో భారత ప్రభుత్వం ప్రో యాక్టివ్ గా పనిచేసింది, ఎటువంటి పరిస్థితిని అయిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. థర్డ్ వేవ్ వస్తుందని తప్పుడు ప్రచారం చేయవద్దు.. అందరికి ధైర్యం కల్పించాలని కోరారు. బండి సంజయ్ పాదయాత్రను అందరూ విజయవంతం చేయాలంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కృష్ణా వాటర్ వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీద వేస్తుంది. దావత్ లు చేసుకున్నప్పుడు, ఆస్తులు పంచుకున్నప్పుడు మీరు ఏమి చేశారన్నారు. ఏపీ ప్రజలను రాక్షసులుగా సృష్టిస్తున్నారు, ఇది మంచిది కాదన్నారు. జల వివాదలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని తేల్చాలి, ఎన్నికల సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని కిషన్ రెడ్డి కోరారు.