టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ స్థానాలకు పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హెటిరో సంస్థ అధినేత డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికచేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక రాజ్యసభ స్థానానికి రేపే ఆఖరు తేదీ ఉండటంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది.
డీ. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, బండ ప్రకాష్ ముగ్గురి స్థానాల్లో ముగ్గురి పేర్లను ప్రకటించారు. డీ. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీ కాంత రావు పదవి కాలం అయిపోయింది. బండ ప్రకాష్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది.
ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా…మరొకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు. డా. పార్థసారధి టీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఇక వద్ది రాజు రవిచంద్ర 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి గ్రానైట్ వ్యాపారి, టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర( గాయత్రి రవి)ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.