గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆ సభకు 2 లక్షల మంది వరకు వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు.. అయితే, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు? అని ప్రశ్నించారు.. గజ్వేల్ కాంగ్రెస్ సభకు 2 లక్షల మంది వచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఆయన.. మరి 2 లక్షల మంది రానట్లు అయితే పీసీసీకి రాజీనామా చేస్తావా? అంటూ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారని ఫైర్ అయిన వంటేరు.. ఆయనతో కలిసి నేను 8 ఏళ్లు పనిచేశాను.. ఆయన ఒక డ్రామా కంపెనీ.. జై కొట్టే వాళ్లు – విజిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే వుంటారన్నారు. రేవంత్ కి దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలన్న ఆయన.. పథకాల పై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు అని సలహా ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి 35 వేల మంది ఉంటే- టీఆర్ఎస్ పార్టీకి 61 లక్షల మంది సభ్యత్వం ఉందన్న ఆయన.. గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారని కామెంట్ చేశారు.