తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్‌లో కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు. గతంలో ఫ్లాట్ ఉన్నోళ్లకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు కుదించేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినంత గొప్పగా డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవని పెదవి విరిచారు. అసెంబ్లీలో నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని.. తెలంగాణ ఉద్యమంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నట్లు గుర్తుచేశారు. బడ్జెట్ సందర్భంగా సభలో ఆందోళన చేస్తే వెంటనే చర్యలు తీసుకోరు అని.. కానీ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బీజేపీ సభ్యుల సస్పెన్షన్ సరికాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంత పరంగా వ్యతిరేకం అయినా.. సభ్యుల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.