ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. అందులోభాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.. ఇది నీ చేతకాని తనం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక, కేంద్రం వరి ధాన్యాన్ని కొనాలని వచ్చే శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు.. ధర్నాలకు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలిపోవాలని అన్నారు.. ఇక, వరి కొనగోళ్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. శుక్రవారం జరిగే ధర్నాలో మాతో కలిసి నువ్వు కూడా కూర్చుంటావా? అంటూ బండి సంజయ్‌కి సవాల్ చేశారు కేసీఆర్.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్.. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? లేదా ? అని నిలదీసిన ఆయన.. సమాధానం చెప్పే వరకు బీజేపీ నేతలని వదిలిపెట్ట౦ అని హెచ్చరించారు.. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం.. మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం అన్నారు.. మీ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉందన్నారు కేసీఆర్.. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు.. మిమ్మల్ని వదలం, వేటాడుతాం.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు పోరాడుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.