Telangana Legislative Council Live Updates.
మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కార్యాలయం పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బస్సుల సంఖ్య తగ్గించకుండా ప్రజా రవాణాను అందరికి అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి పడిన రెండు పీఆర్సీలు, రెండు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. రేండేళ్లు ఆర్టీసీ సంఘాలు ఉండకూడదన్నారు, ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నర్సిరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మరో సభ్యుడు ఎమ్మెస్ ప్రభాకర్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొడు భూములకు హక్కులు కల్పించాలని సీనియర్ సభ్యులు జీవన రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అటవీ భూముల పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ భూములను కూడా పొడు భూములుగా చూపిస్తూ ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములకు జాతీయ బ్యాంక్ లు రుణాలు ఇస్తున్నారు కానీ సహకార సంఘాల బ్యాంక్ లు ఇవ్వడం లేదని, అలాగే ధాన్యం సేకరణ కేంద్రాలను తెరవాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలో ప్రభుత్వ మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు దండె విఠల్. నెల్లికల్ ప్రాజెక్ట్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్‌సీ కోటిరెడ్డి కోరారు. ఇక, 90,000 ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు ప్రకటించినందుకు గాను సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు వాణీదేవి. పోటీ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంధాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షల పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని గ్రంధాలయాల్లో ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంచాలని ఆమె ప్రభుత్వానికి సూచించారామె.
రెండవ విడత గొర్రె పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని ఎగ్గే మల్లేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో రంజాన్ ఉన్నందున అన్ని జిల్లా కలెక్టర్లతో ఉన్నతాధికారుల తో సమావేశం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ సమావేశానికి జిల్లాలో ఉన్న ముస్లిం నాయకులను కూడా ఆహ్వానించాలని ఫారూక్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు.
1996 బ్యాచ్ ఇన్స్‌పెక్టర్లలో వరంగల్ జోన్ మినహా మిగతా వారికి ప్రమోషన్లు ఇచ్చారని, వరంగల్ జోన్ కు చెందిన వారికి కూడా పదోన్నతి కల్పించాలని బానుప్రసాద్ హోం శాఖను కోరారు. దళిత బంధు, రైతు బంధు పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు.
మరోవైపు, మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడంతో సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్భంగా మండలిలో జరిగిన చర్చలో సభ్యులు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పటానికి బదులు కావాలని రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు కల్వకుంట్ల కవిత.
రాజకీయం కోసమే ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమిదికి తీసుకు వచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. మున్సిపాల్టీలతో పాటు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీలలో చేస్తున్న వారికి కూడా మార్కెట్ కమిటీలలో ప్రభుత్వం తీసుకువచ్చిన అమెండమెంట్ బిల్లును అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతు బంధు వస్తున్న ప్రతి ఇంట్లో కేసీఆర్ బొమ్మ ను ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలన్నారు వెంకట రామిరెడ్డి. కేంద్రం వ్యవసాయ మార్కెట్లను తొలగిస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు కల్పించి వాటిని అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు.