భారత్ అంటే తెలిసొచ్చింది.. ‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన పాకిస్తాన్..
భారతదేశాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ ‘‘అణు బెదిరింపులకు’’ పాల్పడేది. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఈ పరిస్థితిని భారత్ మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల్ని దేశంపై యుద్ధంగానే చూస్తామని, ఇకపై అణు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంగా పాకిస్తాన్‌కు తెలియజేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న పలు ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ అంటే ఏమిటో పాకిస్తాన్‌కు తెలిసొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. దేశ అణుకార్యక్రమాలు పూర్తిగా ‘‘శాంతియుత ప్రయోజనాలు, ఆత్మరక్షణ’’ కోసమని చెప్పారు. దురాక్రమణ కోసం కాదని అన్నారు. ప్రతీసారి, భారత్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్ తమపై దాడి చేయకముందు పాకిస్తాన్ నేతలు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడేవారు. తాజాగా, షరీఫ్ ప్రకటన చూస్తే ఇక భవిష్యత్తులో భారత్‌ని అణుముప్పుతో భయపెట్టలేమనేది స్పష్టంగా సూచిస్తుంది.
రూ. 500 నోటును బ్యాన్ చేస్తున్నారు? మెసేజ్ వైరల్..
రూ.2000 నోట్లు రద్దు అనంతరం.. రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును నిషేధించబోతోందా? దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ను ఎక్కువగా షేర్ చేయబడుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లను క్రమంగా ఉంచడం ఆపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించించినట్లు అందులో ఉంది. మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు ఏటీఎంలలో ఉంచడం ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. “సెప్టెంబర్ 30, 2025 నాటికి ఏటీఎంలో రూ.500 నోట్లు పెట్టడం ఆపాలని రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను కోరింది. మార్చి 31, 2026 నాటికి 75% బ్యాంకులు 90% ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను నిలిపివేయడమే లక్ష్యం. భవిష్యత్తులో, ఏటీఎంల నుంచి రూ.200, రూ.100 నోట్లు మాత్రమే బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీ వద్ద ఉన్న రూ.500 నోట్లను ఖర్చు చేయడం ప్రారంభించండి.” అని ఆ మెసేజ్‌లో రాసుకొచ్చారు.
సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని.. కేవలం 3000 కోట్ల రూపాయలే నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు.
ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..
జార్ఖండ్ ధన్‌బాద్‌లో మద్యం వ్యాపారులు తమ అవినీతిని పాపం ఎలుకలపై నెట్టేస్తున్నారు. ధన్‌బాద్‌లో ఇండియన్ మేడర్ ఫారిన్ లిక్కర్ నిల్వల్లో అవినీతినికి పాల్పడిన వ్యాపారులు, ఆ నెపాన్ని అమాయకపు ఎలుకలపై నెట్టేసే ప్రయత్నం చేశారు. నిల్వలు సరిగా లేవని వివరించలేదని వారు, దాదాపు 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 01న జార్ఖండ్ కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభించడానికి నెల రోజుల ముందు, ఎలుకలపై ఈ నేరాన్ని మోపారు.
కన్నీటి వీడ్కోలుతో ముగిసిన కోట అంత్యక్రియలు
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13 తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
వాట్సప్‌లో “హాయ్” అని పెడితే అన్ని మీదగ్గరకే..
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు… పార్టీ ఉండదు… రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా రైతులకు లబ్ధి చేకూరటమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమం భరోసా కల్పించే విధంగా సేవలతో ముందుకు సాగుతున్నామన్నారు.
బీహార్‌లో కాల్పుల కలకలం, 24 గంటల్లో నలుగురి హత్య..
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు. పాట్నాలోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వరసగా బీహార్‌లో జరుగుతున్న కాల్పుల ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. మృతుడు జితేంద్ర కుమార్ ప్రతీ రోజు సాధారణంగా వచ్చే టీ కొట్టు వద్ద ఈ హత్య జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత నేరస్తులు పారిపోయారు. పాట్నా ఎస్పీ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. కాల్పుల తర్వాత, అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని, గాయాల కారణంగా మరణించారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సైకోల్లా దాడులు చేస్తున్నారు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం..
బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కాదు మోసం గ్యారెంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు, కర్రలతో దాడిచేశారని.. దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన పనిలేదా? అని ప్రశ్నించారు. హారికపై దాడికి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..?
కడప జిల్లా బద్వేల్ లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు. విద్యుత్ శాఖపై రూ. 1.30 లక్షల కోట్ల భారాన్ని మోపిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని.. రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమన్నారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. పెట్టుబడులతో పాటు రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 లక్షల పీఎం కుసుమ్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిందని చెప్పారు.
సోనమ్ రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. బాధిత కుటుంబానికి ఏం చేసిందంటే..!
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలైన సోనమ్ రఘువంశీ ఫ్యామిలీ.. బాధిత కుటుంబానికి మేలు చేసే నిర్ణయం తీసుకుంది. రాజా రఘువంశీ కుటుంబం పెట్టిన రూ.16 లక్షల విలువైన వివాహ ఆభరణాలను తిరిగి ఇచ్చేసింది. ఇండోర్‌లో సోనమ్ సోదరుడు గోవింద్.. రూ.16లక్షల విలువైన వివాహ ఆభరణాలను రాజా కుటుంబానికి అప్పగించాడు. బంగారు ఉంగరం, గాజులు, నెక్లెస్ సహా ఆభరణాలు తిరిగి ఇచ్చేశాడు. వివాహం సందర్భంగా రాజా కుటుంబం నుంచి వచ్చిన బహుమతులన్నీ అప్పగించేశాడు. సోనమ్ పారిపోయే ముందు.. ఆభరణాలను తన తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వెళ్లింది. ఇక మంగళసూత్రం, వివాహ ఉంగరం మాత్రం పోలీసులు స్వాధీనంలో ఉన్నాయి. గోవింద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ద్వారా ఆభరణాలను అప్పగించారు. ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వడమే న్యాయమని గోవింద్ తెలిపారు. వాటిపై తమ కుటుంబానికి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. ఇక రాజా కుటుంబానికి పెట్టిన బహుమతులను తిరిగి తీసుకునేందుకు గోవింద్ కుటుంబం నిరాకరించింది. కన్యాదానం చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం భావ్యం కాదని సోనమ్ తండ్రి చెప్పుకొచ్చాడు.