జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..!
ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ సరసన నిలిచాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ఉన్నాడు. డికాక్ రికార్డును జేమీ స్మిత్ సమం చేశాడు. అంతేకాదు అతి తక్కువ బంతుల్లో (1303) టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్‌గా మరో రికార్డు సాధించాడు. సర్ఫరాజ్ అహ్మద్ (1311), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1330 ), నిరోషన్ డిక్వెల్లా (1367), క్వింటన్ డికాక్ (1375) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
“ఎన్నికల దొంగతనం”, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
కేంద్రం ఎన్నికల సంఘంపై శుక్రవారం రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ‘‘ఎన్నికల దొంగతనానికి’’ ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. అయితే, ఈసీ నిర్ణయాన్ని పలు పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..
భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం పెరిగిండి. ఆ దేశం నుంచి పలు ఆయుధాలను కొనుగోలు చేయాలని భావించింది. ఇప్పుడు పాకిస్తాన్ మిత్రదేశమైన టర్కీ నుంచి కూడా బంగ్లాదేశ్ ఆయుధాలను కొనేందుకు సిద్ధమైంది. టర్కీ బంగ్లాదేశ్‌లోని రక్షణ పరిశ్రమకు సహకరిస్తుందని టర్కీ ఉన్నత స్థాయి రక్షణ అధికారి మంగళవారం తెలిపారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు..
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కొన్ని వర్గాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని, పవర్ షేరింగ్ వంటి అంశాలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బలంగా, సమిష్టిగా పని చేస్తోందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు మితిమీరినవని, వారి మాటలకు మౌలికత లేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని, ప్రజాప్రతినిధిగా ఇది అతని బాధ్యత కింద వస్తుందని అన్నారు. గత పాలనను తాము విమర్శించడం సహజమేనని, కానీ ప్రస్తుతం ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందించడమే తమ ధ్యేయమని తెలిపారు.
ఇక అలాంటి ఆ ఫాస్టాగ్‌లు బ్లాక్‌లిస్ట్‌లోకే.. NHAI కొత్త నిబంధన..!
మీ వాహనంలో ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయకపోతే.. ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే.. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కారు విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయని వారిపై కఠిన చర్యలకు పిలుపునిచచింది. వాస్తవానికి.. విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడాన్ని ‘లూజ్ ఫాస్టాగ్’ అంటారు. అలాంటి యూజర్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో వేస్తామని స్పష్టం చేసింది.
తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?.. వరుదు కళ్యాణి సెటైర్లు!
మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు. 50 మంది మహిళను నెల రోజుల నుంచి వేధిస్తే.. పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలో డ్రగ్స్ దొరకడం దారుణ ఘటన అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటనపై ఆమె ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎడ్‌సెట్, పీఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education – TGCHE) శుభవార్త అందించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను TG Ed.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ – B.Ed) , TG P.E.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – B.P.Ed, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – D.P.Ed) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన అడ్మిషన్స్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. TGCHE చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్‌లు ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్. వెంకటేష్, కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని కౌన్సెలింగ్ తేదీలపై చర్చించారు.
హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.
జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ యువతను ట్రాప్ చేసి, వారిని వివాహం చేసుకుని, ఇస్లాంలోకి మార్చాలనే పెద్ద నెట్‌వర్క్‌ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఛంగూర్ బాబా ఉన్నాడు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ మతమార్పిడుల కోసం నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. నేపాల్‌తో ముడిపడి ఉన్న నిధుల జాడను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఛంగూర్ బాబా గత మూడేళ్లలో సుమారు రూ. 500 కోట్ల విదేశీ నిధులు అందుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సంస్థలు ఇప్పటి వరకు రూ. 200 కోట్లను గుర్తించారు. మిగిలిన రూ. 300 కోట్ల నిధులు వివిధ జిల్లాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ దేశాల నుంచి నేపాల్ ద్వారా ఈ నిధుల్ని మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయి.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన.. హిందుత్వ కోసం పోరాటం కొనసాగుతుంది
గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోరక్షణ కోసం కృషి చేశాను,” అంటూ తన విధేయతను గుర్తు చేశారు.
మహిళా సంఘాలకు భారీ ఆర్థిక సహాయం.. రూ.344 కోట్లు విడుదల
మహిళల ఆర్థిక సాధికారతకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి వడ్డీ లేని రుణాల రూపంలో భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. ఈ నిధులను సోసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ద్వారా జూలై 12 నుంచి 18 తేదీల మధ్య మహిళా సంఘాల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేయనున్నారు.