అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ఆయన మండిపడ్డారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి… కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని, నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం… నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందని, కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయండని ఆయన అన్నారు.