తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టే ఈ కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతుల ధాన్యం కొనుగోలు అంశంపై ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారుల రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేయడం, మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 11న ఢిల్లీలో నిరసన దీక్ష కూడా ఉంటుందన్నారు. కాగా రేపు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలపై ఆదివారం మధ్యాహ్నం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో మంత్రి ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొన్నారు.